చలింగాణ

ABN , First Publish Date - 2021-12-20T08:37:29+05:30 IST

చలికాలం అన్నాక చలివేయడం మామూలే. అయితే ఈ చలి మామూలుగా లేదు.

చలింగాణ

  • మంచు దుప్పట్లో రాష్ట్రం.. 
  • హిమాలయాల నుంచి గాలులతోనే!
  • పదిచోట్ల సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు
  • సగటు కంటే 2-4 డిగ్రీలు తక్కువగా!
  • పొద్దున్న, సాయంత్రం ప్రజలు గజగజ
  • ఎనిమిది జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ
  • ఇంకో రెండ్రోజులు ఇదే పరిస్థితి
  • ఫిబ్రవరి దాకా మరో 3 విడతలు ఇలాగే
  • ఉత్తర భారతంలో తీవ్ర చలిగాలులు
  • కశ్మీర్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ సహా పలు 
  • రాష్ట్రాల్లో మైనస్‌ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు


హైదరాబాద్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): చలికాలం అన్నాక చలివేయడం మామూలే. అయితే ఈ చలి మామూలుగా లేదు. తెల్లవారుజామున మెలుకువ వచ్చినా పడకను వీడబుద్దేయడం లేదు! భళ్లున తెల్లారినా వెచ్చని దుప్పటిని ఒళ్లు వదలనంటోంది. సుర్రుమనే ఎండొచ్చినా స్వెటర్‌ను విప్పొద్దంటోంది. చేతులేమో గ్లవ్స్‌ను.. చెవులేమో మఫ్లర్‌ను కోరుకుంటున్నాయి. సంక్రాంతికి ఇంకా నెల రోజులుంది. ఇప్పుడే చంకలు లేపలేనంతగా చలి వణికిస్తోంది. ఉదయం, సాయంత్రం వేళ్లల్లో గడపదాటి అడుగు పెట్టలేని పరిస్థితొచ్చింది. పొలం పనుల కోసం శివారు ప్రాంతాలకు వెళ్లేందుకు రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందిపడుతున్నాయి. కొన్నాళ్లుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చలి విజృంభిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సగటున 8- 9 డిగ్రీలు, సెంట్రల్‌ తెలంగాణలో 10- 11 డిగ్రీలు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 11- 15 డిగ్రీల మధ్య సగటుతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. 


సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, వరంగల్‌, హనుమకొండ, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ తదితర జిల్లాల్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. పైగా ఎనిమిది జిల్లాలు.. ఆసిఫాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, నారాయణపేట్‌, మేడ్చల్‌- మల్కాజ్‌గిరి ఇల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ను వాతావరణ కేంద్రం ప్రకటించింది. చలి అసాధారణ స్థాయిలో పెరిగితే, చేపట్టబోయే చర్యలకు సిద్ధంగా ఉండాలని కూడా అలర్ట్‌ మెసేజ్‌లో పేర్కొనటం గమనార్హం. మరో రెండు రోజులపాటు చలి ఇలాగే ఉంటుందని, ఆ తర్వాత కాస్త తగ్గుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె. నాగరత్న వెల్లడించారు. అయితే ప్రస్తుతం నెలకొన్న చలి పరిస్థితులు ఫిబ్రవరి నెల వరకు మూడు దఫాలుగా రావొచ్చునని ఆమె తెలిపారు.  ఉత్తరాది, ఈశాన్య గాలుల ప్రభావంతో తేమ శాతం కూడా సాధారణంకంటే ఎక్కువగా ఉంటోందని, ఉదయం పూట పొగమంచు ఉంటున్నట్లు వెల్లడించారు. 


ఎందుకింత గజగజ?

ఇరాన్‌, ఇరాక్‌... గల్ఫ్‌ దేశాల నుంచి వస్తున్న అతిశీతల ఉపరితల గాలులతో హిమాలయా పర్వత ప్రాంతాల్లో ‘పశ్చిమ అస్థిరత’(వెస్ట్రన్‌ డిస్టమెన్స్‌) ఏర్పడింది. హిమాలయాల్లో కేంద్రీకృతమైన గాలులతో దాని వెంబడి ఉన్న గాలులు కూడా చల్లగా మారుతున్నాయి. ఆతర్వాత ఉత్తరాది రాష్ట్రాల మీదుగా దక్షిణ భారతదేశంలోకి ఉపరితల శీతల గాలులు ప్రవేశిస్తున్నాయి. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, జార్ఖండ్‌, ఛత్తీ్‌సగఢ్‌, ఏపీ తదితర రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. 


పదిచోట్ల సింగిల్‌ డిజిట్‌కు కనిష్ఠ ఉష్ణోగ్రతలు

రాష్ట్రవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు చేరాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్‌, అల్గోల్‌, సత్వార్‌, నల్లవెల్లి ప్రాంతాల్లో 7 డిగ్రీల నుంచి 9 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో 8-9 డిగ్రీల మధ్యలో నమోదు కావటం గమనార్హం. హైదరాబాద్‌లో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. రాజేంద్రనగర్‌లో అత్యల్పంగా 9.9 డిగ్రీలు.. రామచంద్రాపురం, శేరిలింగంపల్లిలో 11.1 డిగ్రీల చొప్పున.. సికింద్రాబాద్‌లో 12.1, హయత్‌నగర్‌లో 12.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగత్రలు నమోదయ్యాయి. ఏపీలో కూడా చలి విజృంభిస్తోంది. విశాఖ జిల్లా చింతపల్లిలో 5.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ క్రమంలో.. ఉదయం 4 గంటల నుంచి 8.30 గంటల వరకు పొగమంచు తీవ్రంగా ఉంటోంది. జాతీయ రహదారులు, పంట పొలాలు, విమానాశ్రయాల్లో పొగ మంచు తీవ్రంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఉదయం పూట ప్రయాణాలు చేయొద్దని, పొగమంచులో వాహనాలు ఒకటికొకటి కనిపించే అవకాశాలు తక్కువగా ఉంటాయని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీచేసింది. 


 ఉత్తర భారతంలో చలిగాలులు

చలికి ఉత్తర భారతం వణికిపోతోంది. ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్‌, కశ్మీర్‌, లద్ధాఖ్‌, గిల్గిత్‌-బల్టిస్థాన్‌, ముజఫర్‌బాద్‌, ఉత్తరాఖండ్‌, హరియాణా, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ తీవ్ర చలిగాలు వీస్తున్నాయి. ఢిల్లీలో 4.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కశ్మీర్‌లోని పెహల్గామ్‌లో మైనస్‌ 8.7 డిగ్రీలు, శ్రీనగర్‌లో మైనస్‌ 6 డిగ్రీలు, రాజస్థాన్‌లోని ఫతేపూర్‌లో మైనస్‌ 4.7 డిగ్రీలు, చురులో మైనస్‌ 2.6 డిగ్రీలు. ఈశాన్య ప్రాంతంలోని సికర్‌లో మైనస్‌ 2.5 డిగ్రీలు, అమృత్‌సర్‌లో మైనస్‌ 0.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

Updated Date - 2021-12-20T08:37:29+05:30 IST