ఇంట్లో ఉక్కపోత.. బయట దోమల మోత

ABN , First Publish Date - 2022-05-19T06:48:44+05:30 IST

దోమలతో జిల్లా కేంద్రంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మురుగునీరు నిలిచిన ప్రాంతాల్లో దోమల వృద్ధి అధికంగా ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు దోమ ల బెడదను ఎదుర్కొంటున్నారు. వేసవి కాలం కావడంతో ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో రాత్రి సమయంలో ఆరుబయట నిద్రించాలంటే దోమల కాటుకు నిద్రపట్టడం లేదని వాపోతున్నారు. ఇటీవలి వర్షాలకు కూడా

ఇంట్లో ఉక్కపోత.. బయట దోమల మోత
ఇళ్ల మధ్య మురుగునీరు

అంతంతమాత్రంగా అధికారుల చర్యలు

 నిత్యం ఫాగింగ్‌ చేయాలని డిమాండ్‌

సూర్యాపేట టౌన్‌, మే 18:  దోమలతో జిల్లా కేంద్రంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మురుగునీరు నిలిచిన ప్రాంతాల్లో దోమల వృద్ధి అధికంగా ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు దోమ ల బెడదను ఎదుర్కొంటున్నారు. వేసవి కాలం కావడంతో ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో రాత్రి సమయంలో ఆరుబయట నిద్రించాలంటే దోమల  కాటుకు నిద్రపట్టడం లేదని వాపోతున్నారు. ఇటీవలి వర్షాలకు కూడా ఇళ్ల మధ్య ఖాళీ ప్రదేశాల్లో నీరు నిలిచింది. అందులో దోమలు గుడ్లు పెట్టడంతో దుర్వాసన కూడా వెదజల్లుతోంది. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలను శుభ్రం చేసినా అది పూర్తిస్థాయిలో జరగలేదు. కొద్దిరోజులకే పిచ్చిమొక్కలు పెరగడం, మురుగు నీరు చేరింది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించింది. ఎక్కడ చూసినా మురుగునీరు నిల్వ ఉండి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇళ్ల మధ్య మురుగునీరు నిల్వతోనే ఇబ్బందులు తప్పడం లేదు. దోమలతో పాటు  పందులు ఆవాసాలను ఏర్పాటు చేసుకొని రోగాలకు కారణమవుతున్నాయి. శివారు ప్రాంతాలైన అంజనాపురి కాలనీ, మానసనగర్‌, హైటెక్‌ కాలనీ, స్నేహనగర్‌, భగత్‌సింగ్‌నగర్‌లో, తాళ్లగడ్డతో పాటు  చాలా చోట్ల మురుగుకాల్వలు లేవు. మురుగు నీరంతా ఆవాసాల మధ్యనే చేరుతుంది. మనిసిపాలిటీ ఆధ్వర్యంలో అడపదడపా ఫాగింగ్‌ చేసినా ప్రయోజనం ఉండటం లేదు. మొత్తం 48 వార్డుల్లో సూర్యాపేట పట్టణ జనాభా రెండు లక్షలకు పైగా ఉంది. 32 వేలనివాస గృహాలు ఉండగా, సాయంత్రం తలుపు తెరిస్తే చాలు దోమలు ఇంటిని ముంచెత్తుతున్నాయి. సాయంత్రం అయితే చాలు దోమలతో తలుపులు తెరవలేని పరిస్థితి నెలకొంది. ప్రజలు  డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాలు, పలు వ్యాధులతో ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇదిలా ఉంటే కరోనాతో ఆస్పత్రుల పాలై ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండగా, ఇతర జబ్బులు వస్తే మరింత ఇబ్బందులు తప్పవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మునిసిపల్‌ సిబ్బంది మురుగుకాల్వలను శుభ్రం చేస్తున్నప్పటికీ దోమల తాకిడి మాత్రం తగ్గడం లేదు.    ప్రధానంగా పట్టణంలోని పలు ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు అధికంగా ఉన్నాయి. అక్కడికి వర్షపు నీరు చేరి చిన్నపాటి కుంటలను తలపిస్తున్నాయి. ఆ నీరు  దోమలకు ఆవాసాలుగా మారి పెరిగిపోతున్నాయి.

ఖర్చు చేసిన కానరాని ఫలితం

పట్టణంలో రోడ్లను ఊడ్చడానికి, మురుగు కాల్వల్లో పూడిక తీయడానికి, చెత్తను సేకరించడానికి రెగ్యులర్‌, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది 450 మంది పనిచేస్తున్నారు. ప్రతి ఏడాది దోమల నివారణకు ఫాగింగ్‌ పిచికారీ చేస్తున్నారు. సంవత్సరానికి రూ.3.50లక్షల దాకా ఖర్చు చేస్తున్నారు. సున్నం, బ్లీచింగ్‌కోసం రూ.4.50లక్షల దాకా ఖర్చు చేసినా దోమల నివారణ తగ్గడంలేదు. దోమల బెడదను తప్పించుకోవడానికి పట్టణంలోని చాలా కుటుంబాలు నెలకు రూ.500 దాకా ఖర్చు చేస్తున్నారు. మస్కిటో కాయిల్స్‌, లిక్విడేటర్స్‌ వాడుతున్నారు.  మునిసిపాలిటి ఆధ్వర్యంలో ఫాగింగ్‌ నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఫాగింగ్‌ కనిపించడంలేదు. ఇప్పటికే మునిసిపాలిటి ఫాగింగ్‌ నిర్వహణకు రూ.4 లక్షలతో రెండు కొత్త పెద్దఫాగింగ్‌ యంత్రాలను కొనుగోలు చేశారు. మెత్తంగా ఆరు ఫాగింగ్‌ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. 

మురుగు కాల్వలు శుభ్రం చేయాలి

దోమలతో ఇబ్బందులు పడుతున్నాం. మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ జ్వరాలు వస్తాయని భయంగా ఉంది. మునిసిపాలిటీ ఆధ్వర్యంలో రెగ్యులర్‌గా ఫాగింగ్‌ చేయాలి. ఖాళీ ప్రదేశాల్లో ఎలాంటి చెత్త వేయకుండా చూడాలి

- సంజయ్‌, పట్టణవాసి


దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం

ప్రజలంతా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి. అన్ని వార్డుల్లో దశల వారీగా ఫాగింగ్‌ చేస్తాం. 

- రామాంజులరెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ 








Updated Date - 2022-05-19T06:48:44+05:30 IST