కార్లకు స్టార్‌ రేటింగ్‌..

ABN , First Publish Date - 2022-06-26T08:21:06+05:30 IST

భద్రత ప్రమాణాల ఆధారంగా కార్లకు స్టార్‌ రేటింగ్‌ కేటాయించే కార్యక్రమం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

కార్లకు స్టార్‌ రేటింగ్‌..

వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి అమలు 

న్యూఢిల్లీ: భద్రత ప్రమాణాల ఆధారంగా కార్లకు స్టార్‌ రేటింగ్‌ కేటాయించే కార్యక్రమం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భారత్‌ న్యూ కార్‌ అసె్‌సమెంట్‌ ప్రోగ్రామ్‌ (భారత్‌ ఎన్‌సీఏపీ)లో భాగంగా క్రాష్‌ టెస్ట్‌లో పనితీరు ఆధారంగా వాహనానికి రేటింగ్‌ కేటాయించనున్నారు. 3.5 టన్నుల లోపు బరువు ఉండి, దేశీయంగా తయారైన లేదా దిగుమతి చేసుకున్న ఎం1 కేటగిరీ వాహనాలకు భారత్‌ ఎన్‌సీఏపీ వర్తిస్తుందని శనివారం విడుదల చేసిన ప్రకటనలో కేంద్రం స్పష్టం చేసింది. డ్రైవరు సీటుకు అదనంగా 8 సీట్లు కలిగి ఉండి, ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఉపయోగించే వాహనాలు ఎం1 కేటగిరీలోకి వస్తాయి. టెస్టింగ్‌ ఏజెన్సీల ప్రాంతాల్లో వాహనాలకు భద్రత పరీక్షలను నిర్వహించనున్నారు. కార్ల కంపెనీల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడంతోపాటు కొనుగోలుదారులు స్టార్‌ రేటింగ్‌ ఆధారంగా భద్రమైన కార్లను ఎంపిక చేసుకునేందుకు భారత్‌ ఎన్‌సీఏపీ దోహదపడనుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ ట్వీట్‌ చేశారు. 


కార్యక్రమం ప్రవేశపెట్టేందుకు జారీ చేసిన ముసాయిదా జీఎ్‌సఆర్‌ నోటిఫికేషన్‌ను గడ్కరీ శుక్రవారం నాడు ఆమోదించారు. క్రాష్‌ టెస్ట్‌లో గుర్తించిన భద్రత స్థాయి ఆధారంగా వాహనానికి 1 నుంచి 5 స్టార్ల వరకు రేటింగ్‌ కేటాయించనున్నారు. 2020లో దేశవ్యాప్తంగా 3,66,138 రోడ్డు ప్రమాదాలు జరుగగా.. తత్ఫలితంగా 1,31,714 మంది చనిపోయారు. వాహన ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చే ఉద్దేశంతోనే కేంద్రం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. 2024 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను సగానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గడ్కరీ ఈ మధ్యనే ఓ సదస్సులో పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-26T08:21:06+05:30 IST