ఉక్కు బంద్‌ సక్సెస్‌

ABN , First Publish Date - 2021-03-06T09:02:12+05:30 IST

విశాఖ ఉక్కు కోసం విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడప, నెల్లూరు, గుంటూరు... ఇలా ప్రతి జిల్లా, పలు నగరాలు, పట్టణాలూ లేచి నిలబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు, టీడీపీ శ్రేణులు, ప్రజా సంఘాలు

ఉక్కు బంద్‌ సక్సెస్‌

ఉక్కు  ప్రైవేటీకరణపై అఖిలాంధ్ర పిడికిలి

రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావ ప్రదర్శనలు

విశాఖ ఉక్కు కోసం 13 జిల్లాలు ఏకం

బీజేపీ మినహా రాజకీయ పార్టీలన్నీ జై

రాస్తారోకోలు, మానవహారాలతో హోరు

పనిచేయని పాఠశాలలు, కళాశాలలు

మధ్యాహ్నం వరకు డిపోల్లోనే బస్సులు

కలిసొచ్చిన ఆటోలు, లారీ యూనియన్లు

విశాఖ ఉక్కుకోసం అఖిలాంధ్ర పిడికిలి బిగించింది.


ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇచ్చిన బంద్‌ పిలుపును విజయవంతం చేసింది. ‘ఆంధ్రుల హక్కు’ ఉద్యమాన్ని తలపిస్తూ జిల్లాలకు జిల్లాలే కదిలాయి. ధర్నాలు, రాస్తారోకోలు, నినాదాల ప్రతిధ్వనులతో హోరెత్తించాయి. 


(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌)

విశాఖ ఉక్కు కోసం విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడప, నెల్లూరు, గుంటూరు... ఇలా ప్రతి జిల్లా, పలు నగరాలు, పట్టణాలూ లేచి నిలబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు, టీడీపీ శ్రేణులు, ప్రజా సంఘాలు రోడ్డెక్కి నినదించాయి. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం, వామపక్షాల నేతృత్వంలో ప్రతి మండల కేంద్రంలో ర్యాలీలు జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంతో పాటు అన్ని పట్టణాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతబడ్డాయి. పాలకొల్లులో ‘ప్రభుత్వ సంస్థలు ముద్దు... ప్రైవేటు సంస్థలు వద్దు’ అంటూ చిన్నారులు నిర్వహించిన  ప్రదర్శన ఆకట్టుకుంది. బంద్‌ కారణంగా ద్వారకాతిరుమలలో భక్తుల తాకిడి తగ్గింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రాజమహేంద్రవరంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సీపీఐ నేతలు రావుల వెంకయ్య, తాటిపాక మధు,  సీపీఎం నేతలు ఏవీ నాగేశ్వరావు, టీ అరుణ తదితరులు బంద్‌లో పాల్గొన్నారు. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సంఘీభావం తెలిపారు. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లతోపాటు రాజమహేంద్రవరం పేపరుమిల్లు, హార్లిక్స్‌ ఫ్యాక్టరీ, కాకినాడ పోర్ట్‌ కార్మికులు మద్దతు తెలిపారు.


కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ప్రదర్శనలు, మోటార్‌ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌, సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కె.రామాంజనేయులు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్‌బాబు తదితరులు నిరసనల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో సీపీఎం, సీపీఐ, ట్రేడ్‌యూనియన్లు, టీడీపీ నేతలు బంద్‌లో పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో టీడీపీ నేతలు ర్యాలీ చేశారు. ప్రకాశం జిల్లాలో ఏఐటీయూసీ, సీఐటీయూలతో పాటు వామపక్షాల శ్రేణులు ప్రధానంగా ఆందోళనలు నిర్వహించగా టీడీపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు మద్దతుగా పలుచోట్ల పాల్గొన్నారు. ఒంగోలులో బైపాస్‌ ప్లైఓవర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు నిర్వహించిన ర్యాలీలో సీపీఎం, సీపీఐ జిల్లా నేతలు పూనాటి ఆంజనేయులు, ఎంఎల్‌ నారాయణ,  చీకటి శ్రీనివాసరావు, పీవీఆర్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో విజయనగరంతో పాటు బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, ఎస్‌.కోటలతో పాటు అన్ని పట్టణాల్లో బంద్‌ వాతావరణం కనిపించింది. విజయనగరంలో వామపక్షాలు, వివిధ ప్రజా, ఉద్యోగ సంఘాలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. నెల్లూరు జిల్లాలో బంద్‌ ప్రభావం కనిపించింది. పొదలకూరులో వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి, కావలి, గూడూరు, సూళ్లూరుపేటల్లో టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్ధన్‌రెడ్డి, పాశిం సునీల్‌, నెలవల సుబ్రహ్మణ్యం ఆందోళనల్లో పాల్గొన్నారు.


కడపలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, కడప అసెంబ్లీ ఇన్‌చార్జి అమీర్‌బాబు, పీరయ్య ఆధ్వర్యంలో మోటరుబైకు ర్యాలీ నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, వైసీపీ నగర కార్యదర్శి పులి సునీల్‌కుమార్‌లు ఆర్టీసీ బస్టాండు వద్ద నిరసన వ్యక్తం చేశారు. రాజంపేటలో వామపక్ష నేతలు రాజంపేట - రేణిగుంట రహదారిపై రాస్తారోకో నిర్వహించగా,  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రొద్దుటూరులో టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఆధ్వర్యంలో నాలుగురోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు. కాగా, చిత్తూరు జిల్లాలో మధ్యాహ్నం వరకూ ఆర్టీసీ బస్సు సర్వీసులు ఆగిపోయాయి. తిరుపతిలో మాత్రం తిరుమలకు బస్సులు యథావిధిగా నడిచాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నీ మూతపడగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు పనిచే శాయి. 


విశాఖ కాక..

విశాఖ నగరంలోని మద్దిలపాలెం సెంటర్‌కు ఉదయం ఆరు గంటలకే వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల నాయకులు చేరుకొని ఆందోళనకు దిగారు. సీపీఎం నాయకులు సీహెచ్‌ నరసింగరావు, సీపీఐ నాయకులు జేవీ సత్యనారాయణమూర్తి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్‌ అజ శర్మ కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసించారు. ఉదయం 10 గంటలకు మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఇతర వైసీపీ నాయకులు మద్దిలపాలెం జంక్షన్‌కు వచ్చి ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. రోడ్డుపై కూర్చున్నారు. పీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నుంచి జగదాంబ జంక్షన్‌ వరకు ర్యాలీ చేపట్టి...ధర్నా చేశారు. గాజువాకలో తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా చేశారు.


జిల్లా కోర్టు ఎదుట ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ విశాఖ యూనిట్‌ ధర్నా చేపట్టింది.  కాగా, స్టీల్‌ప్లాంటులో ఉత్పత్తికి ఆటంకం కలగకుండా కనీసం 70 శాతం మందైనా హాజరు కావాలని యాజమాన్యం కోరగా, కార్మిక సంఘాలు నిరాకరించాయి. అయితే ప్లాంటు పూర్తిగా ఆగిపోతే సమస్యలు వస్తాయని 50 శాతం మంది మాత్రమే విధులకు హాజరయ్యారు. 


నల్లబ్యాడ్జీలతో ‘సచివాలయం’ సంఘీభావం

రాష్ట్ర బంద్‌లో అమరావతి సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి పలువురు ఉద్యోగులు విధి నిర్వహణలో పాల్గొన్నారు. కాగా, బంద్‌ కార ణంగా శుక్ర వారం ఉదయం నుంచి ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోవడంతో, వాహన సదుపాయం లేని ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విధులకు హాజరుకాలేకపోయిన ఉద్యోగులు.. ఆయాశాఖల అధికారులకు రవాణా సౌకర్యం లేక హాజరుకాలేకపోతున్నామంటూ సమాచారం అందజేశారు. వెలగపూడి సచివాలయం ప్రాంతంలో వాహనాలను అమరావతి జేఏసీ నేతృత్వంలో రాజధాని రైతులు అడ్డుకొని బంద్‌కు జైకొట్టారు. కృష్ణాయపాలెం, మందడం గ్రామాల పరిధిలో మహిళలు మానవహారం నిర్మించారు. తుళ్లూరులో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ తీశాయి.


హైదరాబాద్‌లోనూ...

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌ ఇందిరా పార్కు దగ్గర ధర్నా నిర్వహించారు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి,  టీ-సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ(ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ) కార్యదర్శి గోవర్థన్‌, సీపీఐ(ఎంఎల్‌-ఎస్‌) కార్యదర్శి మురహరి, ఎస్‌.బాలరాజు, వీ.ఎ్‌స.బోస్‌, ప్రేమ్‌ పావని, ఎండీ యూసుఫ్‌, బీవెంకటేశం,(ఏఐటీయూసీ), సాయిబాబా(సీఐటీయూ) ధర్నాలో పాల్గొని ఉక్కు బంద్‌కు మద్దతు ప్రకటించారు. 


సాయిరెడ్డికి చేదు అనుభవంముందు పోస్కోతో డీల్‌ రద్దు చేసుకోండి

బంద్‌లో నిలదీసిన సీఐటీయూ కార్యకర్త విశాఖపట్నం: రాష్ట్ర బంద్‌ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి విజయసాయిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మద్దిలపాలెం కూడలిలో వామపక్షాలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి విజయసాయిరెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో హాజరై తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరూ మానవహారంగా ఏర్పడి వాహనాల రాకపోకలను అడ్డుకోవాలని మైక్‌లో కోరారు. అనంతరం ఆయన మానవహారంగా ఏర్పడిన ఒక్కొక్కరి వద్దకు మైక్‌ను తీసుకువెళ్లి, బంద్‌తోపాటు స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై తమ అభిప్రాయాలను చెప్పాలని కోరారు.


ఈ క్రమంలో సీఐటీయూ కార్యకర్త సురేశ్‌ వద్ద మైక్‌ పెట్టి తన అభిప్రాయం చెప్పాలని కోరారు. ఆయన ఊహించని విధంగా ‘ముందు మీరు పోస్కోతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయండి’ అని కోరారు. దీంతో అవాక్కయిన విజయసాయిరెడ్డి ‘ఒప్పందం ఎవరు చేసుకున్నారు?’అని ప్రశ్నించారు. దీనిపై సురేశ్‌...‘ఎవరు చేసుకున్నా, అఽధికారంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఆ పనిచేయండి’ అని రెట్టించి సమాధానం ఇచ్చారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన విజయసాయిరెడ్డి ‘ఆ ఒప్పందంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు. ఒప్పందాన్ని రద్దు చేసే అధికారం కూడా లేదు. నీకు లేని అధికారాన్ని నువ్వు ప్రదర్శించలేవు’ అని అంటూ అక్కడి నుంచి మైక్‌ తీసుకుని విసురుగా మరొకరి వద్దకు వెళ్లిపోయారు. 


ఆగిన చక్రం..

విజయవాడలో సుమారు మూడు వేల బస్సులు ఆగిపోగా రాష్ట్ర వ్యాప్తంగా పదివేలకు పైగా నిలిచిపోయాయి. రాయలసీమ నెల్లూరు జిల్లాల నుంచి కర్ణాటక, తమిళనాడుకు... కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి తెలంగాణకు వెళ్లాల్సిన బస్సులు ఆగిపోయాయి. తిరుమల కొండపైకి వెళ్లే 200 బస్సులను సైతం మధ్యాహ్నం వరకూ నిలిపేయడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. విజయవాడలో ఆటోలు రోడ్లపై ఆపి బంద్‌కు మద్దతు ప్రకటించారు. లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు మధ్యాహ్నం వరకూ సరకు రవాణా వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. 


విశాఖపట్నంలో.. నిర్మానుష్యంగా ఉన్న మద్దెలపాలెం సెంటర్‌


ఏలూరులో.. మూతపడిన దుకాణాలు


ఒంగోలులో.. ర్యాలీ నిర్వహిస్తున్న వామపక్షాలు, ఇతర కార్మిక సంఘాలు

Updated Date - 2021-03-06T09:02:12+05:30 IST