దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాదే

ABN , First Publish Date - 2020-10-27T11:44:22+05:30 IST

‘‘మొహమాటం లేదు.. దాపరికం అసలే లేదు. ఇన్నాళ్లు దుబ్బాకలో నేను పని చేసిన దానికంటే రెట్టింపు అభివృద్ధి చేస్తా.

దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాదే

సుజాత నాకు దేవుడిచ్చిన అక్క

సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో అభివృద్ధి చేస్తా

తెల్లారితే మీకండ్లముందర ఉండెటోన్ని

వాళ్లు మూటాముల్లె సర్దుకునేటోళ్లు

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు


దుబ్బాక/మిరుదొడ్డి, అక్టోబరు26: ‘‘మొహమాటం లేదు.. దాపరికం అసలే లేదు. ఇన్నాళ్లు దుబ్బాకలో నేను పని చేసిన దానికంటే రెట్టింపు  అభివృద్ధి చేస్తా. ముమ్మాటికీ దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాదేనని ప్రకటిస్తున్నా. సుజాతక్కను ఆశీర్వదించండి.’’ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీ రు హరీశ్‌రావు కోరారు. ‘‘సుజాతక్క చేతితో 40సార్లు అన్న తిన్న. అదే గురుత్వంతో ఆమె మీద అభిమానం ఉంది. నాకు సోదరి లేదు. సుజాతక్క నాకు దేవుడిచ్చిన సోదరి. ఆమెకు సోదరుడిగా తోడుగా నిలబడి దుబ్బాక అభివృద్ధి బాధ్యతను నేనే తీసుకుంటున్నా’’అని మంత్రి స్పష్టం చేశారు. దుబ్బాక ఆర్యవైశ్యభవనంలో దసరా సందర్భంగా అలయ్‌బలయ్‌ కార్యక్రమం, రెడ్డి సంఘంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కొంతమంది చిల్లర కామెం ట్లు చేస్తున్నారని, దానిని ప్రజలు నమ్మబోరని పేర్కొన్నారు. దుబ్బాకను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమన్నారు. సిద్దిపేటలాగే దుబ్బాక బాధ్యత కూడా తనపై ఉందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ దుబ్బాకలో చదువుకున్న మక్కువతో తనకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలను సుమారు రూ.10కోట్లతో అంగరంగవైభవంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. వందపడకల ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉందని, ముఖ్యమంత్రి పదవి చేపట్టకముందే దుబ్బాక బాలాజీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి స్నేహితుల నుంచి రూ.5కోట్ల విరాళాలు అందించారని, అధికారంలోకి రాగానే మొదటగా మరో రూ.5కోట్లను మంజూరు చేయించి పనులు చేపట్టారన్నారు.


దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించక ముందు సీఎం కేసీఆర్‌ను ప్రారంభోత్సవాలకు రావాల్సిందిగా కోరారని, పేదల సొంతింటి కల సాకారం అయ్యే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను సీఎం కేసీఆర్‌ ప్రారంభించాలని రామలింగారెడ్డి ఎంతో తాపత్రయపడ్డారని గుర్తుచేశారు. దురుదుష్టవశాత్తు  రామలింగారెడ్డి మరణించడంతోఅనివార్య కారణాలతో దుబ్బాక ఎన్నికలు వచ్చాయన్నారు. ఒక్కసారి కాళేశ్వరం నీళ్లొస్తే, దుబ్బాక రూపరేఖలు మారుతాయని మంత్రి చెప్పారు. నీళ్లుంటేనే పరిశ్రమలకు అనువుగా మారుతాయని ఒక్క పరిశ్రమకు పది అనుబంధ పరిశ్రమలు నెలకొల్పబడతాయన్నారు. దుబ్బాకకు గోదారి నీళ్లు తెస్తామంటే అంతా నవ్వారని ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు.


కాశీవిశ్వేశ్వరాలయాన్ని అభివృద్ధి చేస్తా 

దుబ్బాక ప్రజలు, ముఖ్యంగా రైతులు, వ్యాపారులు సెంటిమెంట్‌గా భావించే కాశీవిశ్వేశ్వరాలయ జీర్ణోద్ధరణకు సహకరిస్తానని మంత్రి హామీనిచ్చారు. పంటలు పండగానే వైశాఖ పౌర్ణమి నాడు ఎడ్లబండ్లతో బోనాలు, రఽథోత్సవం జరిపే రైతులు దానిని అభివృద్ధి చేయాలని కోరారని, ఆలయం లింగం రహదారి కంటే కిందికి చేరడంతో ప్రజలు దా నిని జీర్ణోధరణ జరపాలని భావించారన్నారు. దుబ్బాకలో లక్ష మెజార్టీ సాధించిన వెంటనే జాతర చేస్తామన్నారు. హుజూర్‌నగర్‌లాంటి ప్యాకేజీ తీసుకొచ్చి అభివృద్ధి బాట పట్టిస్తామని చెప్పారు. అంతకు ముందు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాతా రామలింగారెడ్డి మాట్లాడారు. దుబ్బాక అభివృద్ధి బాధ్యతలు హరీషన్న ఎత్తుకున్నారని అన్నారు. కార్యక్రమంలో  నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బీగాల గణే్‌షగుప్తా, ఉప్పల శ్రీనివాస్‌, దామోదర్‌ గుప్త, చింత రాజు, కూరవేణుగోపాల్‌, రాజు ఉన్నారు. 

Updated Date - 2020-10-27T11:44:22+05:30 IST