స్టార్టప్‌ విలేజ్‌ ఖాళీ

ABN , First Publish Date - 2022-07-07T09:23:04+05:30 IST

స్టార్టప్‌ విలేజ్‌ ఖాళీ

స్టార్టప్‌ విలేజ్‌ ఖాళీ

వైసీపీ వచ్చాక స్తంభించిన కార్యకలాపాలు

గతంలో విశాఖ ఐటీ పార్కులో ప్రారంభం

పలు సంస్థలతో కలిసి ఏంజెల్‌ ఫండ్‌ ఏర్పాటు

‘అసాప్‌’ అంటూ వైసీపీ ప్రభుత్వం కొత్త పాట

100 కోట్లు కేటాయిస్తామని ఏడాది క్రితం ప్రకటన

ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చని వైనం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ప్రపంచమంతా స్టార్ట్‌పల వెంట పరుగులు తీస్తోంది. యువతరం వినూత్న ఆలోచనలకు అండగా నిలవడానికి దేశంలోని అన్ని రాష్ర్టాలూ ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. స్టార్ట్‌పలు ఏర్పాటు చేయించి ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ప్రత్యేకంగా మెంటార్‌లను నియమించి విజయవంతం కావడానికి దోహద పడుతున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం, ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతో ప్రోత్సహిస్తున్నాయి. కానీ మన రాష్ట్రంలో వాటి ఉనికి లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందడం లేదు. దీంతో గత ప్రభుత్వ హయాంలో ఉన్నతాశయంతో ఏర్పాటు చేసిన విశాఖ ఐటీ పార్కులోని స్టార్టప్‌ విలేజ్‌ దాదాపు ఖాళీగా ఉంది. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏడేళ్ల క్రితం విశాఖపట్నంలోని రుషికొండ ఐటీ పార్కులో ‘ఏపీ సన్‌రైజ్‌ స్టార్టప్‌ విలేజ్‌’ ఏర్పాటు చేశారు. ప్రత్యేక భవనం నిర్మించి, అనుకూల వాతావరణం కల్పించారు. స్టార్ట్‌పలను విజయవంతం చేయడంలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిన కేరళ మెంటార్‌ సంజయ్‌ను తీసుకొచ్చి శిక్షణ ఇప్పించారు. ఎప్పటికప్పుడు సదస్సులు నిర్వహించి ప్రోత్సహించారు. సుమారు 30 స్టార్ట్‌పలకు అవకాశం కల్పించారు. సింగపూర్‌కు చెందిన గోవిన్‌ కేపిటల్స్‌ను ప్రత్యేకంగా రప్పించారు. వివిధ సంస్థలతో కలిసి ఏంజెల్‌ ఫండ్‌ కూడా ఏర్పాటు చేశారు. విజయవంతమైన స్టార్ట్‌పలను బయటకు పంపించి, కొత్తవారికి అవకాశం ఇచ్చేవారు. అయితే కేరళ నుంచి తరచూ రావడానికి సంజయ్‌ ఆసక్తి చూపకపోవడంతో స్టార్ట్‌పలను నాస్కామ్‌కు అప్పగించారు. ఆసక్తితో చాలామంది ముందుకు రావడం, వారందరికీ స్టార్టప్‌ విలేజ్‌లో ప్లగ్‌ అండ్‌ ప్లే స్థానం కల్పించడం వీలుకాక ‘వర్చువల్‌ స్టార్ట్‌ప’లను ప్రారంభించారు. ఇంటి నుంచే పనిచేసుకుంటే అవసరమైన సాయం ఇస్తామని ప్రకటించారు. ఆ క్రమంలో స్టార్టప్‌ విలేజ్‌ పేరును ‘ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ’గా మార్చారు. దానికి ప్రత్యేక సీఈఓను నియమించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి మారిపోయింది. విశాఖలో ఐటీ రంగంలో అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. సీఈఓను, స్టార్టప్‌ విలేజ్‌లో పనిచేసే ఉద్యోగులను ప్రభుత్వం తొలగించింది. స్టార్టప్‌ విలేజ్‌లో పేరుకు ఐదారు స్టార్ట్‌పలే ఉన్నాయి. మిగిలిన భవనాన్ని ఖాళీగా ఉంచారు. 


ప్రకటనతో సరి.. ప్రోత్సాహం ఏదీ? 

రాష్ట్రంలో స్టార్ట్‌పల ప్రగతి మందగించిందని గుర్తించిన ప్రభుత్వం గత జూలైలో ప్రకటించిన ఐటీ పాలసీలో వాటిని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తామని పేర్కొంది. ఇందుకోసం ‘యాక్సిలరేట్‌ స్టార్టప్స్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఎసాప్‌)’ పేరుతో కొత్త పథకం అమలు చేస్తామని తెలిపింది. వెంచర్‌ కేపటలిస్టులతో దీనికోసం ప్రత్యేకంగా రూ.100 కోట్లతో మూలధనం పెడతామని పేర్కొంది. స్టార్ట్‌పల ప్రగతి కోసం ప్రైవేటు సంస్థలు, యూనివర్సిటీలను అనుసంధానం చేస్తామని చెప్పింది. అయితే ఏడాదైనా ఇది ఆచరణలోకి రాలేదు. ఒక్క కొత్త స్టార్ట్‌పను కూడా ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలో స్టార్ట్‌పలు పెట్టాలనుకునే యువతకు ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం, మార్గదర్శనం అందడం లేదు. ఈ నేపథ్యంలో స్టార్ట్‌పలలో ఏపీ అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఐటీ సంస్థలకు మూడేళ్ల నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. దీంతో కొత్తవారు రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపడం లేదు.

Updated Date - 2022-07-07T09:23:04+05:30 IST