ఉక్కు పరిరక్షణ కోసం సత్యాగ్రహ దీక్ష

ABN , First Publish Date - 2022-08-13T06:56:53+05:30 IST

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం చేపట్టిన ఉద్యమంలో భాగంగా ఈ నెల 14వ తేదీ ఉదయం ఆరు నుంచి 15వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు సత్యాగ్రహ దీక్ష చేపట్టాలని పోరాట కమిటీ నిర్ణయించింది.

ఉక్కు పరిరక్షణ కోసం సత్యాగ్రహ దీక్ష

రేపు ఉదయం ఆరు నుంచి 15వ తేదీ సాయంత్రం ఆరు వరకు నిర్వహణ 

కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పోరాట కమిటీ  పిలుపు

ఉక్కుటౌన్‌షిప్‌, ఆగస్టు 12: విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం చేపట్టిన ఉద్యమంలో భాగంగా ఈ నెల 14వ తేదీ ఉదయం ఆరు నుంచి 15వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు సత్యాగ్రహ దీక్ష చేపట్టాలని పోరాట కమిటీ నిర్ణయించింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా సత్యాగ్రహ చేపడుతున్నట్టు పేర్కొంది. ఉక్కు ఉద్యమ వేదిక వద్ద చేపట్టనున్న ఈ సత్యాగ్రహ దీక్షలో అధిక సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చింది. 

రాష్ట్రానికే తలమానికమైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామని గత ఏడాది జనవరి 27న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటినుంచి ఉక్కు కార్మిక సంఘాలు, అఽధికారుల సంఘం, వివిధ అసోసియేషన్లు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీగా ఏర్పడి పోరాటం చేపట్టాయి. గత ఏడాది ఫిబ్రవరి 12న స్టీల్‌ ప్లాంట్‌ ఆర్చి వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాయి. నాటి నుంచి నేటి వరకూ వివిధ రూపాల్లో ప్లాంట్‌ పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తున్నాయి. కోటి సంతకాల ఉద్యమాన్ని కూడా చేపట్టాయి.


పోస్టర్‌ ఆవిష్కరణ

ఈ నెల 14 నుంచి చేపట్టనున్న ఉక్కు సత్యాగ్రహ దీక్షకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం ప్లాంట్‌లో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌, ప్రతినిధులు కేఎస్‌ఎన్‌ రావు, వైటీ దాసు, నీరుకొండ రామచంద్రరావు,రామ్మోహన్‌కుమార్‌, సన్యాసిరావు, వరసాల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. 


అన్నకు రాఖీ కట్టి వస్తూ అనంతలోకాలకు...

- రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ఆరిలోవ, ఆగస్టు 12: సోదరుడు నిండు నూరేళ్లు జీవించాలని రాఖీ కట్టి ఆశీర్వదించి...ఇంటికి తిరుగు ప్రయాణమైన ఆ మహిళను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ప్రమాదంలో ఆమె ఏడాదిన్నర  కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. ఆరిలోవ శాంతిభద్రతల ఎస్‌ఐ సిహెచ్‌.సూర్యనారాయణ తెలిపిన వివరాలు ఇవి. బండారు రామన్నదొర, పుష్పలత దంపతులు పైనాపిల్‌ కాలనీ ఎస్‌ఎస్‌ఎన్‌ నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాదిన్నర కుమార్తె ఉంది. పుష్పలత సోదరుడు రుషికొండలో నివసిస్తున్నాడు. శుక్రవారం రాఖీ పండుగ కావడంతో అన్నకు రాఖీ కట్టేందుకు ఉదయం తొమ్మిది గంటలకు తన ద్విచక్ర వాహనంపై కుమార్తెతోపాటు పుష్పలత వెళ్లింది. రాఖీ కట్టి తిరిగి వస్తుండగా డెయిరీ ఫారం జంక్షన్‌ వద్ద ఆమె వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో తుళ్లి రోడ్డుపై పడ్డ పుష్పలతకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమె ఏడాదిన్నర కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడింది. సీఐ ఇమాన్యుయేల్‌రాజు ఆధ్వ్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 



Updated Date - 2022-08-13T06:56:53+05:30 IST