ప్లాంట్‌ పరిరక్షణే ధ్యేయం

ABN , First Publish Date - 2022-06-27T06:51:45+05:30 IST

విశాఖ స్టీల్‌ప్టాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకు పోరాడుతామని ఉద్యోగ, కార్మిక, ప్రజా, ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.

ప్లాంట్‌ పరిరక్షణే ధ్యేయం

కేంద్రం వెనక్కి తగ్గేవరకు పోరాటం

స్పష్టం చేసిన ఉద్యోగ, కార్మిక, ప్రజా, ఉద్యోగ సంఘాల నేతలు

నగరంలో ఉక్కు కార్మికుల మహా ప్రదర్శన 

రిలే నిరాహార దీక్షలకు 500 రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహణ 

డీఆర్‌ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ 


 విశాఖపట్నం, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): 

విశాఖ స్టీల్‌ప్టాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకు పోరాడుతామని ఉద్యోగ, కార్మిక, ప్రజా, ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం ప్లాంట్‌ ముఖద్వారం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆదివారంతో 500 రోజులు పూర్తయిన సందర్భంగా నగరంలో మహా ప్రదర్శన నిర్వహించారు. వేలాది మంది ప్రదర్శనలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. 

దొండపర్తి జంక్షన్‌లోని డీఆర్‌ఎం కార్యాలయం నుంచి  జీవీఎంసీ గాంధీ వరకు నిర్వహించిన మహా ప్రదర్శనలో స్టీల్‌ప్లాంట్‌, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజా, ఉద్యోగ, నిరుద్యోగ సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఉదయం 10.30 గంటలకు డీఆర్‌ఎం కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు 11.30 గంటలకు చేరుకుంది. గంటపాటు సాగిన ప్రదర్శనలో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆంధ్రుల హక్కు- విశాఖ ఉక్కు అని నినదించారు. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన సభలో పలువురు ప్రముఖులు  స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని తూర్పారబట్టారు. 


ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి 

ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ ప్రభుత్వం రంగ సంస్థగా స్టీల్‌ప్లాంట్‌ను కొనసాగించడానికి అన్ని అవకాశాలు, వనరులు ఉన్నప్పటికీ ప్రైవేటీకరించే యత్నం చేయడం దారుణమన్నారు. ప్రజాంధకార ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. రైతుల ఉద్యమానికి కేంద్రం తలొగ్గిందని, అగ్నిపథ్‌ విషయంలో యువత ఉద్యమంతో సవరణలను తీసుకురానుందని, అదేబాటలో స్టీల్‌ప్లాంట్‌పై వెనక్కితగ్గే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.  లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మూతపడిన పరిశ్రమలను ఆదుకుంటామంటూ కేంద్రం ఆత్మ నిర్భర్‌భారత్‌ను ప్రవేశపెట్టిందని, సజావుగా నడుస్తున్న స్టీల్‌ప్లాంట్‌ను ఎందుకు ప్రైవేటీకరించేందుకు యత్నిస్తోందని ప్రశ్నించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నరసింగరావు మాట్లాడుతూ  17 నెలలుగా ఉద్యమం చేస్తున్నామని పోరాటంతోనే ప్లాంట్‌ను రక్షించుకుంటామని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా కేంద్రం పలు కమిటీలను వేసి ప్లాంట్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తే... ఎవరినీ లోపలకు అడుగుపెట్టనీయలేదని, అదేస్ఫూర్తితో ఉద్యమాన్ని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ రమణమూర్తి మాట్లాడుతూ బీజేపీ నాయకులు, మంత్రులను విశాఖలో అడుగుపెట్టనీయకుండా అడ్డుకుంటే వ్యతిరేకత తెలుస్తుందని, రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్రంలోని పార్టీలన్నీ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు పోరాడాలన్నారు. వైఎస్‌ఆర్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ కొవిడ్‌ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన కార్మికులు ప్లాంట్‌ను రూ.300 కోట్ల  లాభాల్లోకి తీసుకువెళ్లి, తమ శక్తిని నిరూపించారన్నారు.  ప్రైవేటు వ్యక్తులను ప్లాంట్‌లోకి రానీయకుండా చూడాలని, ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు మాట్లాడుతూ విశాఖ ఉక్కుపై స్పష్టమైన ప్రకటన చేసిన తరువాతే ప్రధాని విశాఖకు  రావాలన్నారు. ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు మంత్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ  ప్రజలు అధికారమిచ్చింది  ప్రభుత్వ సంస్థలను అమ్ముకోవడానికి కాదన్న విషయం ప్రధాని గుర్తించుకోవాలన్నారు. పీవోడబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ ప్రజలను త్యాగాలు చేయమని ప్రధాని మోదీ చెప్పడం దారుణమన్నారు. ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ భూములను అమ్ముకునే యత్నాల్లో భాగంగానే ప్రైవేటీకరణకు తెర లేపారన్నారు. పదవుల కోసం కాకుండా రాష్ట్రాభివృద్ధి కోసం రాజకీయ పార్టీలు కృషిచేయాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేటర్‌ గంగారావు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్న మోదీ రాకను నిరసిస్తూ భీమవరంలో నల్ల జెండాలతో నిరసన తెలపాలని, విశాఖ పర్యటనను అల్లూరి తరహా లో విల్లంబులు పట్టుకుని అడ్డుకుంటామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో కార్మిక సంఘాలు నాయకులు, వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు. 


మహా ప్రదర్శన గ్రాండ్‌ సక్సెస్‌ 

ఉక్కుటౌన్‌షిప్‌, జూన్‌ 26: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు చేపట్టిన రిలే నిరాహారదీక్షలకు 500 రోజులు అయిన సందర్భంగా ఆదివారం చేపట్టిన కార్మిక ప్రదర్శన  విజయవంతమయిందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్లు మంత్రి రాజశేఖర్‌, డి.ఆదినారాయణ, కన్వీనర్‌ జె.అయోధ్యరాం పేర్కొన్నారు. ఉక్కు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటాలు తప్పవన్నారు. ఉక్కు ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి ఉద్యమాన్ని ఉధతం చేస్తామని స్పష్టం చేశారు. 



Updated Date - 2022-06-27T06:51:45+05:30 IST