మహారాష్ట్ర కేబినెట్ భేటీ షురూ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఉద్ధవ్ థాక్రే హాజరు

ABN , First Publish Date - 2022-06-22T19:15:15+05:30 IST

రాజకీయ సంక్షోభం వేళ అత్యంత కీలకమైన మహారాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ భేటీ మొదలైంది. కరోనా బారినపడ్డ సీఎం ఉద్ధవ్ థాక్రే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు

మహారాష్ట్ర కేబినెట్ భేటీ షురూ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఉద్ధవ్ థాక్రే హాజరు

ముంబై : రాజకీయ సంక్షోభం వేళ అత్యంత కీలకమైన మహారాష్ట్ర  ప్రభుత్వం కేబినెట్ భేటీ మొదలైంది. కరోనా బారినపడ్డ సీఎం ఉద్ధవ్ థాక్రే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆయనే సారధ్యం వహిస్తున్నారు. మొత్తం 8 మంది మంత్రులు ఈ సమావేశానికి హాజరుకాలేదు. కాగా ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయబోరంటూ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ప్రస్తుతం కొనసాగుతున్న భేటీలో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. అసెంబ్లీ రద్దుకు సంబంధించిన ఆలోచనలేదని కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ వివరించారు. మరోవైపు తన వద్ద 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ రెబల్ గ్రూప్‌కి నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండే చేస్తున్న వ్యాఖ్యలను కమల్‌నాథ్ ఖండించారు.


ఏక్‌నాథ్ షిండే అధ్యక్షతన రెబెల్ ఎమ్మెల్యేల సమావేశం

ఇదే సమయంలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో ఏక్‌నాథే షిండే అస్సాంలోని గువహాటిలో సమావేశమయ్యారు. తొలుత గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న వీరంతా బుధవారం ఉదయం నాటికి అస్సాంకి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న మరుక్షణమే ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో సమావేశం ఏర్పాటైంది. సాయంత్రం శివసేన ఎమ్మెల్యేలు భేటీ కావాలంటూ ఆదేశాలు వచ్చిన కొద్ది సేపటికే ఈ సమావేశం ప్రారంభం కావడం గమనార్హం.


సాయంత్రం 5 గంటల భేటీ.. శివసేన ఎమ్మెల్యేలకు ఆదేశాలు..

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం వేళ బుధవారం సాయంత్రం 5 గంటలకు పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు శివసేన ప్రకటించింది. ముఖ్యమంత్రి  ఉద్ధవ్ థాక్రే అధికారిక నివాసం ‘వర్ష’లో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు శివసేన ప్రకటన విడుదల చేసింది. ఈ భేటీకి తప్పకుండా హాజరవ్వాలి. లేదంటే చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసింది.


వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  నాతో భేటీ అవ్వొచ్చు: గవర్నర్ కొశ్యారీ

బుధవారం ఉదయం కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆస్పత్రిలో చేరిన మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ కీలకమైన ప్రకటన చేశారు. ఎవరైనా గవర్నర్‌ను సంప్రదించాలనుకుంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలవొచ్చని ఆ రాష్ట్ర రాజ్‌భవన్ ప్రకటన విడుదల చేసింది. గవర్నర్‌కు స్వల్ప కొవిడ్ లక్షణాలు. ముందస్తు జాగ్రత్తగా ఆయన హాస్పిటల్‌లో చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. వేరే రాష్ట్ర గవర్నర్‌ ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టబోతున్నారనే వార్తల్లో నిజంలేదని రాజ్‌భవన్ స్పష్టం చేసింది. 

Updated Date - 2022-06-22T19:15:15+05:30 IST