ఆయిల్‌ పామ్‌కు అడుగులు!

ABN , First Publish Date - 2021-10-13T05:01:44+05:30 IST

ఆయిల్‌ పామ్‌ సాగుకు వికారాబాద్‌ జిల్లా ఎంపికైంది. సాగు కోసం ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటి వరకు 25 జిల్లాలను ఎంపిక చేయగా, తాజాగా వికారాబాద్‌ జిల్లాలోనూ ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.

ఆయిల్‌ పామ్‌కు అడుగులు!

  • వికారాబాద్‌ జిల్లాలో 30 వేల ఎకరాల సాగు లక్ష్యం
  • అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
  • వచ్చే ఏడాది నుంచి సాగుకు సన్నాహాలు 
  • ప్రణాళిక రూపకల్పనలో ఉద్యాన శాఖ నిమగ్నం

ఆయిల్‌ పామ్‌ సాగుకు వికారాబాద్‌ జిల్లా ఎంపికైంది. సాగు కోసం ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటి వరకు 25 జిల్లాలను ఎంపిక చేయగా, తాజాగా వికారాబాద్‌ జిల్లాలోనూ ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. పుష్కలంగా నీటి వసతి కలిగి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఆర్జించే పంటల్లో ఒకటైన ఆయిల్‌ పామ్‌ సాగు పట్ల  రైతులు కూడా ఆసక్తి  చూపుతున్నారు.

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి) జిల్లా రైతులు కూడా ఆయిల్‌ పామ్‌ సాగు పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు.జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగు కొత్త కావడంతో ఉద్యాన శాఖ అధికారుల ప్రోత్సాహాన్ని వారు ఆశిస్తున్నారు. నీటి వసతి పుష్కలంగా ఉండే ప్రాంతాలు ఆయిల్‌ పామ్‌ సాగునీటి ఎంతో అనుకూలంగా ఉంటాయి. అయిల్‌ పామ్‌ సాగు చేస్తే చీడ పీడలు, పురుగులు, క్రిమికీటకాల బెడద చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ పంటపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. పంట సాగు ప్రారంభించిన తరువాత నాలుగైదు సంవత్సరాలు కష్టపడితే ఆ తరువాత ఎక్కువ శ్రమించకుండానే ఫలితం పొందే అవకాశం ఉంటుంది. అతితక్కువ ఖర్చుతో పండే ఈ పంట గాలివాన వీచినా ఎలాంటి నష్టం వాటిల్లదు. చీడలు, పురుగుల బెడద తక్కువగా ఉంటుంది. ఎకరానికి 10 టన్నులకు తక్కువ కాకుండా దిగుబడి వస్తుంది. ఖర్చులుపోనూఎకరాకు లక్ష రూపాయలకు పైగానే ఆదాయం పొందడానికి అవకాశం ఉంది. జిల్లాలో ఏయే మండలాలు ఆయిల్‌ పామ్‌ సాగుకుఅనుకూలంగా ఉన్నాయనేది గుర్తించే పనిలో నిమగ్నమైన ఉద్యాన శాఖ అధికారులు వచ్చే ఏడాది నుంచి ఆయిల్‌ పామ్‌ సాగు ప్రారంభించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రయత్యామ్నాయ పంటల సాగువైపు దృష్టి మరల్చేలా చర్యలు చేపడుతున్న ఈ సమయంలోనే ఆయిల్‌ పామ్‌ సాగుకు జిల్లాను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం విశేషం. జిల్లాలో తొలి విడతగా 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ సాగు చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లు రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ కమిషనర్‌ వెంకట్‌రాంరెడ్డి ఆంధ్రజ్యోతితో చెప్పారు.  

రైతుల్లో పెరుగుతున్న ఆసక్తి..

జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగు ప్రారంభించేందుకు ఆసక్తి కనబరుస్తున్న రైతులను ప్రోత్సహించాలని ఇటీవల జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో కొందరు సభ్యులు ఉద్యాన శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగు పట్ల రైతుల్లో ఉన్న ఆసక్తి గురించి వివరించి జిల్లాలో ఈ సాగును ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇటీవల జిల్లా ఉద్యాన శాఖ అధికారులు ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్‌ దృష్టికి తీసుకు వెళ్లారు.. ఈ సందర్భంగా జడ్పీ సమావేశంలో ఆయిల్‌పామ్‌ సాగు గురించి సభ్యులు ప్రస్తావించిన విషయం కూడా ఆయన దృష్టికి వచ్చారు.  మన వద్ద వంటనూనె వినియోగం అధికంగా ఉంటున్న నేపథ్యంలో విదేశాల నుంచి పామాయిల్‌ గింజలను దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. వంటనూనెకు ఉపయోగపడే పంటలను పండించే దిశగా రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  వివిధ ప్రోత్సహకాలు అందజేస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆయిల్‌ పామ్‌సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించడంతో పాటు అటవీ శాఖ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఆయిల్‌ పామ్‌ మొక్కల నర్సరీలు కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షలఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నే పథ్యంలో ముందుకు వచ్చే రైతులకు సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిసింది. జిల్లాలో ఏయే మండలాలు ఆయిల్‌ పామ్‌ సాగుకు అనుకూలంగా ఉన్నాయనేది గుర్తించేందుకు ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి  సమావేశమై చర్చించనున్నట్లు సమాచారం. ఒకటి, రెండు నెలల్లో జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగుకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

Updated Date - 2021-10-13T05:01:44+05:30 IST