Advertisement

టీకాకు రెండు ధరలా!?

Apr 23 2021 @ 04:04AM

‘ఒకే దేశం-ఒకే పన్ను’ను సమర్థించాం 

ఇప్పుడీ ‘కేంద్ర, రాష్ట్ర’ వ్యత్యాసాలేంటి?

‘పీఎం కేర్స్‌’ నుంచి భరించలేరా: కేటీఆర్‌

వ్యాక్సిన్‌, ఇంజక్షన్ల కేటాయింపులో వివక్ష

రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు 4 లక్షలు అడిగితే

10 రోజుల్లో 21,551 ఇచ్చింది!

ఏ మాత్రం సహకరించని కేంద్రం

వైరస్‌ వ్యాప్తికి కారణం కేంద్రమే: ఈటల

టీకా కార్యక్రమం వివక్షాపూరితం!

యువత పట్ల బాధ్యత లేదా: సోనియా

మోదీ పరిష్కారాలు చూపాలి: రాహుల్‌

వ్యాక్సిన్‌కు వేర్వేరు ధరలేంటి: మమత


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 మూడో దశ వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీకా ధరల హేతుబద్ధతను ప్రశ్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఒక ధర, రాష్ట్రాలకు మరో ధరను నిర్ణయించడంపై మండిపడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీయేతర రాష్ట్రాలు కేంద్రం తీరుపై ధ్వజమెత్తుతున్నాయి. కొవిడ్‌-19 రోగులకు మెరుగైన వైద్యం, పరిశోధనల కోసం ఉద్దేశించిన ‘పీఎం కేర్స్‌’ నిధుల నుంచి వ్యత్యాస సొమ్మును ఎందుకు సర్దడం లేదని ప్రశ్నిస్తున్నాయి. ఓవైపు వ్యాక్సిన్‌ వయల్స్‌ను సరిపడా సరఫరా చేయకపోవడంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మరోవైపు ధరల్లో వ్యత్యాసంతో రాష్ట్రాలపై అదనపు భారాన్ని మోపుతోందని ఆరోపిస్తున్నాయి.


జీఎస్టీని అమల్లోకి తెచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ‘వన్‌ నేషన్‌- వన్‌ ట్యాక్స్‌’ అంటూ ఊదరగొట్టిందని, ఇప్పుడేమో కరోనా టీకాల ధరలను కేంద్రానికి ఒక రకంగా, రాష్ట్రాలకు మరో రకంగా ప్రకటించి రాష్ట్రాల నడ్డి విరుస్తోందని విమర్శిస్తున్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులకు సరఫరా చేసే ‘కొవిషీల్డ్‌’ టీకా ధరలను సీరం సంస్థ ప్రకటించింది. కేంద్రానికి రూ.150కే వయల్‌ను ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.600కు సరఫరా చేస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. టీకా ధరలపై తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ఒకే దేశంలో ఇప్పుడు వ్యాక్సిన్‌కు రెండు ధరలను చూస్తున్నాం. కేంద్రానికి రూ.150, రాష్ట్రాలకు రూ.400తో టీకాను సరఫరా చేస్తామంటున్నారు.


అదనపు ఖర్చును కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్‌ నిధి నుంచి భరించలేదా? దేశమంతా వ్యాక్సినేషన్‌ పూర్తికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందా? జీఎస్టీని అంగికరించాం కదా!’ అని కేటీఆర్‌ గురువారం ట్విటర్‌లో పేర్కొన్నారు. కొవిడ్‌-19 దేశంలోకి ప్రవేశించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కేర్స్‌’ను ప్రారంభించింది. కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి ఈ నిధులను వెచ్చిస్తున్నారు. ఔషధాలు, టీకాల పరిశోధనల కోసం కూడా ఖర్చు చేస్తున్నారు. అందుకే టీకా ధరల్లో అదనపు భారాన్ని పీఎం కేర్స్‌ నుంచి భరించాలంటూ కేటీఆర్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ధరల వ్యత్యాసంపై కేరళ, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.