మద్యంపై ‘దశలవారీ’ అబద్ధాలే మిగిలాయి!

ABN , First Publish Date - 2022-08-04T06:35:19+05:30 IST

అబద్ధం, మోసం, వంచనా మూర్తీభవిస్తే అది జగన్ ప్రభుత్వం. పచ్చని కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోందని, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయని...

మద్యంపై ‘దశలవారీ’ అబద్ధాలే మిగిలాయి!

అబద్ధం, మోసం, వంచనా మూర్తీభవిస్తే అది జగన్ ప్రభుత్వం. పచ్చని కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోందని, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయని, పేదల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని, నేను అధికారంలోకి వస్తే మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తానని... మేనిఫెస్టోలో వాగ్దానం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ అధికారంలోకి వచ్చి మూడేళ్ళయిన తరువాత ‘మా మేనిఫెస్టోలో మద్యపాన నిషేధమనే మాటే లేదు. మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం ఏదైనా చేయలేదంటే మీరు ప్రశ్నించండి’ అంటూ ఒక బాధ్యత గల మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అడ్డంగా బుకాయించడం సిగ్గుచేటు. మద్యనిషేధం అనేది అసలు తమ మేనిపెస్టోలోనే లేదని మంత్రి అమర్ నాథ్ అబద్ధాలకు తెగబడ్డారు.


ఏరు దాటే దాకా ఓడు మల్లన్నా, ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా అధికారంలోకి రాగానే మధ్య నిషేధ హామీని చాప చుట్టేసారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఇక ఆయనా, ఆయన మంత్రులూ అబద్ధాల మీదే బతుకుతున్నారు. జగన్ రెడ్డి, మంత్రులు ఊదరగొడుతున్నట్లు వారి మేనిపెస్టో భగవద్గీతో ఖురానో బైబిలో కాదు. అది జగన్‌రెడ్డి కంత్రీ మేనిఫెస్టో. వైసీపీ మేనిఫెస్టోలో నవరత్నాల పథకాలలో మద్య నిషేధం హామీ ప్రధానమైనది. దశలవారీ మధ్య నిషేధ హామీ పేదల కుటుంబాల్లో అంతులేని ఆనందాన్ని నింపింది. అధికారంలోకి వచ్చాక– దశలవారీగా మద్య నియంత్రణ చేపడతామని, ఒక్కటేసారి మద్యం ఆదాయాన్ని పూర్తిగా తీసేయలేమని, మద్యంపై రెవెన్యూ తగ్గించుకుంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తామని, వచ్చే ఎన్నికల సమయానికి మద్యాన్ని ఫైవ్‌స్టార్‌ హోటళ్లకే పరిమితం చేస్తామని, ఆ తర్వాతే  వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడుగుతామని.. జగన్‌రెడ్డి నీతులు చెప్పారు. జన వంచనలో జగన్ ఘనుడు అని ఈ మూడేళ్ళలో అందరికీ అర్థమైంది.


ధనార్జనే ధ్యేయంగా జలగల్లా జనం రక్తాన్ని పిండుకొని కాసులు దండుకొనేందుకు మందుబాబులనే లక్ష్యంగా ఎంచుకొన్నది వైసీపీ ప్రభుత్వం. మొన్నటి వరకు రేటు పెంచి మద్య నియంత్రణ చేస్తున్నామని చెప్పుకొన్నవారు, ఈ సారి భారీగా బార్ల ఏర్పాటుకు మరింత స్వేచ్ఛనిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఖజానా నింపుకోవాలన్న ఆలోచనే తప్ప మద్యనిషేధం అన్న ఉద్దేశమే లేదని తేలిపోయింది. మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపించి భారీ ఎత్తున అప్పులు తెస్తున్న ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీకి మంగళం పాడింది. సంక్షేమం పేరుతో అప్పుచేసి పప్పుకూడు తినిపించడానికి నానా అవస్థలు పడుతున్న జగన్ నవరత్నాలను మద్యం ఆదాయంలో ముంచి మరింత మెరిపిస్తారట. దీనిలో భాగంగానే 2025 ఆగస్టు ఆఖరు వరకు మద్య నిషేధం ఉండబోదని, మూడేళ్ళ పాటు నూతన బార్ల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. బార్‌ లైసెన్సుల జారీకి సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్‌ రూల్స్‌ 2022 నోటిఫికేషన్‌ జీవో 527ను ఎక్సైజ్‌ శాఖ అధికారులు జారీ చేశారు. మూడేళ్ల పాటు ఈ విధానం అమల్లో ఉండనుంది. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఈ కొత్త బార్ల విధానం అమల్లోకి రానుంది. దీంతో ఇప్పటివరకు బార్లు లేని ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున కొత్తగా బార్లు ఏర్పాటు కానున్నాయి. బార్లు లేని పురపాలక సంస్థలు, నగర పంచాయితీల్లోనూ బార్లు ఏర్పాటు కానున్నాయి.


ప్రజలతో మద్యం తాగించి వచ్చే ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చెయ్యడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటి? ఎవరి డబ్బుతో ఎవర్ని బాగు చేస్తున్నారు? నిజంగా ప్రజలు అటువంటి సంక్షేమ పథకాలను కోరుకొంటున్నారా? మీ అర కొర సంక్షేమ పథకాల అమలుకు మందు బాబులే దిక్కా? రాజ్యాంగంలోని 47వ అధికరణ ప్రకారం ప్రజల జీవన ప్రమాణాలు పెంచాల్సిన ప్రభుత్వం, విలువలతో కూడిన సమాజాన్ని రూపొందించాల్సిన ప్రభుత్వం ఈ విధంగా ఆదాయం పెంచుకోవడానికి బార్లు బార్లా తెరవడానికి బరితెగించడం సిగ్గు చేటు. ఏ ప్రభుత్వం అయినా పారిశ్రామికాభివృద్ధి ద్వారా, వ్యవసాయాభివృద్ధి ద్వారా, ఇతర ఆదాయ మార్గాలద్వారా ఆదాయాన్ని పెంచి పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. మద్యం ద్వారా పచ్చని సంసారాలను, ప్రజల ఆరోగ్యాలను గుల్ల చెయ్యడం ఎటువంటి సంక్షేమమో జగన్ సమాధానం చెప్పాలి.


సంక్షేమానికి ఖర్చు చేసే మొత్తం కన్నా మద్యంపై వచ్చే ఆదాయమే ఎక్కువగా కనిపిస్తోంది. మద్యం ఆదాయాన్ని రూ.14వేలకోట్లనుండి రూ.25 వేలకోట్లకు పెంచారు. మద్యం ఆదాయాన్ని చూపించి ఏపీ బేవరెజస్ కార్పొరేషన్ ద్వారా అప్పు చేస్తుంది. ఇప్పటికే రూ.8,500కోట్ల ఋణం తీసుకొన్న కార్పొరేషన్, మళ్ళీ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ చేసి త్వరలో మరో 25 వేల కోట్ల ఋణాన్ని పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అప్పులు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో మద్యం ఆదాయంతో భారీ అప్పులు చెయ్యడానికి తెగబడుతోంది జగన్ ప్రభుత్వం. అంతేకాదు మద్యం తయారీ అధికార పార్టీ నాయకులకు కాసులు కురిపిస్తోంది. అధికార పార్టీవారికి చెందిన డిస్టిల్లరీలు, వారీ మెప్పు పొందిన కంపెనీల బ్రాండ్లే భారీగా సొమ్ము చేసుకొంటున్నాయి.


మద్యపానంతో ఇబ్బంది పడుతున్న నా అక్కచెల్లెళ్ల కన్నీళ్లు తుడుస్తానని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ అవసరం తీరగానే మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. అంతే కాదు దేశంలో ఎక్కడా లేని కల్తీ బ్రాండ్లు అమ్మడమే కాక, మద్యం అమ్మకాలపై టార్గెట్లు పెట్టి మరీ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. మద్యపాన నిషేదం అమలు దేవుడెరుగు, ఊరూవాడా వైసీపీ కార్యకర్తలు బెల్టు షాపులు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నా పట్టించుకొనే నాథుడే లేడు. జగన్ ధనదాహానికి పచ్చని కుటుంబాలు నాశనం అవుతున్నాయి. మహిళల తాళిబొట్లు తెంచుతూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. 


దశలవారీ మద్యనిషేధం అంటూ జగన్ చేసిన హామీని ఉల్లంఘించినందుకు మహిళా లోకమంతా సంఘటితమై ప్రభుత్వంపై దండెత్తాల్సిన అవసరం ఉంది. మాట తప్పను, మడమ తిప్పను అని తడవకోసారి తీర్మానాలు చేసే జగన్ మద్యం ఆదాయంతో అక్కచెల్లెళ్లకు మేలు చెయ్యడం ప్రతిపక్షానికి అసలు ఇష్టం లేదని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. ఆ విధంగా మద్యం ద్వారానే అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తున్నానని చెప్పకనే చెప్పారు.

వంగలపూడి అనిత

టీడీపీ మహిళా అధ్యక్షురాలు

Updated Date - 2022-08-04T06:35:19+05:30 IST