సంక్షోభంలో స్టీల్‌ప్లాంటు!

ABN , First Publish Date - 2022-07-22T05:53:50+05:30 IST

విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై కార్మిక, ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నాయి.

సంక్షోభంలో స్టీల్‌ప్లాంటు!

ముడి పదార్థాల కొరతతో పడిపోయిన ఉత్పత్తి

నిర్వహణ, వడ్డీలు, జీతాల నిమిత్తం నెలకు రూ.1,200 కోట్లు అవసరం

అంత ఆదాయం సమకూర్చుకోవాలంటేనెలకు 5.5 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలి

ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్నది 2.5 లక్షల టన్నులే..

కేంద్రం సాయం చేస్తేనే కర్మాగారం మనుగడ

రూ.6 వేల కోట్లు ఇవ్వాలని కార్మిక, ఉద్యోగ సంఘాల డిమాండ్‌

ప్రైవేటీకరణకు అనుకూలంగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై కార్మిక, ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నాయి. విశాఖ ఉక్కును అమ్మేస్తే నష్టమేమిటి?, ప్రైవేటీకరిస్తే మీకు వచ్చిన ఇబ్బందేమిటి?...అంటూ కేంద్ర ఉక్కు శాఖా మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఢిల్లీలో బుధవారం కార్మిక సంఘాల నేతలను ప్రశ్నించడాన్ని ఇక్కడ అన్ని యూనియన్లు ఖండించాయి. గనుల సమస్య తీరుతుందని సెయిల్‌లో విలీనం చేయాలని కోరితే...కుదరదని చెప్పినందున కనీసం వర్కింగ్‌ కేపిటల్‌ (నిర్వహణ మూలధనం) అయినా సమకూర్చాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.


చేతిలో డబ్బుల్లేవు

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రస్తుతం అన్ని విధాలుగా ఇబ్బంది పడుతోంది. ముడి పదార్థాల కొరత వల్ల ఉత్పత్తి తగ్గిపోయింది. అమ్మకాలు పడిపోయాయి. ఆర్థిక వనరుల సమస్య తలెత్తింది. అన్నీ సమకూర్చుకొని పూర్తిస్థాయి ఉత్పత్తి జరగాలంటే...కనీసం రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్లు అవసరం. బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం భూమి తనఖా పెట్టి రుణం తెద్దామనుకున్నా...ఎకరా భూమి కూడా విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు పేరు మీద లేదు. అంతా భారత రాష్ట్రపతి పేరు మీదే ఉంది. ప్లాంటులో కేవలం యంత్రాలు, భవనాలు మాత్రమే ప్లాంటు ఆస్తి. వాటి పుస్తకపు విలువ ఆరు నెలల క్రితం రూ.3,100 కోట్లుగా లెక్క కట్టారు. ఇటీవల వరుసగా వచ్చిన నష్టాలతో ఆ విలువ కూడా తగ్గిపోయిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 


నెలకు రూ.1,200 కోట్లు తప్పనిసరి

విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో అన్నీ సక్రమంగా నడవాలంటే నెలకు రూ.1,200 కోట్లు కావాలి. ఫిక్స్‌డ్‌ ఖర్చులు రూ.550 కోట్లు. బ్యాంకుల నుంచి తెచ్చిన రుణాలకు నెలవారీ చెల్లించాల్సిన వడ్డీ రూ.400 కోట్లు. జీతాలకు మరో రూ.200 కోట్లు ఉండాలి. అన్నీ కలిపి రూ.1,200. నెలకు కనీసం రూ.2 వేల కోట్ల విలువైన ఉక్కు ఉత్పత్తులు విక్రయిస్తే...దేనికీ ఇబ్బంది ఉండదు. అంటే సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల టన్నుల ఉత్పత్తులు అమ్మాలి. ఇందుకోసం నెలకు 5.5 లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రోజుకు 8 వేల టన్నుల చొప్పున నెలకు 2.5 లక్షల టన్నులే తయారవుతోంది. ప్లాంటు సామర్థ్యం కంటే తక్కువ ఉక్కు తయారైతే ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది. మార్కెట్‌లో నష్టానికి అమ్మాల్సి వస్తుంది. ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది. ఇటువంటి సమయంలో అన్నింటినీ సమకూర్చుకొని మూడు బ్లాస్ట్‌ ఫర్నేసులను పూర్తిస్థాయిలో పనిచేయించేందుకు కనీసం రూ.5 వేల కోట్లు అయినా కేంద్రం సాయం చేయాలని ఉక్కు అధికారుల సంఘం డిమాండ్‌ చేస్తోంది. ఇది కూడా వాయిదాల పద్ధతిలో తీర్చే విధానంలోనే ఇవ్వాలని, గతంలో వాజ్‌పేయి, పీవీ నరసింహారావుల సమయంలో ఇలాగే ఇచ్చారని వారు గుర్తుచేస్తున్నారు. 


వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి

ప్రాణత్యాగంతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, వివిధ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-07-22T05:53:50+05:30 IST