‘క్విట్‌ ఇండియా’ స్ఫూర్తితో ఉక్కు పరిరక్షణ ఉద్యమం

ABN , First Publish Date - 2022-08-10T05:33:58+05:30 IST

క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

‘క్విట్‌ ఇండియా’ స్ఫూర్తితో ఉక్కు పరిరక్షణ ఉద్యమం
సదస్సులో సంఘీభావం తెలుపుతున్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు

పోరాట కమిటీ తీర్మానం

డాబాగార్డెన్స్‌, ఆగస్టు 9  : క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ  ఆధ్వర్యంలో మంగళవారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోరుతూ కార్మిక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నేతలు సీహెచ్‌.నరసింగరావు, మంత్రి రాజశేఖర్‌, డి.ఆదినారాయణలు మాట్లాడుతూ స్ట్రాటజిక్‌ సేల్‌ పేరుతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నూరు శాతం అమ్మి తీరుతామని, లేకపోతే మూసివేస్తామని కేంద్ర ఉక్కు గనుల మంత్రి పార్లమెంట్‌లో పదేపదే ప్రకటిస్తూ మైండ్‌గేమ్‌ ఆడటాన్ని జేఏసీ ఖండిస్తున్నదన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ చేస్తున్న పోరాటానికి మద్ధతుగా సెప్టెంబరు నుంచి అన్ని పరిశ్రమల వద్ద ఆందోళనలు చేపట్టాలని ఏకగీవ్రంగా తీర్మానించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌, ఇతర నాయకులు వెంకటరావు, కేఎస్‌ఎన్‌ రావు, ఈశ్వరరావు, బాబూరావు, నాగేశ్వరరావు, రమణమూర్తి, మసేను, సాగర్‌, గంగారావు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-10T05:33:58+05:30 IST