ఎర్రవల్లిలో ఇంకా సమస్యలా?

ABN , First Publish Date - 2022-01-24T04:50:57+05:30 IST

మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్‌ ఫాంహౌ్‌సలో ఆదివారం సాయంత్రం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. తాను ప్రాతినథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఏ గ్రామంలో కూడా సమస్యలు ఉండకూడదని, ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నదన్నారు.

ఎర్రవల్లిలో ఇంకా సమస్యలా?

  దత్తత గ్రామాల సమస్యలపై అవాక్కయిన సీఎం కేసీఆర్‌

 సమస్యలపై నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్సీకి సూచన

 గజ్వేల్‌ నియోజకవర్గ అభివృద్ధి సమీక్షలో సీఎం అసహనం


జగదేవ్‌పూర్‌, జనవరి 23: ‘నా దత్తత గ్రామంలో ఇంకా సమస్యలున్నాయా. ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నా ఎందుకు వస్తున్నాయి. నా దృష్టికి ఎందుకు తేవడం లేదు. ఎందుకు వెంటనే పరిష్కరించడం లేదు? ఒక్క దత్తత గ్రామమే కాదు వ్యవసాయ క్షేత్ర పరిసర గ్రామాలతో పాటు గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనూ సమస్యలు ఉండడానికి వీల్లేదు. అన్ని గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏం కావాలో చెప్పండి. వెంటనే నిధులు కేటాయించి అభివృద్ధి పనులను పూర్తిచేద్దాం’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్‌ ఫాంహౌ్‌సలో ఆదివారం సాయంత్రం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. తాను ప్రాతినథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఏ గ్రామంలో కూడా సమస్యలు ఉండకూడదని,  ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నదన్నారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకొచ్చి, పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల వారీగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ హన్మంతరావు, గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డిలను సీఎం ఆదేశించారు. పనులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపితే వెంటనే నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. కాగా నియోజకవర్గంలో పెండింగ్‌ పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నేతల మధ్య సమన్వయ లోపం ఉన్నట్లుగా స్పష్టమవుతుందని, నాయకులంతా సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అన్ని గ్రామాల్లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, మురుగు కాలువల నిర్మాణ పనులు చేపట్టాలని, అర్హులందరకీ డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇవ్వాలని సూచించారు. కాగా త్వరలో నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నాయకులతో సమీక్ష నిర్వహిస్తానని సీఎం కేసీఆర్‌ చెప్పారు. 


ఎర్రవల్లిలోని సమస్యలను పరిష్కరించాలి 


తన దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో నెలకొన్న సమస్యలకు పరిష్కార చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ వెంకట్రామారెడ్డికి సీఎం కేసీఆర్‌ సూచించారు. ఎర్రవల్లిలో సమస్యల పరిష్కారంలో స్థానిక నాయకులు చొరవ చూపకపోవడం పట్ల వీడీసీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రవల్లిలో నిర్మించిన చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లతో పరిసర ప్రాంతాల రైతుల పొలాలు ముంపునకు గురై నష్టపోతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. చెరువుల నుంచి వాటర్‌ అవుట్‌ ఫ్లో పోయే విధంగా రీ డిజైన్‌ చేసి ఇరిగేషన్‌ శాఖ ద్వారా పనులు చేపట్టాలని సూచించారు. అలాగే 325సర్వే నంబర్‌లో భూ సమస్య పరిష్కరించి అర్హులైన రైతులకు భూ పంపిణీ చేయాలని సూచించారు. ఎర్రవల్లి, వరదరాజ్‌పూర్‌, శివార్‌వెంకటాపూర్‌ గ్రామాల్లో మురుగు కాలువలు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను చేపట్టాలని సూచించారు. సమీక్షలో సీఎం ఓఎ్‌సడీ స్మితాసబర్వాల్‌, కలెక్టర్‌ హన్మంతరావు, ఎమ్మెల్సీలు వెంకట్రామారెడ్డి, యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, సర్పంచ్‌లు  భాగ్యబిక్షపతి, అప్పాల ప్రవీన్‌, మంజులనర్సింలు, వీడీసీ చైర్మన్‌ కిష్టారెడ్డి, సభ్యులు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2022-01-24T04:50:57+05:30 IST