ఈ పాపం కేంద్రానిదే!

ABN , First Publish Date - 2021-04-23T09:37:08+05:30 IST

అందరికీ టీకా వేయడం ద్వారానే కరోనాను కట్టడి చేయవచ్చని తెలిసినప్పుడు ముందుగానే ఉత్పత్తిని పెంచాల్సిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కేంద్రం తీరు మాత్రం ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా ఉందని చెప్పారు.

ఈ పాపం కేంద్రానిదే!

వ్యాక్సిన్‌, ఇంజక్షన్ల కేటాయింపులో వివక్ష     

4 లక్షల రెమ్‌డెసివిర్‌  అడిగితే..10 రోజుల్లో 21,551 ఇచ్చింది!

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): అందరికీ టీకా వేయడం ద్వారానే కరోనాను కట్టడి చేయవచ్చని తెలిసినప్పుడు ముందుగానే ఉత్పత్తిని పెంచాల్సిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కేంద్రం తీరు మాత్రం ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేదని ఆరోపించారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనలను కేంద్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కరోనా విజృంభించడానికి కేంద్ర ప్రభుత్వ తీరే కారణమన్నారు. ఆయన గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రం ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటల ఆవేదన ఆయన మాటల్లోనే..


ఉత్పత్తి పెంచాలన్నా వినలేదు.. 

కరోనా వ్యాక్సినేషన్‌, రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తి రాష్ట్రంలోనే జరుగుతోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను చూసి ఇక్కడున్న అన్ని కంపెనీలు వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచాలని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే ఆదేశించారు. కానీ, కేంద్రం వాటిని నియంత్రించింది. మన సూచనలతో ముందే స్పందించి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌ కేటాయింపులో కేంద్రం వివక్ష చూపిస్తోంది.


30 వేల ఆర్టీపీసీఆర్‌ టెస్టులు.. 

ఆర్టీపీసీఆర్‌ పరీక్షల సంఖ్యను పెంచుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా104 కేంద్రాల్లో రోజూ 30 వేల పరీక్షలు చేస్తున్నాం. మిగిలినవన్నీ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ చేస్తున్నాం. అవసరమైతే రోజుకు 2 లక్షల పరీక్షలు కూడా చేస్తాం. ర్యాపిడ్‌లో పాజిటివ్‌ అని వస్తే కచ్చితంగా పాజిటివ్‌. లక్షణాలు లేని వారందరూ హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వచ్చి పరీక్ష చేయించుకోవాలి. ఏం కాదులే అని ఇంట్లోనే ఉంటే వైరస్‌ తీవ్రత ఎక్కువవుతుంది. అలాంటప్పుడు వెంటిలేటర్‌ దొరకడం కష్టమవుతుంది. ప్రాణాల మీదకు వస్తుంది. కాబట్టి తాత్సారం చేయొద్దు. కొవిడ్‌ చికిత్స చేసేందుకు 1120 ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులిచ్చాం. కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు డబ్బులు కట్టలేని వారిని చివరి దశలో గాంధీకి పంపిస్తున్నారు. ఈ సమయంలో శవాల మీద పేలాలు ఏరుకోవద్దు. చివరి నిమిషంలో గాంధీకి పంపించడం వల్ల అక్కడ వెంటిలేటర్‌ బెడ్‌లకు ఇబ్బంది ఏర్పడుతుంది. ప్రస్తుతం 600 మంది రోగులు వెంటిలేటర్‌ మీద, ఆక్సిజన్‌ మీద ఉన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ను బ్లాక్‌లో అమ్మినవారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు ఇచ్చాం. 


నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.. 

ప్రస్తుతానికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేదు. పరిస్థితిని ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సీఎస్‌ ఆధ్వర్యంలో 10 మంది ఐఏఎస్‌ అధికారుల బృందం ఆక్సిజన్‌ సరఫరా, ఇంజక్షన్లు, వ్యాక్సినేషన్‌ పంపిణీపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. కరోనా నియంత్రణలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ సమర్థంగా పనిచేస్తోంది. ప్రజలు కూడా సహకరించాలి. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దు. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు వస్తున్నాయి. మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో మునిసిపల్‌ పాలనా యంత్రాంగం పూర్తిస్థాయిలో పని చేస్తోంది. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దు. 


సంకుచిత ధోరణి వద్దు.. 

కొవిషీల్డ్‌ టీకాలు కేంద్రానికి రూ.150, రాష్ట్రాలకు రూ.400, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.600కి.. ఇలా వేర్వేరు ధరలకు ఇవ్వడం సరికాదు. దేశ ప్రజలందరినీ కాపాడే బాధ్యత కేంద్రం మీద ఉంది. ఈ సమయంలో ఇలా వ్యవహరించవచ్చా? అని ఈటల ప్రశ్నించారు. కేంద్రం సంకుచితంగా ఆలోచించవద్దని కోరారు.


మా ఇంజక్షన్‌ కూడా ఇవ్వరా?

కరోనా సెకండ్‌వేవ్‌లో పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఏపీ, కర్ణాటకలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశించారు. ఆ ప్రకారమే 4 లక్షల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లకు ఆర్డర్‌ పెట్టాం. మన దగ్గరే ఇవి తయారవుతున్నాయి.. ఎక్కువ డోసులు వస్తాయని ఆశించాం. కానీ, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ఉత్పత్తి, సరఫరా బాధ్యతలు కేంద్రం నియంత్రణలోకి వెళ్లాయి.


దీంతో రాష్ట్రాలకు నేరుగా కొనే అవకాశం లేకుండా పోయింది. కేంద్రం మొత్తం పంపిణీ వ్యవస్థను తన నియంత్రణలోకి తీసుకొని తెలంగాణకు మొండి చెయ్యి చూపింది. 4 లక్షల ఇంజక్షన్ల కోసం ఆర్డర్‌ పెడితే 10 రోజుల్లో కేంద్రం ఇచ్చింది 21,551 మాత్రమే. అదే గుజరాత్‌కి 1.63 లక్షలు, మహారాష్ట్రకు 2 లక్షలు, ఢిల్లీకి 61 వేలు, మధ్యప్రదేశ్‌కి 92 వేల ఇంజక్షన్లు ఇచ్చారు. కేంద్రం చూపిస్తున్న ఈ వివక్ష పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం.

Updated Date - 2021-04-23T09:37:08+05:30 IST