సాంఖ్య దార్శనికుడు

ABN , First Publish Date - 2020-10-09T06:03:04+05:30 IST

పేరుకు తగినట్టు ప్రొఫెసర్ ప్రశాంతచంద్ర మహ్లనోబిస్‌ది ప్రశాంత ప్రవృత్తి కాదు. దానిలో సుడిగుండాలుండేవి, తుఫానులుండేవి, అగ్నిపర్వతాలుండేవి...

సాంఖ్య దార్శనికుడు

జలియన్ వాలా బాగ్ దురంతాల పట్ల తన తీవ్ర నిరసనను వ్యక్తం చేయడానికి1919లో టాగోర్ తన ‘సర్’ బిరుదాన్ని త్యజించారు ఆ సందర్భంలో నాటి వైస్రాయి లార్డ్ ఛెమ్స్ ఫర్డ్ పేర టాగోర్ రాసిన చారిత్రక లేఖకు తుది రూపాన్ని దిద్దడంలో మహ్లనోబిస్‌కు కొంత ప్రమేయమున్నది.


పేరుకు తగినట్టు ప్రొఫెసర్ ప్రశాంతచంద్ర మహ్లనోబిస్‌ది ప్రశాంత ప్రవృత్తి కాదు. దానిలో సుడిగుండాలుండేవి, తుఫానులుండేవి, అగ్నిపర్వతాలుండేవి.ఇట్టి ప్రవృత్తి కారణంగా ఆయనకు మిత్రులు, భక్తులుండేవారు, లేదా, విరోధులుండేవారు. మొదటి వర్గం వారు ఆయనను భూషించగా, రెండవ వర్గం వారు ఆయన ‘భజన ప్రియు’డని విమర్శిస్తూ వుండేవారు.అయితే ఆయన విరోధులైనా ప్రొఫెసర్ మహ్లనోబిస్ మేధా శక్తిని, బహు ముఖ ప్రతిభను కాదన లేదు. ఆయన కేంబ్రిడ్జిలో అభ్యసించినట్టిది గణిత శాస్త్రం, కలకత్తా యూనివర్శిటీలో బోధించింది పదార్థ విజ్ఞానశాస్త్రం, ప్రపంచ విఖ్యాతిని గడించింది సాంఖ్యక శాస్త్రవేత్తగా. 1933లో కలకత్తాలో ఆయన సంస్థాపించిన ‘ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్’ అతి త్వరలో అంతర్జాతీయ ప్రతిపత్తిని ఆర్జించుకోగలిగింది. 


రవీంద్రనాథ్ టాగోర్‌కు ప్రొఫెసర్ మహ్లనోబిస్ అంటే ప్రేమాదరాలు. ఆయన ప్రముఖుడైన బ్రహ్మ సమాజికుని పుత్రుడన్న కారణానే కాదు, ఒక ఘట్టంలో తనను దాదాపుగా వెలివేసినంత పని చేసిన సాధారణ బ్రహ్మ సమాజంతో తిరిగి తనకు సన్నిహితత్వం నెలకొల్పిన కారణానే కాదు; 1926లో తాను యూరోప్ పర్యటన చేసినప్పుడు తనతో తన వెంట వచ్చినాడన్న కారణానే కాదు. ఇందుకు అన్య కారణాలు కూడా అనేకం ఉన్నాయి.పెక్కు విజ్ఞానశాస్త్రాలలో పాండిత్యంతో పాటు సాహిత్యాభిరుచులున్నవాడు ప్రొఫెసర్ మహ్లనోబిస్. ఎన్నదగు రచయిత కాబట్టే టాగోర్‌ను పోలిన మహాకవికే రెండు రచనల సందర్భంలో మహ్లనోబిస్ సలహాలు చెప్పగలిగాడు.


జలియన్ వాలా బాగ్ దురంతాల పట్ల తన తీవ్ర నిరసనను వ్యక్తం చేయడానికి 1919లో టాగోర్ తన ‘సర్’ బిరుదాన్ని త్యజించారు ఆ సందర్భంలో నాటి వైస్రాయి లార్డ్ ఛెమ్స్ ఫర్డ్ పేర టాగోర్ రాసిన చారిత్రక లేఖకు తుది రూపాన్ని దిద్దడంలో మహ్లనోబిస్ కు కొంత ప్రమేయమున్నది. అటు తర్వాత కొంతకాలానికే టాగోర్ జపాన్‌లో పర్యటిస్తూ జాతీయతలోని సంకుచితత్వాన్ని నిశితంగా ఖండించారు. అప్పటిలో ఆయన చేసిన ప్రసంగాలకు మహ్లనోబిస్ ప్రేరణ కొంత వున్నది. మహ్లనోబిస్ పట్ల ప్రేమతో పాటు, గౌరవం కూడా ఉన్నందునే విశ్వ భారతి నిర్వహణలో తనకు చేదోడు వాదోడుగా వుండవలసిందిగా ఆయనను విశ్వకవి కోరాడు. మహ్లనోబిస్ సంస్థాపించిన సంస్థ నిర్వహణలో తాను స్వయంగా పాల్గొనక పోయినా, దాని పత్రికకు ‘సాంఖ్య’అనే పేరును టాగోర్ సూచించాడు. మామిడితోపులో మహ్లనోబిస్ కొత్త ఇంటిని కట్టుకున్నప్పుడు దానికి ‘ఆమ్ర పాలి’ అని నామకరణం చేసింది కూడా తిరిగి ఆయనే. టాగోర్ ప్రేమ గౌరవాలకు వలె జహవర్ లాల్ గౌరవాభిమానాలకు మహ్లనోబిస్ పాత్రు డైనాడు. పంచవర్ష ప్రణాళికల స్వరూప స్వభావాల నిర్ణయంలో మహ్లనోబిస్ సలహాలను నెహ్రూ పొందడం కొందరికి నచ్చ లేదు. ఆయన ప్రగ తిశీల దృక్పథం గలవాడు కాబట్టి నెహ్రూను ఆయన అపమార్గంలో, కమ్యూనిస్టు పంథాలో నడుపుతున్నాడని విమర్శలు వచ్చిన రోజులున్నాయి. 

1972 జూలై 1 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం

‘అసాధారణ వ్యక్తి: ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహ్లనోబిస్’ నుంచి

Updated Date - 2020-10-09T06:03:04+05:30 IST