ఆరంభంలో అధిక వర్షాలు.. ఇప్పుడు బెట్ట, తెగుళ్లు

ABN , First Publish Date - 2021-01-11T05:23:54+05:30 IST

ఎర్రబంగారమని పిలిచే ఎండుమిర్చి ధరలు దిగజారుతున్నాయి. నెల వ్యవధిలో రకాన్ని బట్టి క్వింటాకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకూ పడిపోయాయి. అత్యధికంగా తేజ్‌ రకం క్వింటాకు రూ.5వేలు తగ్గింది. ఇది మిర్చి రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.

ఆరంభంలో అధిక వర్షాలు..  ఇప్పుడు బెట్ట, తెగుళ్లు
మిర్చికి నీరు పెట్టేందుకు అరకతో దారులు చేస్తున్న రైతు

మిర్చి రైతుకు దడ

పెరుగుతున్న పెట్టుబడులు

దిగజారుతున్న ధరలు 

నెల వ్యవధిలో క్వింటాకు 

రూ.5వేలు తగ్గుదల

వెంటాడుతున్న తీవ్ర నష్ట భయం

ఆందోళనలో రైతులు

కౌలుదారుల పరిస్థితి మరీ దారుణం





చీరాల, జనవరి 10 :  మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాది సాగు ఆరంభం నుంచి వెంటాడుతున్న ప్రతికూల వాతావరణం వారిని తీవ్రంగా దెబ్బతీస్తోంది. మరోవైపు విజృంభిస్తున్న తెగుళ్లు వెన్ను విరుస్తున్నాయి. తొలుత అధిక వర్షాలతో పంట దెబ్బతిని తిరిగి నాట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడగా, ఇప్పుడు వర్షం లేక పైరు బెట్టకు వస్తోంది. దీంతో తడి అందించేందుకు అదనపు పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఫలితంగా ఖర్చులు తడిసి మోపెడవుతుండగా, దిగుబడులు దిగజారే పరిస్థితి కనిపిస్తోంది. ఇదేసమయంలో మార్కెట్‌లో ధరలు తగ్గడం  రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. మరింత పడిపోతే ఈ ఏడాది భారీ నష్టాలు ఖాయమని వారు కలత చెందుతున్నారు. మరోవైపు గత ఏడాది పంటను కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేసిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. అప్పటి ధరలతో పోల్చుకుంటే ప్రస్తుతం క్వింటాకు రూ.5వేల వరకూ పడిపోవడంతో వారు కన్నీరు పెడుతున్నారు. 


ఎర్రబంగారమని పిలిచే ఎండుమిర్చి ధరలు దిగజారుతున్నాయి. నెల వ్యవధిలో రకాన్ని బట్టి క్వింటాకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకూ పడిపోయాయి. అత్యధికంగా తేజ్‌ రకం క్వింటాకు రూ.5వేలు తగ్గింది. ఇది మిర్చి రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాది సాగు ఆరంభం నుంచి నెలకొన్న ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి పంటను కాపాడుకుంటున్న వారు ఇప్పుడు ధరలు దిగజారుతుండటాన్ని చూసి దిగాలు పడుతున్నారు.


పెరిగిన సాగు విస్తీర్ణం

గత ఏడాది మిర్చి రైతుల పంట పండింది. దిగుబడులతోపాటు, ధరలు ఆశాజనకంగా ఉండటంతో లాభాలు కళ్లజూశారు. ఆ తరువాత కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ ఉంచుకుని సమయానుకూలంగా మార్కెట్‌ ధరలను పరిశీలిస్తూ విక్రయాలు జరుపుకున్న వారికి గణనీయమైన లాభాలు దక్కాయి. అదేసమయంలో శనగ రైతులకు ఆశించిన ధరలు లభించలేదు. దీంతో ఏడాది ఎక్కువ మంది మిర్చి సాగు వైపు మొగ్గు చూపడంతో విస్తీర్ణం పెరిగింది. జిల్లావ్యాప్తంగా సుమారు 70వేల ఎకరాల్లో రైతులు మిర్చి నాట్లు వేశారు. 


వెంటాడుతున్న ప్రతికూల వాతావరణం

ఈ ఏడాది సాగు ఆరంభం నుంచి ప్రకృతి ప్రతికూలత వెంటాడుతోంది. నివర్‌ తుఫాన్‌కు ముందు అధిక వర్షాలు కురిశాయి. అనంతరం తుఫాన్‌ ప్రభావంతో కుండపోతగా పడ్డాయి. దీంతో అనేక ప్రాంతాల్లో పంటకు నష్టం వాటిల్లింది. ముదురు, పల్లపు ప్రాంతాల్లో పంటలో కొంత భాగం దెబ్బతింది. దీంతో రైతులు తిరిగి నాట్లు వేయాల్సి వచ్చింది. ఇతర రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి నెలకొనడం, అక్కడి వారు నారు కోసం జిల్లాకు రావడంతో డిమాండ్‌ ఏర్పడింది. నారు ధర అమాంతం పెరిగింది. అయినప్పటికీ రైతులు నారు కొనుగోలు చేసి తిరిగి నాట్లు వేశారు. 


బెట్టకొస్తున్న పైరు.. ఆశిస్తున్న తెగుళ్లు

గత నెల వరకూ అధిక వర్షాలు కర్షకులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఇప్పుడు బెట్ట వాతావరణం నెలకొంది. దీంతో పైరుకు నీరు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు నీటి తడులు ఇస్తుంటే మరి కొందరు అందుకు అవసరమైన వనరులు సమకూర్చుకుంటున్నారు. బెట్ట వాతావరణంతో తెగుళ్లు కూడా విజృంభిస్తున్నాయి. అక్కడక్కడా బొబ్బర తెగులు కనిపిస్తోంది.  ప్రస్తుతం మంచు ఎక్కువగా కురుస్తోంది. ఈ వాతావరణంలో తెగుళ్లు మరింత విజృంభించే అవకాశం ఉంది. దీంతో బొబ్బర నివారణతోపాటు, తెగుళ్లు ఆశించిచకుండా రైతులు మందులు పిచికారీ చేస్తున్నారు. అందుకు అదనంగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. 


ఎకరాకు రూ. 50వేల వరకూ అదనంగా ఖర్చు

జిల్లాలో అత్యధిక ప్రాంతాల్లో నాట్లు వేసి 80 రోజులు పూర్తయింది. సాధారణంగా ఎకరా పైరుకు కౌలుతో కలిపి ఈ సమయానికి రూ. 50 నుంచి రూ. 60వేల వరకూ ఖర్చు చేస్తారు. అందులో కౌలు రూ. 25వేలు ఉంటుంది. కానీ అధిక వర్షాలతో మళ్లీ నాట్లు వేయాల్సి వచ్చింది. ఇప్పుడు తెగుళ్లు ఆశించాయి. బెట్టకు వస్తున్న పంటకు నీటి తడులు అందించాల్సి వస్తోంది. దీని వలన ఎకరాకు అదనంగా రూ. 20వేల వరకూ ఖర్చు చేయాల్సి వస్తోంది. పంట చేతికి వచ్చే సరికి ఎకరాలకు రూ. 1.50లక్షల వరకూ పెట్టుబడి అయ్యే అవకాశం ఉంది. కోతలకు కూలీ రూ. 40వేల వరకూ అవుతుంది. దీన్ని కూడా కకలుపుకుంటే ఎకరాకు పెట్టుడి ఖర్చులు దాదాపు రూ. 2లక్షల వరకూ అయ్యే అవకాశం ఉంది. అలా ఈ ఏడాది పెట్టుబడి ఖర్చు ఎకరాకు రూ. 50వేల వరకూ అదనంగా పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

 

దిగుబడులు తగ్గే అవకాశం.. దిగజారుగుతున్న ధరలు 

గత సంవత్సరం ఎకరాకు మిర్చి దిగుబడులు 20 నుంచి 30 క్వింటాళ్ల వరకూ వచ్చాయి. ఈ ఏడాది ప్రకృతి ప్రతికూలత, తెగుళ్ల కారణంగా భారీగా తగ్గే అవకాశం ఉంది. ఎకరాకు 18 నుంచి 20 క్వింటాళ్లకు మించకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో ధరలు దిగజారుగుతున్నాయి.    నెలలో రకాన్ని బట్టి క్వింటాకు రూ. 2 వేల నుంచి రూ. 5వేల వరకూ తగ్గాయి. నెల క్రితం క్వింటా రూ.19వేలు ఉన్న తేజ్‌ రకం ప్రస్తుతం రూ.14వేలకు పడిపోయింది. రూ.15వేలు వరకు పలికిన ఇతర రకాలు ప్రస్తుతం రూ.12వేలు మాత్రమే ఉన్నాయి. ధరలు ఇంకా పడిపోతాయేమోనని, తీరా కొత్త పంట వచ్చాక  పరిస్థితి ఎలా ఉంటుందోనని సాగుదారులు ఆందోళన చెందుతున్నారు.


కౌలు రైతుల పరిస్థితి ఇబ్బందికరం

తమ పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉందని కౌలు రైతులు వాపోతున్నారు. మిర్చి సాగుకు సంబంధించి ముందస్తుగా కౌలు చెల్లించినవారు అధికంగా ఉన్నారు. ఇదిలావుంటే పంట నష్టపోయినవారికి సంబంధించి నష్టపరిహారం అందించేందుకు యంత్రాంగం చేసిన నమోదు ప్రక్రియలో చాలామందికి పరిహారం అందలేదు. దీంతో వారంతా తమకు పరిహారం అందేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు గత ఏడాది ఇంకా మంచి ధరలు లభిస్తాయన్న ఆశతో కోల్డ్‌ స్టోరేజీల్లో పంట నిల్వ చేసిన వారు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. 


ధరలు దిగ జారితే కష్టమే

నాగూర్‌వలి, మిర్చి రైతు, కుంకలమర్రు

మిర్చి ధరలు నిలకడగా ఉండటం లేదు. ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో తెలియదు. ప్రస్తుతం ధరలు తగ్గుతున్నాయి. ఈ ఏడాది నెలకొన్న పరిస్థితుల్లో ఇంకా పడిపోతే తీవ్రంగా నష్టపోతాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం  గరిష్ఠ ధరలు ఉండేలా చర్యలు చేపట్టాలి. 


కౌలు రైతులను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవాలి

సుబ్బారెడ్డి, మిర్చి రైతు, యర్రంవారిపాలెం

పెట్టుబడులు పెరుతున్నాయి. ధరలు తగ్గుతున్నాయి. ఏడు ఎకరాలు కౌలుకు చేస్తున్నా. సొంత భూములలో సాగుచేసే వారికన్నా కౌలుదారులకు కౌలు ధర అదనంగా పెట్టుబడిలో కలుస్తుంది. అలాంటపుడు పరిహారం అందేక్రమంలో కూడా కౌలు రైతులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ధరలు దిగజారకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.



Updated Date - 2021-01-11T05:23:54+05:30 IST