మొదలైన జనం జాతర

ABN , First Publish Date - 2021-03-01T06:17:48+05:30 IST

సూర్యాపేట జిల్లాకేంద్రం సమీపంలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమైంది.

మొదలైన జనం జాతర
విద్యుద్దీపాలంకరణలో దురాజ్‌పల్లి పెద్దగట్టు పరిసరాలు

భక్తులతో కిక్కిరిసినపెద్దగట్టు 

గజ్జెల చప్పుళ్లు, బేరీల మోత 

గట్టుకు చేరుకున్న మకర తోరణం, దేవరపెట్టె 

జనజాతర ఆరంభమైంది. యాదవుల ఇష్టదైవం లింగమంతుడికి జేజేలు పలికేందుకు దారులన్నీ పెద్దగట్టుకు చేరాయి. ఓలింగా.. ఓలింగా.. అంటూ చిన్నా.. పెద్ద.. శృతి కలిపారు. గజ్జెల చప్పుళ్లు, బేరీల మోత మోగించారు. యువతీ, యువకుల కేరింతలతో పెద్దగట్టు సందడిగా మారింది. విద్యుద్ధీపాలంకరణలో ఆలయ పరిసరాలు చూడముచ్చటగా కన్పించాయి. 

చివ్వెంల ఫిబ్రవరి 28: సూర్యాపేట జిల్లాకేంద్రం సమీపంలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఆదివారం అర్ధరాత్రి  ప్రారంభమైంది. గంపలు, బోనాలు తలపై పెట్టుకుని, కటారీలు చేతపట్టుకొని, భేరీలు మోగిస్తూ.. కాళ్లకు గజ్జెలు కట్టి నృత్యాలు చేస్తూ బోనాలు సమర్పించారు. ఓ లింగా.. ఓ లింగా.. అంటూ గుడిచుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేసి, స్వామికి జంతువులు బలి ఇచ్చారు. ఉదయం నుంచే సూర్యాపేట జిల్లాకేంద్రం, పరిసర ప్రాంతాల భక్తులు లింగమంతులస్వామి, ఆకుమంచమ్మ, యలమంచమ్మ, సౌడమ్మ దేవతలను దర్శించుకున్నారు. కోనేరులో భక్తులు స్నానాలు ఆచరించి సారలమ్మకు, నాగదేవతకు, ఎల్లమ్మత ల్లికి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్న సమయంలో సూర్యాపేట గొల్లబజార్‌లోని యాదవుల కుల దేవాలయం నుంచి కటారీ విన్యాసాల మధ్య సంప్రదాయబద్ధంగా మకర తోరణాన్ని దురాజ్‌పల్లిగుట్టకు తరలించారు.  


ప్రత్యేక పూజల్లో మంత్రి జగదీష్‌రెడ్డి

విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పెద్దగట్టుపై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. లింగమంతుల స్వామికి పట్టువస్ర్తాలు తీసుకొచ్చిన ఆయన, మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనవెంట ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ తదితరులు ఉన్నారు. 


పెద్దగట్టుకు తరలిన దేవరపెట్టె

 సూర్యాపేట మండల పరిధిలోని కేసారం గ్రామం నుంచి చౌడమ్మ-అందేలమ్మ దేవతల విగ్రహాలతో కూడిన దేవరపెట్టె ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దగట్టుకు చేరింది. ఆదివారం రాత్రి యాదవులు సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరకు సిద్ధం చేశారు. మంత్రి జగదీష్‌రెడ్డి గొర్ల వారి కుటుంబం నుంచి పట్టువస్త్రాలను పాదయాత్రగా మంత్రి దేవరపెట్టె వద్దకు తీసుకువచ్చారు. 


నేటి నుంచి విద్యా సంస్థలకు సెలవు

 దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతరను పురస్కరించుకొని ఈనెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో విద్యాసంస్థలకు ఈనెల 4 వరకు, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో నేడు, రేపు సెలవులు ప్రకటించారు. 


భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ తెలిపారు. దురాజ్‌పల్లి లింగమంతులస్వామి పెద్దగట్టు జాతర ఏర్పాట్లను ఆదివారం పరిశీలించి మాట్లాడారు. 1400 మంది పోలీస్‌ సిబ్బందితో 40 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్‌ కెమెరాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జాతర ప్రదేశం మొత్తాన్ని 12 సెక్టార్లుగా విభజించి, మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని, వారి సూచనలు పాటించాలని కోరారు.  

Updated Date - 2021-03-01T06:17:48+05:30 IST