
యూట్యూబ్ ఛానెల్ పేరు ‘అమ్మా కీ థాలీ’.. సబ్స్క్రయిబర్ల సంఖ్య పదిహేడు లక్షలు. ఈ యూట్యూబ్‌లో వంటలు చేస్తోంది.. ఉత్తరప్రదేశ్‌లోని రాఖ్వ జిల్లాకి చెందిన శశికళ చౌరాసియా. ఇంటర్నెట్ గురించి ఏమాత్రం అవగాహనలేని ఈ పేదింటి మహిళ ఇప్పుడు వంటల స్టార్‌గా గుర్తింపు సంపాదించుకుంది.
‘అమ్మా కీ థాలీ’ యూట్యూబ్ ఛానెల్లో కేవలం ఉత్తరప్రదేశ్‌లోని స్థానిక వంటలు కనిపిస్తాయి. అయితే వంటచేసే శశికళ కనిపించదు. ఆమె చెప్పే వంటల వీడియోలకు వీక్షకుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. వ్యవసాయకూలీగా బతికే ఆమె జీవితం 2016లో 4జితో మారిపోయింది. ఇపుడామె చుట్టుపక్క ఊళ్లలో పాపులర్ సెలబ్రిటీ.
శశికళ ఐదో తరగతి వరకు చదువుకుంది. తన ముగ్గురు పిల్లలైన చందన్, సూరజ్, పంకజ్‌ను జాగ్రత్తగా చూసుకోవడమే తెలుసు. టెక్నాలజీ అనే మాటే తెలీదు. 2016లో తన పెద్ద కొడుకు ఇంటర్నెట్లో వీడియోలు చూశాడు. సోషల్ మీడియాలో తన ఫ్రెండ్స్ వ్లాగర్స్గా మారటం చూశాడు. దాని ప్రభావంతో ఏదైనా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాలనుకున్నాడు. ‘నువ్వు వంట అద్భుతంగా చేస్తావు. వీడియో తీస్తా వండు’ అన్నాడు పెద్దబ్బాయి చందన్. కొన్ని వంట వీడియోలను చూపించాడు. వీడియోలతో డబ్బులు సంపాదిస్తారనే విషయం తెలీదు ఆమెకి. బిడ్డల కోరిక మేరకు వొప్పుకుంది. అయితే ‘వీడియోలో నేను కనిపించను’ అన్నది. అలా 2017 నవంబర్‌లో ఛానెల్ ఫ్రారంభించారు. చందన్ టెక్నికల్‌గా ఎలా షూట్ చేయాలో చూసుకున్నాడు. పంకజ్ వీడియో షూట్ చేయటం, సూరజ్ ఎడిట్ చేశాడు. తొలి వీడియో పదిమందికంటే ఎక్కువ చూడలేదు. అందరూ నిరాశతో కుంగిపోయారు. అయినా మరుసటి రోజునుంచి వీడియోలు అప్లోడ్ చేయాలనుకున్నారు. ఐదునెలల తర్వాత వీక్షకుల సంఖ్య పెరిగింది. మే 2018లో శశికళ చేసిన మామిడికాయ ఊరగాయ రెసిపీని వేలమంది చూశారు. ఇప్పటికీ ఆ వీడియోను రెండుకోట్ల అరవై లక్షల మంది చూశారు.
వీడియోల సంఖ్య 730. అన్ని వీడియోలను కలిపి దాదాపు ఇరవై ఏడు కోట్ల మంది ఈ యూట్యూబ్ ఛానెల్‌ను చూశారు. అమెరికా, దుబాయ్, పాకిస్తాన్, ఫిజితో పాటు చాలా దేశాల్లో ఈ ఛానెల్ సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ‘ఊరగాయ చేయడానికి బెల్లం వాడేది మా అమ్మ. రసగుల్ల, గులాబ్‌జామ్ సులువుగా ఎలా చేయాలో చెబితే లక్షల సంఖ్యలో చూశారు. ఒక్కోనెల లక్షల్లో డబ్బులు వస్తాయి. ఇదంతా మా అమ్మ చలవే. ఆమె చెప్పిన వంట రహస్యాల వల్లే ఇలా ఉన్నా’నంటుంది శశికళ. కెమెరాను చూడాలంటే సిగ్గు పడే ఆమె ఇపుడు హిందీలో ఎలా మాట్లాడాలో తెలుసుకుంది. ఒకప్పుడు బంధువులకు, ఊర్లో కొందరికి తెలిసి ఆమె వంటకు ఇపుడు హద్దుల్లేవు. ‘అమ్మతో ఇలా కెరీర్ స్టార్ట్ చేసి విజయం సాధించటం ఊహించలేదు. మా అమ్మతో సెల్ఫీలు దిగుతుంటే మాకు గొప్పగా అనిపిస్తుంది’ అంటారు ఆ ముగ్గురు కొడుకులు.