పన్నులు దోచి ఉచితాలకు ధారపోత!

ABN , First Publish Date - 2022-08-18T11:48:40+05:30 IST

సంక్షేమ పథకాలు అణగారిన వర్గాలకు అందించాలననడంలో సందేహం లేదు. అది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు. అదే సమయంలో అనర్హులకు ఉచిత పథకాలు పంపిణీ చెయ్యడంపై...

పన్నులు దోచి ఉచితాలకు ధారపోత!

సంక్షేమ పథకాలు అణగారిన వర్గాలకు అందించాలననడంలో సందేహం లేదు. అది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు. అదే సమయంలో అనర్హులకు ఉచిత పథకాలు పంపిణీ చెయ్యడంపై ప్రభుత్వాలు పునరాలోచించాలి. పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ వంటి ప్రాథమిక అవసరాలు తీర్చి, విద్య, వైద్య సౌకర్యాలు అందించాలి. కానీ కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికల్లో, ప్రచారాల్లో అర్థంలేని, ఆచరణ సాధ్యంకాని అశాస్త్రీయ, రాజ్యాంగ విరుద్ధ వాగ్దానాలు చేస్తున్నాయి. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక వాగ్దానాలను విస్మరిస్తున్నాయి. దీర్ఘకాల ప్రయోజనాల విస్మరించి, తాత్కాలిక తాయిలాలతో తృప్తిపడుతున్న అమాయక ప్రజలు స్వార్థ రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుగా మారుతున్నారు.


ఈ సమయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గారు తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు భారత న్యాయచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి. ఈ నిర్ణయాలు జాతి ప్రయోజనాలకే కాదు, దేశాభివృద్ధికి తోడ్పడతాయనడంలో సందేహం లేదు. హేతుబద్ధతలేని ఉచితాలను నియంత్రించాలని ఆయన వ్యాఖ్యానించటం అభినందనీయం. భారతదేశ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఉండి, తన పరిధిని దాటి తీసుకుంటున్న చొరవకు యావత్ జాతి గర్విస్తోంది. ముఖ్యంగా ఉచిత హామీల విషయంలో రాజకీయ పార్టీలు చేస్తున్న వాగ్దానాలపై చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. నిజానికి ఇది ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చే అంశం. కానీ ఎన్నికల కమిషన్ చేతులు ఎత్తేయడంతో రాజకీయ పార్టీలకు కళ్లెంవేసే బాధ్యత చీఫ్ జస్టిస్ తీసుకున్నారు.


సంపద సృష్టించకుండా ఇలా అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి పంచుకుంటూ పోతే ఏమి మిగులుతుంది. ఆస్తుల కల్పన, అభివృద్ధి సంగతి ఏమిటి? తమ కష్టార్జితాన్ని రాజకీయ పక్షాలు యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నాయనే సంగతిని ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. సంక్షేమం వేరు, ఉచితం వేరు అనే విషయాన్ని చీఫ్ జస్టిస్ తెలియజేయడం గమనార్హం. ఏది సంక్షేమం? ఏది ఉచితం? అనే అంశం కూడా తెరపైకి వస్తోంది. ఉచితాలకు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించి, కొన్నిటిపై మాత్రమే రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేసే విధంగా ఉండాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేయాలనడం అప్రజాస్వామికమని చీఫ్ జస్టిస్ కీలకమైన వ్యాఖ్యలు చెయ్యడం గమనార్హం.


సంక్షేమ పథకాల అమలు విషయంలో జాతీయ స్థాయిలో ఒకే విధానం ఉండాలి. ప్రభుత్వాల ఆదాయంలో సంక్షేమం వాటా ఎంత ఉండాలి అన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలను చూస్తూ ఊరుకోవటం సమాజానికి శ్రేయస్కరం కాదు. అందులో మంచి ఎంత, చెడు ఎంత, సంక్షేమం ఎంత, దోపిడి ఎంత అన్నది ప్రజలు కూడా గుర్తించాలి. నాయకులు ప్రలోభాల మాయ వలలు విసిరి ఓట్లు కొల్లగొడుతూ ప్రజాస్వామ్యాన్ని క్రూరంగా పరిహసిస్తున్నారు. మితిమీరిన సంక్షేమ పథకాల మాటున ప్రజలను పన్నుల రూపంలో దోపిడీ చేస్తున్నారు. తాయిలాల ఒరవడిలో కొట్టుకుపోతున్న ప్రజలు విచక్షణ మరచి ఓట్లు వేస్తున్నారు. సంక్షేమం హద్దులు దాటి సోమరిపోతులు పెరిగి పోతున్నారు. కష్టపడి పని చేసి జీవించే సంస్కృతికి మంగళం పాడారు. మనకి ఉన్న అతిపెద్ద ఆస్తి యువత. చివరికి ఆ మానవ వనరులను కూడా నిర్వీర్యం చేస్తూ పనికిరాని వాళ్ళుగా మారుస్తున్నారు. ఆదాయం కోసం కష్టపడే తత్త్వం వున్నవారిని కూడా సోమరితనం వైపు మళ్లిస్తున్నారు. ఇది ఎంత ప్రమాదమో ఎవరు ఆలోచించడం లేదు.


ఒక పక్కన వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని అందరూ అంగీకరిస్తారు. అయినా రైతును, వ్యవసాయాన్ని గట్టెక్కించే దీర్ఘకాలిక ప్రణాళికలు రచించరు. వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. అయినా వారికి శాశ్వత పరిష్కారాలు చూపించి వారిని ఆదుకోవాలన్న వివేచన ఎక్కడా కానరాదు. ఉచితాల మూలంగానే గ్రామాల్లో వ్యవసాయ పనులకు కూలీలు రావడం లేదు. మానవ వనరుల కొరత వలన రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా పోయింది.


కష్టపడి సంపాదించి పన్నులు కట్టేది కొందరైతే, దానిని పంచిపెట్టి మరికొందరిని సోమరిపోతులను చేస్తున్నారు. ఎవరికి పట్టకుండా మధ్యతరగతి ప్రజలు మిగిలిపోతున్నారు. తాము కష్టపడి సంపాదించి కడుతున్న పన్నులను ఇష్టానుసారం పందేరం చెయ్యడానికి మీకు హక్కు ఎక్కడిదని ప్రశ్నించాలి ప్రజలు. ఎన్నికల్లో ఓటింగులో అధికంగా అల్పాదాయ వర్గాలే పాల్గొంటున్నాయి. వారిని మెప్పించేందుకు ఆకర్షణీయమైన ఉచిత పథకాలను అమలు చేస్తున్నారు. ఎగువ, మధ్య తరగతి ప్రజలు ఓటింగుకు దూరంగా ఉంటున్నారు. ఓట్ల వేట, ఉచిత పథకాల దుష్పరిణామం రాష్ట్రాలపై పెను ప్రమాదం చూపుతోంది. చేపలు పట్టి బతకటం నేర్పకుండా, ఓట్ల కోసం చేపలు పట్టి కూర కూడా వండి పెడతామంటున్నారు. అనేక సంక్షేమ పథకాల ద్వారా ఉచితంగా లబ్ధి పొందుతున్నప్పుడు ఎవరికైనా పని చేయాలని ఎందుకనిపిస్తుంది? ఉచిత పథకాల అమలు కారణంగా సంపాదిస్తున్న ఆదాయంలో భారీగా డబ్బులు మిగలడంతో కొందరు మందు బాబులు మద్యం దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. ప్రజలతో మద్యం తాగించి వచ్చే ఆదాయంతో కొన్ని పథకాలు అమలు చేస్తున్నారు. ఉదాహరణకి మన రాష్ట్రంలో ఒకవైపు ‘అమ్మ ఒడి’ అంటూ మురిపిస్తున్నారు. మరోవైపు ‘అయ్య బుడ్డి’తో బొక్కసం నింపుకొంటున్నారు. ఎవరి డబ్బుతో ఎవర్ని బాగు చేస్తున్నట్లు?


ఒక ప్రమాణమన్నది లేకుండా విపరీతంగా ప్రజలపై సకల పన్నులు పెంచారు. మూడేళ్లలో వివిధ రూపాల్లో పెంచిన పన్నులు, ఛార్జీలు రూపంలో రూ.90 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక చేత్తో ఇస్తున్నారు. మరో చేత్తో గుంజుకొంటున్నారు. రాష్ట్రంలో పెట్రోలు, డీజీలు ధరలు సెంచరీ దాటాయి. పెట్రోలు, డీజిలు ధరలు పెరగడమే కాకుండా వాటిపై విధించే అమ్మకం పన్ను రూపంలో వేల కోట్లు పిండుకొంటున్నారు. అన్నీ రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌లోనే వ్యాట్ పన్ను అధికం.


ఈ రాజకీయ ఉచితాలాటలో సామాన్యులే సమిధలు అవుతున్నారు. జనం సొమ్మునే జనానికి పంచి రీ సైక్లింగ్ చేస్తూ జనంతో కీర్తించుకొంటున్నారు. ఉచితం అంటేనే ఓటర్లకు లంచం ఇవ్వడం. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రాష్ట్రాలు కూడా ఉచితాలు వెంట పరుగులు తీస్తున్నాయి. బ్యాంకు ఖాతాల్లో నగదు, ఉచిత గ్యాస్, ఉచిత కరెంట్, స్మార్ట్ ఫోన్లు, స్కూటీలు, ల్యాప్‍టాప్‌లు, 45 ఏళ్లకే పింఛన్లు ఇలా అనేక హామీలు ఎన్నికల సందర్భంగా ఇస్తున్నారు. ప్రజల సొమ్మును ఇష్టానుసారం పంచిపెట్టే ధోరణికి అడ్డుకట్ట వేయాలి. హామీలు హేతుబద్ధంగా ఉండాలని, హామీల అమలుకు అయ్యే ఖర్చును ఎక్కడి నుంచి తెస్తారో తెలపాలి అని గట్టి నిబంధనలు అమల్లోకి రావాలి.


రాష్ట్ర భవిష్యత్తు ఆందోళన కలిగిస్తోంది. ఉచిత సంక్షేమ పథకాల పేరుతో ప్రజల ఆస్తులు, భూములు అమ్మి పరిపాలన చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజన ఎజెండా తప్ప, రాష్ట్రాభివృద్ధి ఎజెండా లేదు. తమకి ఓట్లు వస్తే చాలు కోట్లు పోయినా ఫర్వాలేదు. అసత్యాలతో, అభూతకల్పనలతో, ఉచితాలతో ప్రజానీకాన్ని ఏ మారుస్తున్నారు. సంక్షేమానికి ఉచితాలకు వ్యత్యాసాన్ని ప్రజలు అర్థం చేసుకోనంత కాలం రాష్ట్రం బాగుపడే అవకాశం లేదు.

మన్నవ సుబ్బారావు

మిర్చి యార్డు మాజీ ఛైర్మన్, గుంటూరు

Updated Date - 2022-08-18T11:48:40+05:30 IST