
- వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం
- అన్ని పాఠశాలల్లో బోధన
- జిల్లాలో 510 పాఠశాలల్లో 47,770 మంది విద్యార్థులు
- ఇప్పటికే 359 స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం
- ఉపాధ్యాయులకు శిక్షణ
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో రోజురోజుకు ఆంగ్ల మాధ్యమంపై ఆసక్తి పెరుగుతోంది. ఇంగ్లీష్ బోధించే పాఠశాలల్లో పిల్లలు చేరుతుండడం, ఉన్నత విద్యకు ఆంగ్ల మాధ్యమం పునాదిగా మారుతుండడంతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశపెట్టే దిశగా ప్రణాళిక రూపొందించింది. ప్రభుత్వం నిర్ణయం మేరకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన జరగనుంది. ఇందుకోసం జిల్లాలో ఉపాధ్యాయులకు ఆంగ్లబోధనలో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొమ్మిది వారాలపాటు శిక్షణ అందించనున్నారు. మొదటి వారం ఆఫ్‌లైన్‌లో తరువాత ఆన్లైన్లో శిక్షణ ఉంటుంది. అజీమ్ప్రేమ్జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ శిక్షణను అందిస్తున్నారు. ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా శిక్షణలో భాగస్వామ్యం అవుతున్నారు. జిల్లాలో 510 పాఠశాలల్లో 2014 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో ఎస్జీటీలకు 10 కేంద్రాలను శిక్షణకు ఏర్పాటు చేశారు. 931 మంది శిక్షణ పొందనున్నారు. మొదటి బ్యాచ్ ఈ నెల 25 వరకు పూర్తి చేశారు. 395 మంది శిక్షణ పొందారు. 2వ బ్యాచ్‌కి మార్చి 28 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. 60 మంది రిసోర్స్ పర్సన్లను నియమించారు. ప్రతీ కేంద్రానికి ముగ్గురితోపాటు మరో ముగ్గురికి అదనంగా శిక్షణ అందించనున్నారు. స్కూల్ అసిస్టెంట్లకు నాలుగు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 610 మంది ఉపాధ్యాయులకు మార్చి 28 నుంచి శిక్షణ ప్రారంభిస్తారు. తొమ్మిది వారాల శిక్షణలో ఈ విద్యాసంవత్సరం నాలుగు వారాలు వచ్చే విద్యాసంవత్సరంలో ఐదు వారాలు శిక్షణ ఇవ్వనున్నారు. మొదటి వారం ఆఫ్‌లైన్‌లో తర్వాత ఆన్లైన్లో శిక్షణ అందిస్తారు. ప్రతీ కేంద్రంలో రెండు బ్యాచ్‌లుగా శిక్షణ ఉంటుంది. శిక్షణ రాబోయే విద్యాసంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి దోహదపడనుంది.
ఇప్పటికే 359 పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన
జిల్లాలోని 510 పాఠశాలలు ఉండగా 359 పాఠశాలల్లో తల్లిదండ్రుల విజ్ఞప్తులు, ప్రభుత్వ అనుమతితో ఇంగ్లీష్ బోధనను ప్రవేశ పెటారు. 510 పాఠశాలల్లో 47,770 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంగ్లీష్ బోధన ప్రవేశ పెట్టడం, రానున్న రోజుల్లో ఆంగ్ల బోధన కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 5,894 మంది విద్యార్థుల సంఖ్య పెరిగింది. జిల్లాలో 359 ఇంగ్లీష్ బోధన పాఠశాలల్లో 33,940 మంది విద్యార్థులు ఇంగ్లీష్ బోధన పొందుతున్నారు. మరో వైపు పాఠశాలలను ‘మన ఊరు-మన బడి, మన బస్తీ’లో భాగంగా అన్ని సౌకర్యాలు కల్పించడానికి చర్యలు చేపట్టారు. మొదటి విడతలో 172 పాఠశాలల్లో పూర్తిగా అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. దీనికి తోడు ఆంగ్ల బోధన కూడా అందుబాటులోకి రానుండడంతో విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన లేకపోవడంతోనే ఎంత భారమైన మధ్యతరగతి, పేద కుటుంబాల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. అన్ని సర్కారు బడుల్లో ఇంగ్లీష్ బోధన ప్రారంభమవుతుండడం పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఊరటను ఇవ్వనుంది.
శిక్షణ ఉపయోగపడుతుంది
- దుమాల రామ్‌నాథ్‌రెడ్డి, ఎస్జీటీ
ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి శిక్షణ ఉపయోగపడుతుంది. తొమ్మిది వారాలపాటు కొనసాగే ఈ శిక్షణతో ఉపాధ్యాయుల్లో ఆంగ్లభాషా నైపుణ్యం పెరుగుతుంది. దీంతో విద్యార్థులకు చక్కగా బోధించగలుగుతారు. శిక్షణను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రభుత్వం కనీస వసతులు మాత్రం కల్పించలేదు.
ఆంగ్లబోధనలో నైపుణం పెంపొందుతుంది
- లాలా శ్రీనివాస్, ఎస్జీటీ
ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ శిక్షణతో ఆంగ్లం బోధించడంలో నైపుణ్యం పెంపొందుతుంది. విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో బోధించడానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ శిక్షణ కేంద్రాల్లో ఉపాధ్యాయులకు కనీస వసతులు కల్పించలేదు.