పీఏగా మొదలు పెట్టి.. పిండుకుంటూ రిటైర్డ్‌

ABN , First Publish Date - 2022-07-02T06:42:38+05:30 IST

ఎస్కేయూ పరిధిలో ఐదు క్యాంపస్‌ కళాశాలలు, వందకుపైగా అనుబంధ కళాశాలున్నాయి. వీటి ద్వారా డిగ్రీ నుంచి పీహెచడీ వరకు వేలాది మంది చదువుతున్నారు.

పీఏగా మొదలు పెట్టి.. పిండుకుంటూ రిటైర్డ్‌

చెప్పినట్లే వచ్చాడు..!

మరుసటి రోజే ఆఫీసర్‌ ఆన డ్యూటీ

ఎస్కేయూలో రింగ్‌ మాస్టర్‌ రీ ఎంట్రీ

పనిచేసిన విభాగాల్లో అవినీతి మరక

ఉన్నతాధికారి  తీరుపై సిబ్బందిలో ఆగ్రహం


ఎస్కేయూ పరిధిలో ఐదు క్యాంపస్‌ కళాశాలలు, వందకుపైగా అనుబంధ కళాశాలున్నాయి. వీటి ద్వారా డిగ్రీ నుంచి పీహెచడీ వరకు వేలాది మంది చదువుతున్నారు. బోధన, పరిపాలనా విభాగాల్లో వందలాది మంది  ఉద్యోగులు ఉన్నారు. నిత్యం వందల ఫైళ్లకు వీసీ, రిజిస్ర్టార్‌ ఆమోద ముద్రవేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ప్రతి విభాగంలో ఒక అధికారి చక్రం తిప్పారు. 1985లో పీఏ టు రిజిసా్ట్రర్‌గా ఉద్యోగం పొందిన ఆయన, నిబంధనలకు విరుద్ధంగా 1997లో సూపరింటెండెంట్‌గా కన్వర్షన పొందారు. 2008లో అసిస్టెంట్‌ రిజిసా్ట్రర్‌గా, 2011లో డిప్యూటీ రిజిసా్ట్రర్‌గా, 2014లో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినర్‌గా పనిచేశారు. ఫైనాన్స ఆఫీసర్‌గా పనిచేస్తూ.. జూన 30న రిటైర్డ్‌ అయ్యారు. పనిచేసిన ప్రతి విభాగంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఉద్యోగ విమరణ పొందినా.. తాను తిరిగి వస్తానని ఆయన సవాలు చేశారట. అన్నట్లే.. మరుసటి రోజే వచ్చారు.

- అనంతపురం సెంట్రల్‌


ఘనుడే..

చేయి తడపనిదే ఏ ఫైలూ కదలదని బాధితులు వాపోతుంటారు. ఫైల్‌ కదలాలన్నా, ప్రమోషన రావాలన్నా ముట్టజెప్పాల్సిందే అంటారు. పరిపాలన విభాగంలో పనిచేస్తూ, జూన 30న ఉద్యోగ విరమణ చేశారు. ఈ విభాగంలో సొంత నిర్ణయాలు తీసుకుంటూ తమను ముప్పుతిప్పలు పెడతాడని కొందరు ఉద్యోగులు, సిబ్బంది వాపోయారు. సెంట్రల్‌ స్టోర్‌ ఇనచార్జిగా ఉన్న సమయంలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. టెన్తప్లాన పోస్టుల్లో నిబంధనలకు విరుద్ధంగా చేరినవారు ఆయన అండదండలతో కొనసాగుతున్నారు. నచ్చిన వారికే ప్రమోషన్లు వచ్చేలా చక్రం తిప్పుతారని, లేకుంటే పాతాళానికి తొక్కేస్తారని వర్సిటీ వర్గాలు అంటున్నాయి. అలాంటి వ్యక్తి ఉద్యోగ విరమణ పొందాక, వర్సిటీ యాజమాన్యం ఆఫీసర్‌ ఆన డ్యూటీ బాధ్యతలను అప్పగించడం దుమారం రేపుతోంది.


వర్సిటీ నిధులకు గండి...

వర్సిటీఉద్యోగులపై నిందలు వేయడం, తాను అన్ని పనులూ సక్రమంగా చేస్తానని  వీసీలు, రిజిసా్ట్రర్‌లను బురిడీ కొట్టించడంలో ఆయన రాటుదేలాడట. అతని సర్వీసులో లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడ్డారని వర్సిటీ వర్గాలు అంటున్నాయి. ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏఆర్‌గా ఉన్న సమయంలో కంప్యూటర్‌, ఫర్నిచర్‌ కొనుగోళ్లలో రూ.లక్షలు దండుకున్నారని చెబుతారు. పరీక్షల విభాగంలో స్టేషనరీ, ప్రింటింగ్‌ ఆర్డర్స్‌లోనూ జేబు నింపుకున్నాడని సమాచారం. సర్టిఫికెట్లు మంజూరు చేసేందుకు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసేవాడని, ఈ క్రమంలో కొందరు విద్యార్థులు ఆయనపై దాడి చేశారని ప్రచారం ఉంది. ఫైనాన్స విభాగంలో ఎఫ్‌ఓగా ఉన్నప్పుడు దూర విద్య బిల్లుల్లో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. పర్చేజ్‌ కమిటీ సభ్యుడిగా కొనసాగిన సమయంలో బినామీల పేరుతో అధిక ధరలకు కొనుగోలు చేయించి, వర్సిటీ నిధుల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. 


కామధేనువు..

యూజీసీ నిబం ధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న టెన్తప్లాన ఉద్యోగుల నుంచి ఆయన భారీగా దండుకుంటున్నారని సమాచారం. కోర్టు, పరిపాలనా వ్యవహారాల్లో అక్రమాలను సక్రమంగా ఎలా మార్చుకోవాలో బాగా శిక్షణ ఇస్తారని అంటారు. కేరీర్‌ అడ్వాన్స స్కీమ్‌ చేసి, రివైజ్డ్‌ పేస్కేల్‌ను వర్తింపచేయడానికి వారి నుంచి రూ.30లక్షలు దండుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. సీఏఎస్‌ ప్రక్రియలో భాగస్వాములైన కొందరు అధికారులకు కొంత వాటా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 


ఆయనంటే పడదు.. 

వర్సిటీ ఉద్యోగుల్లో 90శాతం మందికి ఆయనంటే సరిపడదని వీసీ రామకృష్ణారెడ్డి ఒక వేడుకలో బహిరంగంగా వ్యాఖ్యా నించారు. ఆ అధికారికి ఓ అవార్డును ఇచ్చే సమయంలో ఇలా మాట్లాడారు. కొందరు వీసీలు, రిజిసా్ట్రర్ల అండతో అక్రమంగా రూ.లక్షలు వెనకేసుకున్నా, వారు రిటైరైన తర్వాత ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులో చుక్కలు చూపినట్లు సమాచారం. ఇతడి ఎదుగుదలకు సహకరించి, ఆనక అవమానానికి గురైన వారు గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. 


వదల బొమ్మాళీ..

ఉద్యోగ విరమణ పొందినా, తిరిగి వస్తానని ఆయన ముందే హెచ్చరించారని, సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశాడని వర్సిటీ వర్గాలు వాపోతున్నాయి. పరిపాలనా విభాగంలో డిప్యూటీ రిజిసా్ట్రర్‌గా ఉండే సమయంలో, తన స్థాయి కంటే కింద ఉండే రెండు కీలక పోస్టులను భర్తీ కాకుండా చూసుకున్నారు. నిర్ణయాలు తీసుకునేందుకు, ఫైళ్లను పాస్‌ చేసేందుకు ప్రతి విభాగంలో మూడుస్థాయిల్లో చర్చించి ఆమోదం తెలపాలి. కానీ ఆయన ఆ రెండు స్థానాల్లో ఎవరూ రాకుండా చేసి, తానే అంతా నడిపించారు. ఇందుకు వర్సిటీ ఉన్నతాధికారి సహకరించారని వర్సిటీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అనుభవం, అర్హత ఉన్న చాలామంది ఉద్యోగులు ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వారిని కాదని, ఉద్యోగ విరమణ పొందిన, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఆఫీసర్‌ ఆన డ్యూటీగా ఎలా అవకాశం కల్పిస్తారని వర్సిటీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నాయి. 


ఎవరూ లేరు మరి..

క్యాంపస్‌ అంతా వెదికినా డీఆర్‌ పొజిషన చూసేవారు ఎవరూ లేరు. ప్రభుత్వానికి అర్జెంటుగా లెటర్‌ రాసేవారూ లేరు. జీఓలు, చట్టాలపై అవగాహన ఉండాలి. ప్రత్యుత్తరాలు రాసే సమయంలో సంబంధిత సెక్షన్లను కోట్‌ చేయాలి. ఇలాంటివన్నీ తెలిసిన వారులేరు. తప్పులు రాయిస్తే నాకు మాటవస్తుంది. అందుకే ఆయనకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించాను. కారు, డీజిల్‌ ఖర్చులకు కన్సాలిడేట్‌ పే చెల్లించి, ఆఫీసర్‌ ఆన డ్యూటీగా తీసుకున్నాము.

- ప్రొఫెసర్‌ రామకృష్ణారెడ్డి, ఎస్కేయూ వీసీ 

Updated Date - 2022-07-02T06:42:38+05:30 IST