అంగీకరించాకే భూముల్లో అడుగు పెట్టండి

ABN , First Publish Date - 2021-09-14T05:17:26+05:30 IST

రైతులతో చర్చలు జరిపి వారి అంగీకారం తీసుకున్న తరువాతే పోలవరం ఎడమ కాలువ సర్వేకు అధికారులు పొలాల్లోకి అడుగు పెట్టాలని రైతు సంఘం నాయకులు స్పష్టంచేశారు.

అంగీకరించాకే భూముల్లో అడుగు పెట్టండి
దబ్బిరాజుపేట వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు

  పోలవరం కాలువ సర్వేపై రైతుల ఆందోళన

వేపాడ, సెప్టెంబరు 13 : రైతులతో చర్చలు జరిపి వారి అంగీకారం తీసుకున్న తరువాతే పోలవరం ఎడమ కాలువ సర్వేకు అధికారులు పొలాల్లోకి అడుగు పెట్టాలని రైతు సంఘం నాయకులు స్పష్టంచేశారు. మండలంలోని దబ్బిరాజుపేట మూడు రోడ్ల జంక్షన్‌ వద్ద రైతు సంఘం జిల్లా కార్యదర్శి చల్లా జగన్‌ ఆధ్వర్యంలో సోమవారం రైతులు నిరసన తెలిపారు. కాలువ నిర్మాణం కోసం చేపట్టిన సర్వేపై అభ్యంతరం తెలిపారు. పలువురు రైతులు మాట్లాడు తూ పంట భూముల్లో సర్వే చేపట్టడంపై ముందు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గ్రామంలో కనీసం దండోరా ద్వారా తెలియపర్చకపోవడం సరికాదని మండిపడ్డారు. సుజల స్రవంతి పథకానికి ఎవరూ వ్యతిరేకం కాదని, బతుకులు పోతున్న రైతుల పరిస్థితి కూడా అధికారులు, పాలకులు అర్థం చేసుకోవాలని చల్లా జగన్‌ కోరారు. అవకాశం ఉన్న ప్రాంతాల్లో కాలువ నిర్మాణ డిజైన్‌ మార్చాలని, మిగిలిన ప్రాంతాల్లో 2013 చట్టం నిబంధనలతో భూమి సేకరించాలని లేదా భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భూ సేకరణ అధికారులు వచ్చి రైతులతో చర్చించి రైతుల ఆమోదం తీసుకు న్నాకే ఇతర సేకరణ పనులు చేపట్టాలని అంతవరకు ఏ ఒక్కరూ పచ్చని పొలాల్లోకి అడుగుపెట్ట నిచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఆందోళనలో దబ్బిరాజు పేట, కరకవలస, జాకేరు, గుడివాడ, ఆకులసీతంపేట గ్రామాల రైతులు ఏడువాక రామకృష్ణ, గణపతి పాల్గొన్నారు.

 

 

Updated Date - 2021-09-14T05:17:26+05:30 IST