విద్యారంగ పరిరక్షణకై రాష్ట్ర సదస్సు

ABN , First Publish Date - 2022-09-22T06:41:52+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే స్వపరిపాలనతో పాటు సుపరిపాలన అందిస్తానని, ప్రజాస్వామిక విధానాలతో, స్వయం గౌరవంతో బతికే రాష్ట్ర అభివృద్ధి చేస్తానని కేసీఆర్‌...

విద్యారంగ పరిరక్షణకై రాష్ట్ర సదస్సు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే స్వపరిపాలనతో పాటు సుపరిపాలన అందిస్తానని, ప్రజాస్వామిక విధానాలతో, స్వయం గౌరవంతో బతికే రాష్ట్ర అభివృద్ధి చేస్తానని కేసీఆర్‌ చేసిన వాగ్దానాలు నీటిమూటలయ్యాయి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ప్రైవేటీకరణ నిలిపివేయడం, రిజర్వేషన్ల అమలు, కుటుంబానికొక ఉద్యోగం ద్వారా నిరుద్యోగ నిర్మూలన, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ, అంతర్జాతీయ స్థాయి ఉన్నత ప్రమాణాలు, సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తాం వంటి వాగ్దానాలన్నీ ఎనిమిది సంవత్సరాలుగా అమలు కాలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం తెగించి పోరాడిన విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలేవీ నెరవేరకపోగా, విద్యారంగం పరిస్థితి నానాటికీ దిగజారుతోంది.


విద్యాసంస్థల పక్కా భవనాల సమస్య, అధ్యాపకుల–లైబ్రరీల కొరత, సంక్షేమ– గురుకుల–కాలేజీ– యూనివర్సిటీ హాస్టళ్లలో భోజన వసతి, మంచినీరు, చివరికి స్నానాల గదులు, మరుగుదొడ్ల సమస్య కూడా పరిష్కారం కావడం లేదు. విద్యాసంస్థల పేరుతో చలామణి అవుతున్న ఈ కార్పొరేట్‌ కేంద్రాలలో ఇక్కడి రాష్ట్ర మంత్రులే షేర్‌హోల్డర్లుగా మారడంతో ప్రభుత్వ అధికారులు క్రూరమైన, నీచమైన అవినీతి చర్యలకు పాల్పడుతున్నారు. దీనిమూలంగా విద్యార్థులు ఆత్మహత్యల వైపు నెట్టబడుతున్నారు. మరోపక్క జాతీయ విద్యావిధానం పేరుతో కుల వ్యవస్థను రక్షించి, పురుషాధిపత్యాన్ని, అసమానతలను, అంటరానితనాన్ని పెంచే భావజాలాన్ని విద్యారంగంలోకి ప్రవేశపెడుతున్నరు. ఊహాజనితమైన మూఢ–అంధ విశ్వాసాలతో కూడిన సనాతన కాలం నాటి చెల్లిపోయిన ఈ అశాస్త్రీయ చెత్తనంతా సిలబస్‌గా రూపొందించి రాజ్యాంగ స్ఫూర్తికి, లౌకిక–ప్రజాస్వామిక విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ నేరాలకు పాల్పడుతున్నరు.


ఈ విధానాలు, వ్యూహాలు, ఎత్తుగడలు, పథకాలు పేరేదైనా కానివ్వండి నేటి దేశ బ్రాహ్మణీయ, భూస్వామ్య, ధనస్వామ్య, కుల–వర్గ దోపిడీ వ్యవస్థను కాపాడడానికే. అందుకే విద్యార్థి నిరుద్యోగ సోదరులారా నేటి విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాడాల్సిన కర్తవ్యం మన ముందున్నది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 22న సూర్యాపేటలో భారీ ర్యాలీ, రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నాం. ఉదయం తొమ్మిది గంటలకు 60 ఫీట్‌ రోడ్డు నుంచి పబ్లిక్‌ క్లబ్‌ వరకు ర్యాలీ, అనంతరం 10 గంటలకు పబ్లిక్‌ క్లబ్‌లో సదస్సు జరుగుతుంది. ఆవుల నాగరాజు అధ్యక్షులు, డా. సి.కాశీం ముఖ్య అతిథి. పాపని నాగరాజు, చింతమల్ల గురూజీ, రేపాక లింగయ్య, రాచూరి ప్రతాప్‌, టి. పూలన్‌, ఎ. కుమార్‌, బత్తుల రాజ్‌కుమార్‌, మరికంటి హరీష్‌ ప్రసంగిస్తారు.

ప్రోగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ 

(పిడిఎస్‌ఎఫ్‌)

Updated Date - 2022-09-22T06:41:52+05:30 IST