రెండేళ్లలో రాష్ట్రం అథోగతి

ABN , First Publish Date - 2021-07-25T06:20:12+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధోగతి పాల్జేశారని టీడీపీ ఒంగోలు పార్లమెంటు అఽధ్యక్షులు నూకసాని బాలాజీ ధ్వజమెత్తారు.

రెండేళ్లలో రాష్ట్రం అథోగతి
గుంతలను పూడుస్తున్న స్వామి, నూకసాని, ఉగ్ర, అశోక్‌రెడ్డి, నారాయణరెడ్డి, రమేష్‌ తదితరులు

టీడీపీ ఒంగోలు పార్లమెంటు అఽధ్యక్షుడు నూకసాని బాలాజీ 

కనిగిరిలో రోడ్ల గుంతలను పూడ్చిన తెలుగు తమ్ముళ్లు

కనిగిరి, జూలై 24: వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధోగతి పాల్జేశారని టీడీపీ ఒంగోలు పార్లమెంటు అఽధ్యక్షులు నూకసాని బాలాజీ ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ‘అవినీతి సంత.. రహదారిలో అడుగుకో గుంత’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నలుమూలల నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు అశేషంగా తరలివచ్చారు. పట్టణంలోని పామూరురోడ్డులో అమరావతి గ్రౌండ్స్‌లో జరిగిన సభలో బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో రహదారులన్నీ గోతులమయంగా మారాయని విమర్శించారు. ప్రజల ప్రాణాలు పోతున్నా వైసీపీ పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో పలుగు, పార చేతపట్టి స్వయంగా రోడ్ల గుంతలను తామే మరమ్మతులు చేస్తున్నామన్నారు. పట్టణంలోని కొత్తూరు వద్ద రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చి వినూత్న నిరసన తెలిపారు. పట్టణ సమీపంలోని పోలవరం రోడ్డులో లారీలతో వెడ్‌మిక్స్‌, డోజర్‌, నీటి ట్యాంకర్లను ఏర్పాటు మరమ్మతులు చేశారు.


చలనం లేని పాలకులు

అధ్వానపు రహదారులతో ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి  విమర్శించారు. మాజీ ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్‌రెడ్డి, కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్‌ 25వేల కిలోమీటర్లు రహదారి నిర్మాణాలు చేపట్టారన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో రోడ్లన్నీ ఎంతో సాఫీగా ప్రయాణం సాగేదన్నారు. కానీ నేడు వైసీపీ పాలనలో రోడ్లన్నీ గుంతలు పడి ప్రయాణం చేయాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారన్నారు. ఉగ్రనరసింహారెడ్డి ఎమ్యెల్యేగా ఉన్న సమయంలో ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స (నరేగా) నిధులతో గ్రావెల్‌ రోడ్లు వేశారని గుర్తుచేశారు. ఇప్పుడు స్వయంగా ఉగ్రనరసింహారెడ్డి రోడ్ల దుస్థితిని పరిశీలించి ప్రశ్నిస్తుండడంతో పాలకులు గుంతలు పూడ్చి హడావుడి చేస్తున్నారన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే పదవి చేపట్టాక పోలవరం రోడ్డు నిర్మాణమే నా మొదటి సంతకమని హమీ ఇచ్చిన మాట మరచి ప్రజలను వంచిస్తున్నారన్నారు. పాపం ఆయన ఇంతవరకు మొదటి సంతకమే పెట్టలేదేమో అని వ్యంగాస్త్రం విసిరారు.


ప్రత్యక్ష ఆందోళనకు నాంది : టీడీపీ ఇన్‌చార్జ్‌ ఉగ్ర

 రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని, కనిగిరిలో ఇకపై జరిగే ప్రత్యక్ష ఆందోళనకు ప్రస్తుత కార్యక్రమమే నాంది అన్నారు. ప్రజాసమస్యలపై ప్రత్యక్ష ఆందోళన చేయనున్నట్లు ఆయన హెచ్చరించారు. ప్రజల వెన్నంటే నిలుస్తూ ప్రజా సంక్షేమానికి పాటు పడతానన్నారు. కార్యక్రమంలో దర్శి, వైపాలెం ఇన్‌చార్జ్‌లు పమిడి రమే్‌షబాబు, గూడూరి ఏరిక్షన్‌బాబు, మహిళ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షురాలు రావుల పద్మజ, కార్యదర్శి గంగవరపు పద్మ, ప్రధాన కార్యదర్శి బీరం అరుణారెడ్డి, ఉపాధ్యక్షురాలు లక్ష్మీపద్మజ, మండవ లావణ్య, కనిగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, జంషీర్‌ అహ్మద్‌, రాచమల్ల శ్రీనివాసులరెడ్డి, ఫిరోజ్‌, కీలం ఇంధ్రభూపాల్‌రెడ్డి, ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, సానికొమ్ము తిరుపతిరెడ్డి, గాయం తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. 




Updated Date - 2021-07-25T06:20:12+05:30 IST