ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం

ABN , First Publish Date - 2020-11-27T04:44:15+05:30 IST

ధాన్యం కొనుగోళ్లలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్‌ అనిల్‌కుమార్‌ అన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం
అధికారులతో మాట్లాడుతున్న అనిల్‌కుమార్‌

రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్‌ అనిల్‌కుమార్‌
కామారెడ్డి, నవంబరు 26: ధాన్యం కొనుగోళ్లలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్‌ అనిల్‌కుమార్‌ అన్నారు. గురువారం జనహితభవన్‌లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పకడ్బందీ చర్యలతో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగంగా నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, రైతుల ఖాతాలో వెంటనే డబ్బులు జమ చేయడం పట్ల జిల్లా కలెక్టర్‌ను, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. నాణ్యమైన గన్నీ బ్యాగులను మాత్రమే వాడాలని, క్వాలిటీలేని గన్నీ బ్యాగులను వాపస్‌ చేయాలని అధికారులకు సూచించారు. మిల్లర్లకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని చర్యలను తీసుకుంటున్నామని, మిల్లర్లు కూడా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా తోడ్పడాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ శరత్‌ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, కొనుగోలు ప్రక్రియను వేగంగా నిర్వహించడంలో క్షేత్రస్థాయిలో అన్ని చర్యలను తీసుకోవడం జరిగిందని, జిల్లా కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడం, అవసరమైన చోట్ల రైతులతో మాట్లాడి సమస్యలు ఏర్పడకుండా ముందస్తుచర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 341 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ద్వారా ఇప్పటి వరకు 62వేల మంది రైతుల నుంచి 3 లక్షల 10వేల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు 98 శాతం ప్రగతితో 450 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేయడం జరిగిందని తెలిపారు. గత ఖరీఫ్‌, రబీ కాలానికి గాను ధాన్యం కొనుగోలు కమీషన్‌ సంబంధించి 18 కోట్లు ప్రాథమిక సహకార సంఘాలకు, 11 కోట్లు ఏఎంసీ సంఘాలకు ఒకటిన్నర కోట్లు ఐకేపీ సంఘాలకు ధాన్యం కమీషన్‌ చెక్కులను రాష్ట్ర కమిషనర్‌ జిల్లా కలెక్టర్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌కేశవ్‌పాటిల్‌, ఆర్‌డీవో శ్రీను, సివిల్‌ సప్లయ్‌ రంజీత్‌కుమార్‌, డీఎస్‌వో కొండల్‌రావు, మార్క్‌ఫెడ్‌ డీఎం రంజిత్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ ఇన్‌చార్జ్‌ అధికారి సునీత తదితరులు పాల్గొన్నారు.
డిసెంబరు 15లోగా మొక్కజొన్న కొనుగోళ్లను పూర్తి చేయాలి

మొక్కజొన్న కొనుగోళ్లను డిసెంబరు 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శర త్‌ అధికారులను ఆదేశించారు. గురువారం జనహితభవన్‌లో వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్‌ అధికారులతో మొక్కజొన్న కొనుగోలుకు చేపట్టే చర్యలను ఆయన సమీక్షించారు. జిల్లాలో 37కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేపడుతున్న ట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌కేశవ్‌పాటిల్‌, ఆర్‌డీవోలు తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం పరిశీలన

సదాశివనగర్‌: మండలంలోని అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో గురువారం వరి కొనుగోలు కేంద్రాన్ని సివిల్‌ సప్లయ్‌ రాష్ట్ర కమిషనర్‌ అనిల్‌కుమార్‌, కలెక్టర్‌ శరత్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పంట కొనుగోళ్లపై వివరించడంతో పాటు వారి ఇబ్బందులపై ఆరా తీశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ఎంత వరకు జరిగింది. రైతుల ఖాతాల్లో ఎంతడబ్బు జమ చేశారనే వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌కేశవ్‌పాటిల్‌, సొసైటీ చైర్మన్‌ సదాశివరెడ్డి, క్లస్టర్‌ అధికారి నగేష్‌, సీఈవో భైరయ్య అధికారులు రైతులు పాల్గొన్నారు.
జంగంపల్లిలో మిల్లింగ్‌ రైస్‌ విధానం పరిశీలన
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామంలోని రైస్‌మిల్లులో మిల్లింగ్‌ రైస్‌ విధానాన్ని గురువారం సాయంత్రం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అనీల్‌కుమార్‌ పరిశీలించారు. ఈ మేరకు రైస్‌మిల్లులో రైస్‌ నిల్వలను అధికా రులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ శరత్‌, అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ పాటిల్‌, సివిల్‌ సప్లయ్‌ డీఎం రంజిత్‌కుమార్‌, డీఎస్‌వో కొండల్‌రావు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T04:44:15+05:30 IST