‘ఆమదాలవలస’లో వార్డుల విభజనపై స్టే!

ABN , First Publish Date - 2021-06-15T05:23:30+05:30 IST

ఆమదాలవలస మునిసిపాల్టీలో వార్డుల విభజన పై హైకోర్టు స్టే విధించింది.

‘ఆమదాలవలస’లో వార్డుల విభజనపై స్టే!



(ఆమదాలవలస)

ఆమదాలవలస మునిసిపాల్టీలో వార్డుల విభజన పై హైకోర్టు స్టే విధించింది. గతంలో 23 వార్డులుండగా... బీ గ్రేడ్‌ మునిసిపాల్టీగా మారడంతో 27 వార్డులుగా అధికా రులు విభజించారు. ఇందుకు సంబంధించి 2020 జనవరి గజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేశా రు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. దీంతో టీడీపీ నాయకుడు, పార్టీ పట్టణ అధ్యక్షుడు బోర గోవిందరావు కోర్టును ఆశ్రయించారు. ఈ కారణంగానే జిల్లాలో మిగతా మునిసిపాల్టీలకు ఎన్నికలు జరిగినా...ఆమదాలవలస పురపాలక సంఘానికి నిర్వహించలేదు. కోర్టు సూచనల మేరకు ఈ ఏడాది మార్చిలో మరోసారి వార్డుల విభజనకు శ్రీకారంచుట్టారు. ఏప్రిల్‌లో గజిట్‌ నోటిఫికేషన్‌ను జారీచే శారు. అయితే  కృష్ణాపురం, చింతాడ గ్రామాలకు సంబంధించి విభజన ప్రక్రియ సరిగా లేదని టీడీపీ అభ్యంతరం తెలిపింది. కానీ అధికారులు సవరణ చేపట్టకపోవడంతో బోర గోవిందరావు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే విధించినట్టు గోవిం దరావు సోమవారం విలేఖర్లకు తెలిపారు.ఈ విషయంపై మునిసిపల్‌ కమిషనర్‌ ఎం.రవి సుధాకర్‌ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా తమకు ఎటువంటి ఉత్తర్వులు రాలేదని తెలిపారు. 

Updated Date - 2021-06-15T05:23:30+05:30 IST