వారికి మరో అవకాశం!

ABN , First Publish Date - 2021-03-01T08:39:22+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో గతంలో బలవంతపు చర్యలతో నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థుల పట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సానుభూతితో

వారికి మరో అవకాశం!

బలవంతపు చర్యలతో నామినేషన్లు వేయలేనివారిపై నేడో రేపో నిర్ణయం 

కలెక్టర్ల నుంచి అందిన నివేదికలు

5కల్లా ప్రతి ఓటరుకూ స్లిప్పుల పంపిణీ

ఓటు ఎక్కడుందో చెప్పేందుకు హెల్ప్‌లైన్‌

ప్రచారానికి ఐదుగురే వెళ్లాలి

ఎక్కువ మంది వెళ్తే ‘కొవిడ్‌’ చర్యలే

కమిషనర్‌ నిమ్మగడ్డ స్పష్టీకరణ

నేడు రాజకీయ పార్టీలతో సమావేశం


రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిమ్మగడ్డకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. 

 ఆంధ్రజ్యోతి, తిరుమల


అమరావతి, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో గతంలో బలవంతపు చర్యలతో నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థుల పట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సానుభూతితో వ్యవహరిస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో వార్డు వలంటీర్లు పాల్గొనకుండా నిషేధించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బలవంతపు చర్యల వల్ల నామినేషన్లు వేయలేకపోయిన వారికి సంబంధించి కలెక్టర్ల నుంచి నివేదికలు వచ్చాయని.. వాటిపై నేడో, రేపో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరస్కరణకు గురైన నామినేషన్లు, అసలే నామినేషన్లు వేయని వారికి కూడా మళ్లీ అవకాశమివ్వాలని కొంత మంది కోరారని.. చట్ట ప్రకారం అది సాధ్యం కాదన్నారు. బలవంతపు చర్యల కారణంగా నామినేషన్‌ వేయలేని వారి విషయంలో మాత్రం వారి పట్ల సానుభూతితో వ్యవహరిస్తామని తెలిపారు. ‘పంచాయతీ ఎన్నికల్లో ప్రతి విడత 80 శాతం తగ్గకుండా ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు.


మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఎన్నికల పోలింగ్‌ పెంచేందుకు ఓటర్లలో చైతన్యం తీసుకురావాలి. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఆదివారం స్థానిక నాయకులతో మాట్లాడాం. సోమవారం రాష్ట్ర స్థాయి నాయకులతో భేటీ నిర్వహిస్తున్నాం. మున్సిపల్‌ ఎన్నికలు కూడా స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సూచనలు స్వీకరిస్తున్నాం. ఓటర్లకు సౌకర్యంగా ఉండేలా.. వారి ఓటు ఎక్కడ ఉందో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసి సమాచారమిస్తాం. ప్రతి ఓటరుకు 5వ తేదీకల్లా ఓటరు స్లిప్పులను వారి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. తిరుప కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఎన్నికల ప్రచారానికి ఐదుగురు కంటే ఎక్కువ ప్రచారాలకు వెళ్లరాదని ఎన్నికల ప్రవర్తన నియమావళిని రూపొందించింది. దీనినే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అమలు చేస్తున్నాం. ఐదుగురి కంటే ఎక్కువ మంది ప్రచారంలో పాల్గొంటే కరోనా  నిబంధనలను ఉల్లంఘించినట్లుగా భావించి చర్యలు తీసుకుంటాం. రోడ్‌షోలకు పరిమితంగా అనుమతిస్తాం. అనుమతి కోసం వచ్చిన దరఖాస్తులను సింగిల్‌ విండో విధానంలో పరిష్కరిస్తాం. మద్యం, డబ్బు పంపిణీ నియంత్రణకు నిఘా బృందాల సంఖ్య పెంచుతాం.


పంచాయతీ ఎన్నికల్లో కలెక్టర్లు, ఎస్పీలు బాగా పనిచేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా అదే సమన్వయంతో వ్యవహరించాలని కోరుతున్నాం. పంచాయతీ ఎన్నికల్లో ప్రసార మాధ్యమాలు ఓటర్లను చైతన్యం చేయడంలో క్రియాశీలంగా వ్యవహరించాయి. ఈ సారి కూడా అలాగే చైతన్యపరచాలి’ అని కోరారు. కాగా.. నిమ్మగడ్డ ఆదివారం ఎస్‌ఈసీ కార్యాలయం నుంచి పట్టణాల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. స్థానిక కృష్ణా జిల్లా నాయకులు నేరుగా సమావేశంలో పాల్గొన్నారు. 


ఆ వార్డుల్లో మళ్లీ నామినేషన్లు

ఒంగోలు, విజయనగరం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): నామినేషన్లు వేసి చనిపోయిన వారి స్థానంలో కొత్తగా నామినేషన్లు వేసేందుకు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించడంతో ఆదివారం ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో రెండేసి నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు 20వ వార్డుకు వైసీపీ నుంచి ఒకరు, మార్కాపురం 25వ వార్డులో బీజేపీ నుంచి ఒకరు నామినేషన్లు వేశారు. చీమకు ర్తి 12వ వార్డు టీడీపీ అభ్యర్థి మృతి చెందగా అక్కడ డమ్మీ అభ్యర్థికే టికెట్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఒంగోలు 40వ డివిజన్‌లో వైసీపీ తరఫున నామినేషన్‌ వేసిన వారిలో ఇద్దరు చనిపోయారు. గతంలో నామినేషన్‌ వారిలోనే ఒకరికి బీఫా రం ఇస్తారని తెలిసింది. విజయనగరంలోని విజయనగరం 21వ డివిజన్‌ నుంచి నాగవల్లి(వైసీపీ), పార్వతీపురం వార్డు 1నుంచి బత్తుల శ్రీదేవి నామినేషన్‌ వేశా రు. నెల్లిమర్లలో ముగ్గురు వైసీపీ అభ్యర్థులు చనిపోయారు. అయితే కొత్తగా నామినేషన్లు రాలేదు. ఈ 3 వార్డుల నుంచి అదే కుటుంబాలకు చెందిన డమ్మీ అభ్యర్థులు బరిలో ఉ న్నారు. వారినే పార్టీ అభ్యర్థులుగా ప్రకటించాలని వైసీపీ నిర్ణయించింది. 

Updated Date - 2021-03-01T08:39:22+05:30 IST