‘కర్ర’ రైతు కన్నీరు!

Jun 15 2021 @ 03:37AM

సుబాబుల్‌ రైతుకు దక్కని ‘మద్దతు’

టన్నుకు 5 వేలు ఇప్పిస్తామని జగన్‌ హామీ

నీటి మూటగా ఎన్నికల వాగ్దానం 

2018 నాటి కనీస ధర కూడా లేదు 

అప్పట్లో టన్నుకు రూ.4,200 చెల్లింపు

ప్రస్తుతం సగమే.. రైతన్నలకు నష్టం

‘2018’ ధరలైనా ఇప్పించాలని వినతి 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘అందరు రైతుల్లాగానే సుబాబుల్‌ రైతులనూ ఆదుకుంటాం. సుబాబుల్‌, జామాయిల్‌, సర్వి, యూకలిప్టస్‌ ఉత్పత్తుల(కర్ర)కు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న రైతులకు మద్దతు ధర కల్పిస్తాం. సుబాబుల్‌ టన్నుకు రూ.5 వేలు ఇప్పిస్తాం’.. రెండేళ్ల క్రితం ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ ఇది. అధికారంలోకి వచ్చాక సుబాబుల్‌ రైతుల సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీని కూడా వేశారు. కానీ రైతులకు మాత్రం కనీస మద్దతు ధర ఇప్పించలేకపోయారు. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 31 ప్రకారం సుబాబుల్‌ టన్ను రూ.4,200, జామాయిల్‌ రూ.4,400 కనీస మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయించలేదు. పైగా ధర, డిమాండ్‌ లేని ఈ పంటల కన్నా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని మంత్రుల కమిటీ సలహా ఇచ్చింది. వ్యవసా య, మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఈ మాటే చెబుతున్నారు. దీంతో కృష్ణా, గుం టూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 3 లక్షల ఎకరాల్లో సాగులో ఉన్న తోటల్ని తొలగించలేక.. తొలగిస్తే నీటి వసతి లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలు పండుతాయన్న గ్యారెంటీ లేక రైతుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది. కనీస ధర లేక, వచ్చిన కాడికి అమ్ముకోలేక నష్టపోతున్నారు. జీవో 31 ప్రకారం అయినా కొనుగోలు చేయించాలని రైతులు వేడుకుంటున్నారు. అయినా వ్యాపారులు కానీ, పాలకులు కానీ తమ గోడు పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో సగం ధరే పలుకుతోంది. 


దళారుల ‘ధర’హాసం

ప్రస్తుతం సుబాబుల్‌, జామాయిల్‌, సర్వి రైతుల సమస్య జఠిలంగా మారింది. జీవో 31 ప్రకారం గత ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు 2019 మార్చి  వరకు మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో పేపర్‌ మిల్లుల వ్యాపారులు కొనుగోలు చేశారు. 2019లో ప్రభుత్వం మారాక మార్కెట్‌ కమిటీల ద్వారా కొనే విధానానికి స్వస్తి పలికారు. గతంలో మాదిరిగా ధరలు చెల్లించకుండా వ్యాపారులు చేతులెత్తేశారు. ప్రభుత్వ ఆజమాయిషీ లేకపోవడంతో మధ్య దళారీలు సిండికేట్‌లుగా ఏర్పడి, మద్దతు ధరలో సగం కూడా ఇవ్వడం లేదు. గట్టిగా మాట్లాడితే.. ఇష్టమైతే ఇవ్వండి లేకపోతే వద్దంటున్నారు. దీంతో గత్యంతరం లేక టన్ను రూ.1600లకు అమ్మాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఇందులోనే కర్ర కట్టింగ్‌, లోడింగ్‌, రవాణా చార్జీలు రైతులే భరించాల్సి వస్తోందని, దీంతో టన్నుకు రూ.వెయ్యి కూడా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ట్రాక్టర్లలో లోడింగ్‌ చేసి కాటాల దగ్గరకు తెచ్చిన తర్వాత రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని, దీంతో ట్రాక్టర్ల బాడుగ, వెయింటింగ్‌ చార్జీలు భరించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. 


రైతు పక్షాన ఆందోళన: తెలుగు రైతు

సుబాబుల్‌, జామాయిల్‌ కర్రకు మద్దతు ధర ఇవ్వకుంటే రైతుల పక్షాన ఆందోళన చేపడుతామని బాపట్ల పార్లమెంట్‌ తెలుగు రైతు అధ్యక్షుడు కొండ్రగుంట వెంకయ్య హెచ్చరించారు. జీవో 31 ప్రకారం మార్కెట్‌ కమిటీల పర్యవేక్షణలో కొనుగోళ్లు జరపాలని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకుని, సుబాబుల్‌ రైతులను ఆదుకోవాలని కోరారు. లేకపోతే రైతు సంఘాలతో కలసి పోరాటం చేస్తామని ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. 


నందిగామలో జగన్‌ హామీ   

2019 ఎన్నికల సమయంలో నందిగామ సభలో జగన్‌ సుబాబుల్‌ సమస్యలపై ప్రస్తావించారు. రైతులను ఆదుకుంటామని, టన్ను కు రూ.5 వేలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు రైతులకు ప్రయోజనం కలిగే చర్యలేవీ తీసుకోలేదని, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం లేదని రైతులు వాపోతున్నారు. సుబాబుల్‌ రైతులను ఈ-క్రా్‌పలోకి తెచ్చి, సీఎం యాప్‌లో రైతులు, వ్యాపారులు, పేపరు మిల్లులను రిజిస్టర్‌ చేసి, రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేస్తామని మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రకటించారు. కానీ ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చకపోవడంతో రైతులు దగా పడుతున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.