రాజ్యాధికారం దిశగా అడుగులు పడాలి

ABN , First Publish Date - 2021-01-25T03:11:23+05:30 IST

రాజ్యాధికారం దిశగా దళిత బహుజనుల అడుగులు శరవేగంగా పడాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

రాజ్యాధికారం దిశగా అడుగులు పడాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

పాలమూరు, జనవరి 24: రాజ్యాధికారం దిశగా దళిత బహుజనుల అడుగులు శరవేగంగా పడాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. దేశంలో నేటికీ నిచ్చెనమెట్ల వ్యవస్థ రాజ్యమేలుతోందని చెప్పారు. జిల్లా కేంద్రంలో అరుంధతి ఉద్యోగ బంధు సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన అరుంధతి భవన్‌ను మంత్రి ఆదివారం మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ నరసింహులు,  ఎంపీ పి.రాములు, ఎమ్మెల్సీ కూరుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎ.అబ్రహాం, అధ్యక్షుడు డా.రాంమ్మోహన్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ స్వయానా తమ ఊరిలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అగ్రవర్ణాలతో ఘర్షణ పడాల్సి వచ్చిందని గుర్తు చేశారు. తన బాల్యమంతా దళితుల సహవాసంలోనే సాగిందన్నారు. పొలిటికల్‌ పవర్‌ ఈజ్‌ మాస్టర్‌ కీ అన్న అంబేడ్కర్‌ మహాశయుడి నినాదానికి ఇప్పటికి పరిపూర్ణత చేకూరలేదన్నారు. అరుంధతి భవన్‌తోపాటు ఈ వారంలోపు వేయి గజాల్లో మరోభవన నిర్మాణానికి ఏనుగొండ డబుల్‌ బెడ్‌ రూం నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతంలో స్థలం కేటాయిస్తామని, నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. మహాత్మా జ్యోతిబాపూలే అధ్యయనం ప్రకారం నాగరికత వికాసపు తొలినాళ్లల్లో ఒక కుటుంబంలో 50 నుంచి వంద మంది ఉండే వారని, ఆ కుటుంబం కోసం ఒక్కో వ్యక్తి ఒక్కో వృత్తిని ఎంపిక చేసుకునే వారని, అక్కడి నుంచే వర్ణ వ్యవస్థ ఏర్పడిందని అన్నారు. మనువాదపు కుట్రల వల్లే క్షూద్రులు అతి క్షూద్రులుగా, శ్రామిక వర్గాలను బానిసలుగా చిత్రీకరించారని అన్నారు. ప్రతి ఒక్కరు కష్టపడి చదివి ఉన్నత స్థితికి చేరుకుని దళిత బహుజన సమాజానికి తోడ్పాటు అందించాలన్నారు. సమావేశంలో డా.విజయకాంత్‌, రాయికంటి రాందాసు, ఆశపోగు రాములు, జె.హన్మంతు, ఎల్‌.రాములు, గాలి యాదయ్య, యం.నరసింహులు, మాస్టర్‌ వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-25T03:11:23+05:30 IST