బ్యాంకులు బెంబేలు!

ABN , First Publish Date - 2021-06-18T07:44:26+05:30 IST

‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీ ఇస్తుందా? వారు కోరిన సంస్థకు అప్పులు ఇవ్వాలా? మా వల్ల కాదు బాబోయ్‌! ఏపీ సర్కారు గ్యారెంటీకే గ్యారెంటీ లేదు’’... ఇదీ బ్యాంకుల మనోగతం!

బ్యాంకులు బెంబేలు!

ఎడాపెడా రాష్ట్ర సర్కారు గ్యారెంటీలు

పరిమితికి మించిన పూచీకత్తు అప్పులు

ఆర్బీఐపై భరోసాతో ఇచ్చిన బ్యాంకులు

పరిమితికి లోబడితేనే మా బాధ్యత 

తేల్చేసిన భారతీయ రిజర్వుబ్యాంకు 

గరిష్ఠాన్ని మించి 30వేల కోట్ల గ్యారెంటీలు

నమ్మి కొత్త అప్పులు ఇవ్వని బ్యాంకర్లు

ఇప్పుడు చిన్న బ్యాంకులపై ఆశలు


నో గ్యారెంటీ

‘స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీగా ఉంటోంది! అప్పుకట్టలేని పరిస్థితే వస్తే... రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల నుంచి ఆర్బీఐ మినహాయించుకుని, మన డబ్బులు మనకు ఇస్తుంది!’... అనే ధీమాతో ఉన్న బ్యాంకులు ఇప్పుడు బెంబేలెత్తుతున్నాయి. ‘వారు అడిగారు... మీరు ఇచ్చారు. మధ్యలో మాకేం సంబంధం’ అని ఆర్బీఐ చెప్పకనే చెప్పేసింది. దీంతో... ఏపీకి అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు భయపడుతున్నాయి. 


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీ ఇస్తుందా? వారు కోరిన సంస్థకు అప్పులు ఇవ్వాలా? మా వల్ల కాదు బాబోయ్‌! ఏపీ సర్కారు గ్యారెంటీకే గ్యారెంటీ లేదు’’... ఇదీ బ్యాంకుల మనోగతం! 


‘అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలన్నీ పూర్తి చేసేందుకు రూ.3,000 కోట్లు అప్పు తెచ్చుకోండి. ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది’ అంటూ సీఆర్డీయేకు ముఖ్యమంత్రి గతంలో చెప్పారు. ఈ మేరకు కేబినెట్‌లో నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ, ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కూడా సీఆర్డీయేకు అప్పు ఇచ్చేందుకు ఒక్క బ్యాంకు కూడా ముందుకు రాలేదు. మొదట్లో కనీసం సమావేశాలకు కూడా రావడానికి బ్యాంకర్లు ఇష్టపడలేదు. ఆ తర్వాత ఒకట్రెండు సమావేశాలు జరిగినప్పటికీ రూ.3వేల కోట్లు రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాలేదు. ప్రభుత్వానికి ఎలాంటి సమాచారమూ పంపలేదు. దీనికి ప్రధాన కారణం... ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీలను నమ్మడానికి బ్యాంకులు సిద్ధం గా లేకపోవడమే!


ఎడాపెడా కుదరదు... 

రాష్ట్ర ప్రభుత్వమైనా సరే... ఎడాపెడా అప్పులు తేవడం, ఇష్టానుసారం గ్యారెంటీలు ఇవ్వడం కుదరదు. వాటికీ పరిమితులు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన గ్యారెంటీల పరిమితి ఎప్పుడో ముగిసిపోయింది. గరిష్ఠ పరిమితికి మించి గ్యారెంటీలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వాలతో లావాదేవీలు నడిపే పెద్ద బ్యాంకులు సర్కారుకు అప్పులు ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న చిన్న బ్యాంకుల వైపు ఆర్థికశాఖ దృష్టి సారించినట్టు తెలిసింది. గ్యారెంటీ పరిమితి లేదని తెలిశాక పెద్ద బ్యాంకులైనా, చిన్న బ్యాంకులైనా రుణాలు ఇవ్వడానికి ముందుకు రాకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.


స్పష్టత ఇచ్చిన ఆర్బీఐ

రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీగా నిలిచే రుణాలకు ఆర్బీఐ భరోసాగా ఉంటుందని... అప్పు కట్టలేని పరిస్థితే వస్తే, రాష్ట్రానికి నెలనెలా వచ్చే నిధులను ‘ఆర్బీఐ’ కట్‌ చేసి, తమకు చెల్లిస్తుందనే భావనలో బ్యాంకులు ఉన్నాయి. దీనిపై ఆర్‌బీఐ తన నివేదికలోనే సమాధానం చెప్పింది. గ్యారెంటీలు ఇవ్వడం రాష్ట్ర వ్యవహారమే అయినప్పటికీ... ఆ పరిమితిని రాజ్యాంగానికి లోబడి కేంద్రం నిర్ణయిస్తుంది. అలా కేంద్రం నిర్ణయించిన గరిష్ఠ పరిమితిని మాత్రమే ఆర్బీఐ గుర్తిస్తుంది. దానికి సంబంధించిన అప్పులు లేదా వడ్డీలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోతే... రాష్ట్రానికి చెల్లించాల్సిన నిధుల్లో కోత పెట్టి, ఆ మొత్తాన్ని నేరుగా సదరు బ్యాంకులకు పంపిస్తుంది. ఇదీ అసలు విషయం! ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ అప్పులతోపాటు గ్యారెంటీలూ పరిమితికి మించిపోయాయి. రాష్ట్ర ఆర్థికపరిస్థితి ‘సంక్లిష్టం’గా ఉంది. పరిస్థితి మరింత దిగజారితే అప్పులతోపాటు గ్యారెంటీలుగా ఇచ్చిన సొమ్ములూ చెల్లించే సామర్థ్యం రాష్ట్రానికి ఉండదు. అప్పుడు బ్యాంకులు నష్టపోవడమేనా? ఇచ్చిన రుణాలు వసూలు చేసుకునే మార్గాలేమైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలే బ్యాంకుల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి. ‘మాకు సంబంధం లేదు’ అని ఆర్బీఐ చెప్పేస్తే, ఆ అప్పుల వసూలు బ్యాంకులే చూసుకోవాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కేవలం గ్యారెంటీల పరిమితికిలోబడి ఉన్న అప్పుల చెల్లింపు బాధ్యతనే ఆర్‌బీఐ తీసుకుంటుందని వారు పేర్కొన్నారు. 


ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన బడ్జెట్‌ పుస్తకాల ప్రకారం ప్రభుత్వం 91,330 కోట్ల రుణాలకు (1953 నుంచి ఇప్పటి వరకు) గ్యారెంటీ ఇచ్చింది. ప్రభుత్వ గరిష్ఠ పరిమితి కూడా దాదాపుగా ఇంతే! కానీ ప్రభుత్వం 1,22,300 కోట్ల రుణాలకు పూచీకత్తు ఇచ్చింది. రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌కు ఇచ్చిన రూ.21,500 కోట్లతో పాటు వివిధ కార్పొరేషన్లకు ఇచ్చిన రూ.10వేల కోట్ల గ్యారెంటీలను బడ్జెట్‌ పుస్తకంలో ఆర్థిక శాఖ చూపించలేదు. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా రూ.18,500కోట్లు అప్పు తెచ్చారు. ఇంకా రూ.3,000 కోట్లు తెచ్చుకోవాల్సి ఉంది. ఇతర కార్పొరేషన్లకు ఇచ్చిన గ్యారెంటీలకు సంబంధించిన రూ.10వేల కోట్లు కూడా సమీకరించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, ఈ గ్యారెంటీ ఒప్పందాలు కుదుర్చుకున్న బ్యాంకులు ఆ రుణాలు ఇవ్వాలా వద్దా అనేదానిపై పునరాలోచనలో పడ్డట్టు సచివాలయంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పూచీకత్తు ఇచ్చే పరిమితి ఎప్పుడో దాటిపోయినప్పటికీ... పాత జీవోలను ఇష్టానుసారం సవరించి, తమకు అనుకూలమైన భాష్యం చెప్పుకొన్నారు. కాగితాలపై గ్యారెంటీల పరిమితి పెంచి... వాటినే బ్యాంకులకు చూపించి వేల కోట్ల అప్పులు తెచ్చా రు. నిజానికి... గత ఏడాది రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన సమయంలోనే పూచీకత్తు పరిమితి దాదాపుగా ముగిసింది. అప్పటికి మరో 6వేల కోట్ల పరిమితి మాత్రమే ఉన్నప్పటికీ రూ.21,500కోట్ల రుణానికి పూచీకత్తు ఇచ్చారు. ఇందులో రూ.18,500 కోట్లను బ్యాంకులు ఇప్పటికే అప్పుగా ఇచ్చాయి.

Updated Date - 2021-06-18T07:44:26+05:30 IST