రాష్ట్రవ్యాప్తంగా 28 వేల మందిపై కేసులు

ABN , First Publish Date - 2021-04-23T16:22:03+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం గీత దాటినా తక్షణం కేసు నమోదు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 28 వేల మందిపై కేసులు

       - ఉల్లంఘించే వారిపై పోలీసుల ఉక్కుపాదం


అడయార్‌(చెన్నై): రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం గీత దాటినా తక్షణం కేసు నమోదు చేస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన 28 వేల మందిపై కేసులు నమోదు చేశారు. కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలను మంగళవారం రాత్రి నుంచి అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.. ఇందులోభాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తోంది. ముఖ్యం గా రాత్రి 10 గంటల నుంచి వేకువజామున 4 గంటల సమయంలో రోడ్లపై సంచరించే వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే, వాహనాలను కూడా సీజ్‌ చేస్తున్నారు. ఆ విధంగా రెండో రోజు కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించినందుకు చెన్నై నగరంలో ఒక లారీ సహా 44 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మందిపై కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా రాజధాని నగరంలో రాత్రి కర్ఫ్యూను పకడ్బందీగా అమలుచేస్తున్నారు.  పోలీస్‌ కమిషనరు మహేష్‌ కుమార్‌ అగర్వాల్‌ ఆదేశాల మేరకు నగర వ్యాప్తంగా 200 ప్రాంతాల్లో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతించిన వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్న పోలీసులు.. మిగిలిన వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రధానంగా అన్నాసాలై, పూందమల్లిసాలై, నెహ్రూ రోడ్డు, రాజీవ్‌గాంధీ హైరోడ్డు, ఓఎంఆర్‌, ఈసీఆర్‌, కామరాజర్‌ రోడ్డు, తిరువొత్తియూరు హైరోడ్డు, డాక్టర్‌ రాధాకృష్ణన్‌ శాలై, వేళచ్చేరి హైరోడ్డు, సర్టార్‌ పటేల్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో పోలీసులు రాత్రి పూట గస్తీ తిరుగుతూ వాహనాలను నిశితంగా తనిఖీ చేస్తున్నారు.  


28 వేల కేసులు నమోదు 

రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించినందుకు 28 వేల మందిపై కేసులు నమోదుచేశారు. వీరిలో నార్త్‌ జోన్‌ పరిధిలో మాస్క్‌ లేకుండా తిరుగుతున్న 4,744 మందిపై కేసు నమోదు చేశారు. అలాగే, సెంట్రల్‌ జోన్‌లో 3,116 మందిపై, వెస్ట్‌జోన్‌లో 4,177, సౌత్‌ జోన్‌లో 9,868, పట్టణ ప్రాంతాల్లో 4,904, చెన్నై నగరంలో 1,235 చొప్పున మొత్తం 28,044 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భౌతికదూరం పాటించని 733 మందిపై కేసులు పెట్టారు. మాస్క్‌ ధరించిన వారి నుంచి ఇప్పటి వరకు రూ.3.66 లక్షలు వసూలు చేశారు. 


అక్కడక్కడా పోలీసుల ప్రతాపం 

రాష్ట్ర వ్యాప్తంతా రాత్రిపూట కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించి ఇష్టాను సారంగా రోడ్లపైకి వచ్చేవారిపట్ల పోలీసులు అక్కడక్కడా కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల మేరకు నడచుకుంటే అసలు సమస్యే ఉండదు కదా అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2021-04-23T16:22:03+05:30 IST