ధర్మపురి స్ఫూర్తిగా రాష్ట్రస్థాయి కోలాట పోటీలు

ABN , First Publish Date - 2022-09-30T05:33:57+05:30 IST

ధర్మపురి స్ఫూర్తిగా రాష్ట్రస్థాయి కోలాట పోటీలు ఏర్పాటు చేస్తామని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

ధర్మపురి స్ఫూర్తిగా రాష్ట్రస్థాయి కోలాట పోటీలు
ధర్మపురిలో బతుకమ్మను ఎత్తుకుని వస్తున్న ఎమ్మెల్సీ కవిత

 - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత

ధర్మపురి, సెప్టెంబరు 29: ధర్మపురి స్ఫూర్తిగా రాష్ట్రస్థాయి కోలాట పోటీలు ఏర్పాటు చేస్తామని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు,  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎల్‌ఎం కొప్పుల సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ సహకారంతో ఏర్పాటు చేసిన దసరా కోలాట పోటీల ముగింపు కార్యక్రమానికి గురువారం రాత్రి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధర్మపురి క్షేత్రంలో దసరా కోలాట సంబరాల పోటీల్లో  మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. కోలాట పోటీలు వచ్చే ఏడాది ధర్మపురి కేంద్రంగా ఆడ, మగ వారందరి కోసం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఉద్యమ కాలం నుంచి మంచి గుర్తింపు పొంది, నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నట్లు కొనియాడారు. ఎల్‌ఎం కొప్పుల సోషల్‌ ఆర్గనైజేషన్‌ సర్వీస్‌ చైర్‌పర్సన్‌, మంత్రి సతీమణి స్నేహలత సహకారంతో వేలాది మంది మహిళలు, యువతులను ఒకే వేదిక పైకి తీసుకరావడం అభినందనీయమన్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగకు ప్రత్యేక గుర్తింపు తీసుక వచ్చిన ఘనత కల్వకుంట్ల కవితకే దక్కిందని అన్నారు.

అంతకు ముందు ఎమ్మెల్సీ కవిత నెత్తిమీద బతుకమ్మ ఎత్తుకుని భారీ ర్యాలీగా కళాశాల మైదానం చేరుకున్నారు. ముగింపు పోటీలను తిలకించి  మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించారు. 

Updated Date - 2022-09-30T05:33:57+05:30 IST