ఇంకా ఎదురుచూపులే!

ABN , First Publish Date - 2021-07-23T05:01:20+05:30 IST

ఇంకా ఎదురుచూపులే!

ఇంకా ఎదురుచూపులే!
దిగులు చెందుతున్న అంబటి నీలకంఠం కుటుంబ సభ్యులు

- నాలుగు రోజులైనా.. చెన్నై నుంచి తీరానికి చేరుకోని మత్స్యకారులు

- ఆందోళనలో బాధిత కుటుంబాలు

సోంపేట/రూరల్‌, జూలై 22 : చెన్నై నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన జిల్లా మత్స్యకారుల ఆచూకీ తెలిసినా... వారు ఇంతవరకూ తీరానికి చేరకపోవడంతో బాధిత కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. చెన్నైలోని కాశిమెడ్‌ హార్బర్‌ నుంచి ఈ నెల 7న 11 మంది మత్స్యకారులు (ఐన్‌డీటీఎన్‌ 02 ఎంఎం 106) నంబరు గల ఇంజిన్‌ బోటుపై వేటకు బయలుదేరారు. మత్స్యకారుల బృందంలో సోంపేట మండలం ఇస్కలపాలెం గ్రామానికి చెందిన అంబటి నీలకంఠం, మోస సూర్యనారాయణ, కోడ సోమేష్‌, కోడ జగన్‌లతో పాటు రామయ్యపట్నానికి చెందిన నిట్ట జోగారావు, కవిటి మండలం పెద్ద కర్రివానిపాలెం గ్రామానికి చెందిన పొట్టి కామేష్‌, కర్రి బాబయ్యలు ఉన్నారు. ఈ నెల 16 వరకూ వారి యోగక్షేమాలు హార్బర్‌కు బాగానే అందాయి. చెన్నై తీరానికి 250 కిలోమీటర్లు దాటిన తరువాత వీరి సమాచారం నిలిచిపోయింది. బోటు ఆచూకీ లేకపోయింది. ఈ విషయం ఈ నెల 19న వెలుగులోకి వచ్చింది. చెన్నై హార్బర్‌ నుంచి కుటుంబ సభ్యులకు వర్తమానం అందింది. దీంతో బాధితుల గ్రామాల్లో ఒకటే టెన్షన్‌ నెలకొంది. ఒకవైపు మంత్రి సీదిరి అప్పలరాజు, మరోవైపు ఎంపీ రామ్మోహన్‌నాయుడు కేంద్ర మంత్రులతో పాటు తమిళనాడు అధికారులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో అదేరోజు అర్ధరాత్రి బోటు ఆచూకీని కోస్టుగార్డులు కనుగొన్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నాలుగు రోజులు గడుస్తున్నా, మత్స్యకారులు తీరానికి చేరకపోవడం, వారు నేరుగా ఫోన్‌లో మాట్లాడకపోవడంతో బాధిత కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. బోటు ఆచూకీ తెలిసినా... తమ వారు తీరానికి చేరుకోకపోవడంతో అయోమయం నెలకొంది. బుధవారం అర్ధరాత్రికి చేరుకుంటారని అధికారులు ప్రకటించినా, గురువారం అర్ధరాత్రి వరకూ ఎటువంటి సమాచారం అందలేదు. మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని జిల్లా అధికారులు కూడా ప్రకటించలేదు. దీంతో వారంతా ఎక్కడున్నారు? ఎప్పుడు తీరానికి చేరుకుంటారో తెలియక కుటుంబ సభ్యులు దిగులు చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం త్వరితగతిన స్పందించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

 

Updated Date - 2021-07-23T05:01:20+05:30 IST