‘మత్తు’పై ఉక్కుపాదం!

ABN , First Publish Date - 2022-01-28T08:42:22+05:30 IST

రాష్ట్రంలో డ్రగ్స్‌ సరఫరా, వాడకంపై కఠినంగా వ్యవహరించాలని, ‘మత్తు’పై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

‘మత్తు’పై ఉక్కుపాదం!

  • రాష్ట్రంలో డ్రగ్స్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై నేడు పోలీస్‌, 
  • ఎక్సైజ్‌ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష
  • ఖరారు కానున్న కార్యాచరణ ప్రణాళిక


హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డ్రగ్స్‌ సరఫరా, వాడకంపై కఠినంగా వ్యవహరించాలని, ‘మత్తు’పై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా సీఎం కేసీఆర్‌.. పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో జరగనున్న ఈ సమావేశంలో.. హోమ్‌, ఎక్సైజ్‌ మంత్రులతో పాటు సీఎస్‌, డీజీపీ, ఎస్పీలు, కమిషనర్లు, ఇతర పోలీస్‌, ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు పాల్గొంటారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి.. ఇందుకోసం ఓ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తారు. డ్రగ్స్‌ నియంత్రణకు 1000 మందితో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక పోలీస్‌ విభాగంపై చర్చిస్తారు. కాగా, డ్రగ్స్‌ నియంత్రణపై సీఎం కేసీఆర్‌.. గత ఏడాది అక్టోబరులో ఓసారి సమీక్ష నిర్వహించారు. గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ఆ సమావేశంలో ఆదేశించారు. 


ఇక అప్పటి నుంచి పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులు వేర్వేరుగా దాడులు చేసి.. భారీగా కేసులు నమోదు చేశారు. ఈ కేసుల దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెలుగు చూశాయి. కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనే ‘మత్తు’ గ్రామాల్లోకి చొచ్చుకెళ్లిందని పోలీసులు గుర్తించారు. గ్రామీణ ప్రాంత యువకులు గంజాయిని ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తేల్చారు. ఈ అంశాలన్నింటినీ ఈ సమావేశంలో అధికారులు.. సీఎం కేసీఆర్‌కు వివరిస్తారు. కాగా, రాష్ట్రంలో ఎన్డీపీఎస్‌ (నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టెన్సెస్‌) యాక్ట్‌ కింద నమోదవుతున్న కేసుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. 2020లో 509 కేసులు నమోదుకాగా.. గత ఏడాది 1233 కేసులు నమోదవడం గమనార్హం. అందులో 1207 కేసులు గంజాయికి సంబంధించినవే. మిగిలిన 26.. డ్రగ్స్‌ కేసులు. ఈ కేసుల్లోని నిందితుల్లో 127 మందిపై పోలీస్‌ అధికారులు పీడీయాక్ట్‌ ప్రయోగించారు. అయితే.. ఈ కేసుల్లో పాత్రధారులను అరెస్టు చేస్తున్న పోలీసులు.. సూత్రధారులపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో.. ఎన్ని కేసులు నమోదవుతున్నా.. ఎంత మందిని అరెస్టు చేస్తున్నా.. మత్తు దందా మాత్రం యథేచ్ఛగా సాగిపోతోంది. 

Updated Date - 2022-01-28T08:42:22+05:30 IST