వేడెక్కిన ఉక్కు ఉద్యమం

ABN , First Publish Date - 2021-02-27T05:55:41+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన రాస్తారోకోకు అన్నివర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది.

వేడెక్కిన ఉక్కు ఉద్యమం

ప్రైవేటీకరణను నిరసిస్తూ రాస్తారోకోలు

కూర్మన్నపాలెం జంక్షన్‌లో రెండు గంటలపాటు బైఠాయింపు

వందలాదిగా రోడ్లపైకి వచ్చిన నిరసనకారులు

సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీజేపీయేతర పార్టీలు

మద్దిలపాలెంలో అరెస్టులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన రాస్తారోకోకు అన్నివర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. నగరంలోని కూర్మన్నపాలెం (స్టీల్‌ప్లాంట్‌ జంక్షన్‌), గాజువాక, మద్దిలపాలెం ప్రాంతాల్లో చేపట్టిన రాస్తారోకోలో స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు, కార్మికులతోపాటు పలు రాజకీయ పార్టీల నాయకులు, మహిళా, విద్యార్థి, యువజన, నిర్వాసిత, దళిత, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 


ఉక్కు పరిరక్షణ ఉద్యమకారులు జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం జంక్షన్‌లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్రమోదీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. స్టీల్‌ప్లాంట్‌ జోలికి వస్తే ఉపేక్షించేది లేదని, పోరాటాలతో సాధించుకున్న ఉక్కు పరిశ్రమను పోరాటాలతో కాపాడుకుంటామని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్‌ అయోధ్యరామ్‌ మాట్లాడుతూ ఉక్కు ఉద్యమాన్ని రెచ్చగొట్టేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నరసింగరావు తదితరులు మాట్లాడుతూ త్యాగాల ఫలితంగా సాధించుకున్న ఉక్కు పరిశ్రమను ఉద్యమాల ద్వారా కాపాడుకుంటామన్నారు. టెండర్లు వేసేందుకు వచ్చేవారిని కర్మాగారంలోకి అడుగుపెట్టనివ్వబోమని స్పష్టం చేశారు. గాజువాకలో జరిగిన రాస్తారోకోలో వామపక్షాలతోపాటు ఉక్కు నిర్వాసిత కుటుంబాలు పాల్గొన్నాయి. అదేవిధంగా మద్దిలపాలెం కూడలిలో సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.వెంకటరమణల ఆధ్వర్యంలో ఆందోళనకారులు బస్‌స్టేషన్‌ వద్ద బైఠాయించారు. అయితే, ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు బలవంతంగా కొందరిని ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి వాహనాల్లో పడేశారు. పోలీసులను ఉపయోగించి ఉద్యమాన్ని అణచివేసే కుట్ర జరుగుతోందని లోకనాథం, వెంకటరమణ విమర్శించారు. ఎవరెన్ని చేసినా పరిశ్రమను కాపాడుకుంటామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. 


తెలంగాణ కవి జయరాజు సంఘీభావం


విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరానికి శుక్రవారం తెలంగాణ కవి, గాయకుడు జయరాజు హాజరై తమ మద్దతు తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు సీహెచ్‌.నరసింగరావు, జె.అయోధ్యరామ్‌, జేవీ సత్యనారాయణమూర్తి, డి.ఆదినారాయణ,మంత్రి రాజశేఖర్‌, బోసుబాబు, సురేశ్‌ బాబు, సన్యాసిరావు, బొడ్డు పైడిరాజు, మస్తానప్ప, విళ్ల రామ్మోహన్‌ కుమార్‌, వరసాల శ్రీనివాసరావు, దొమ్మేటి అప్పారావు, సత్యనారాయణ, శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:55:41+05:30 IST