రిమ్స్‌లో కలకలం

Jun 15 2021 @ 01:02AM

జిల్లా పెద్దాసుపత్రికి నిర్లక్ష్యపు రోగం 

కాలం చెల్లిన మందుల వినియోగం

ఆందోళనలో రోగులు.. వారి బంధువులు

వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న ఆసుపత్రి

ఆదిలాబాద్‌, జూన్‌14 (ఆంధ్రజ్యోతి): అది పేరుకే పెద్దాసుపత్రి.. కానీ అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపి స్తోంది. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో వైద్యం సంగతి దేవుడెరుగు కానీ, లేని రోగాలను అంటగడుతున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో రోగులకు సరైన వైద్యం అందక అల్లాడుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు గత ప్రభుత్వం 2008లో 750 పడకలతో రిమ్స్‌ ఆసుపత్రి సేవలను ప్రారంభించింది. ఆది నుంచి రిమ్స్‌ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఎంతో మంది కలెక్టర్లు, రిమ్స్‌ ఆసుపత్రి ప్రక్షాళన దిశగా అనేక ప్రయత్నాలు చేసినా తీరు మారినట్లు కనిపించడమే లేదు. కొంత కాలం క్రితం కొందరు సీనియర్‌ వైద్యులు పెత్తనం చలాయించేందుకు ఏకంగా రిమ్స్‌ డైరెక్టర్‌నే టార్గెట్‌ చేస్తూ నిరసనలు చేపట్టి పాలనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలాగే ఇటీవల కరోనా వైరస్‌ కట్టడిపై ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న జిల్లా వైద్య ఆరోగ్య అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం రసాభాసాగా మారింది. ఈ సమావేశంలో రిమ్స్‌ డైరెక్టర్‌ బలిరాంనాయక్‌, ఎమ్మెల్యే జోగు రామన్నల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది మరిచి పోక ముందే తాజాగా కాలం చెల్లిన ఇంజక్షన్లను వాడుతూ రోగులకు ఇస్తున్నారం టూ వారి బంధువులు ఆందోళనకు దిగడం జిల్లాలో కలకలం రేపుతోంది. 2019లో కేటాయించిన యాంటి బయోటిక్‌ ఇంజక్షన్లను రెండేళ్ల తర్వాత రోగులకు ఇవ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిమ్స్‌ డైరెక్టర్‌ తీరునచ్చకనే కొందరు వైద్యులు ఇలాం టి కుట్రలకు దిగుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.  ఈ ఆసుపత్రికి నిత్యం ఉమ్మడి జిల్లాతో పాటు మహా రాష్ట్ర నుంచి వందలాది మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. ప్రభుత్వ వైద్యాన్ని గాడిలో పెట్టాలని ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ముందు నుంచి డిమాండ్‌ చేస్తూ వస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోక పోవడంతోనే ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

రెండేళ్ల క్రితమే ఇంజక్షన్ల కేటాయింపు..

రిమ్స్‌లో కాలం చెల్లిన యాంటిబయోటిక్‌ ఇంజక్షన్లను 2019 మేలోనే కేటాయించినట్లు అధికా రులు గుర్తించారు. అవి ఆరు నెలలకే సరిపోయే విధంగా అప్పట్లో కేటాయింపులు చేశారు. 2021 జనవరితో వాటి కాల పరిమితి ముగిసిపోయింది. అయినా ఆరు నెలల తర్వాత ఇంజక్షన్లను ఉపయో గించడం వైద్యుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం సరిపడా అవే ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నా.. కాలం చెల్లిన ఇంజక్షన్లనే వైద్య సిబ్బంది ఉప యోగించడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వివిధ వ్యాధులతో ఇబ్బందులు పడుతూ రిమ్స్‌ ఆసుపత్రి మూడో అంతస్తు మేల్‌ వార్డులో చికిత్స పొందుతున్న దాదాపు 40 మందికి ఈ ఇంజక్షన్లను వేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని కోలిపుర కాలనికి చెందిన గౌరీశంకర్‌కు ఆదివారం రాత్రి ఎక్స్‌పైరి ఇంజక్షన్‌ ఇచ్చే క్రమంలో ఆయన బంధువులు గుర్తుపట్టి అడ్డుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో మిగతా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు, వారి బంధువులు అప్రమత్త మయ్యారు. కాలం చెల్లిన ఇంజక్షన్ల విషయం రిమ్స్‌ డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా.. సకాలంలో స్పందించ లేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.

కుట్రలో భాగమేనా..?

రిమ్స్‌లో కొన్నేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న కొంత మంది సీనియర్‌ వైద్యులకు రిమ్స్‌ డైరెక్టర్‌తో తరచూ విభేదాలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల క్రిత మే తమ ప్రమోషన్లను డైరెక్టర్‌ అడ్డుకుంటున్నారనే ఆగ్రహంతో సిబ్బందిని ఉసిగొలిపి ధర్నాలు, నిరస న లు చేయించి ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం జరి గిందన్న చర్చ జరుగుతోంది. కొంత మంది వైద్యులకు రాజకీయ అండదండలు ఉండడంతో ఏళ్ల తరబడి రిమ్స్‌లోనే విధులు నిర్వర్తిస్తూ బయట నుంచి ఎవరి నీ రాకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు లేకపో లేదు. డైరెక్టర్‌ ఒంటెద్దు పోకడలు నచ్చని వారంతా ఒక వర్గంగా ఏర్పడి ఆయనతో విభేదిస్తున్నట్లు తెలు స్తోంది. ఈ క్రమంలోనే కాలంచెల్లిన ఇంజక్షన్ల వ్యవహా రం కలకలం రేపడం అనుమానాలకు తావిస్తోంది. 

కమిటీతో కాలయాపనే..

రిమ్స్‌లో కలకలం రేపిన ఎక్స్‌పైరి ఇంజక్షన్లపై కమిటీని వేసి కాలయాపన చేసే అవకాశం కనిపి స్తోంది. రోగుల ప్రాణాలతో చలగాటమాడిన వైద్య సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం అధికారుల తీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. గతంలో జరిగిన అనేక సంఘటనలపై కమిటీలు వేయడం, కాలయాపన చేయడం రిమ్స్‌ అధికారులకు అలవా టుగానే మారింది. కమిటీలో రిమ్స్‌ వైద్యులు కాకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కమిటీ వేస్తేనే కొంత మేరకు వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. అలాగే వార్డులో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులతో పాటు సిబ్బందిని బాధ్యులను చేస్తూ మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉంది.

Follow Us on: