100 నుంచి 59, 000కు...

ABN , First Publish Date - 2022-08-14T09:13:02+05:30 IST

ఒకప్పుడు స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ ముంబై వంటి పెద్ద నగరాలకే పరిమితం. ఇప్పుడు పల్లెలకూ విస్తరించింది.

100 నుంచి 59, 000కు...

 స్టాక్‌ మార్కెట్‌లో సెన్సెక్స్‌ ప్రయాణమిది.. 

ఆటు పోట్లున్నా  సూచీలు ముందుకే..

ఒకప్పుడు స్టాక్‌ మార్కెట్‌  ట్రేడింగ్‌ ముంబై వంటి పెద్ద  నగరాలకే పరిమితం. ఇప్పుడు పల్లెలకూ  విస్తరించింది. బ్యాంకు ఖాతాలో నగదు, చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు ఎక్కడి నుంచైనా షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో ట్రేడింగ్‌ చేయవచ్చు. ఈ 75 ఏళ్ల స్వాత్రంత్య     ప్రస్థానంలో మన స్టాక్‌ మార్కెట్‌లో చోటు      చేసుకున్న  కీలక పరిణామాలు మీకోసం.. 


స్వాతంత్ర్యానికి ముందే మన స్టాక్‌ మార్కెట్‌ చరిత్ర ప్రారంభమైంది. 1855 నుంచే మన దేశంలో షేర్‌ మార్కెట్‌ లావాదేవీలు జరిగేవి. 1875లో బీఎ్‌సఈ ఏర్పాటుతో  ఇది మరింత పెరిగింది. నిజానికి ఆసియాలో మన బీఎ్‌సఈనే  మొట్టమొదటి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. స్వాతంత్య్రం తర్వాత 1957 నాటి సెక్యూరిటీస్‌  కాంట్రాక్ట్‌ రెగ్యులేషన్‌ చట్టం కింద, ప్రభుత్వం బీఎ్‌సఈని గుర్తించింది. అప్పటి నుంచి మన క్యాపిటల్‌ మార్కెట్‌లో అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. 


1963   యూటీఐ ఏర్పాటు 

మ్యూచువల్‌ ఫండ్స్‌(ఎంఎఫ్‌) పెట్టుబడులకు 1963లోనే  బీజం పడింది. ఆ సంవత్సరమే  ప్రభుత్వం యూటీఐని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ దేశంలో ఎంఎ్‌ఫల సంస్కృతికి ఎంతో దోహదం చేసింది. 1987లో ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఏర్పడే వరకు ఎంఎ్‌ఫల రంగంలో యూటీఐదే హవా. ప్రైవేటు ఎంఎ్‌ఫల రాకతో యూటీఐ ప్రభ మసకబారగా, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ మాత్రం ఇంకా ప్రముఖ ఎంఎ్‌ఫగా కొనసాగుతోంది. 


1977    రిలయన్స్‌ ఐపీఓ

స్వతంత్ర భారతంలో షేర్‌ మార్కెట్‌ పెట్టుబడుల సంస్కృతిని జనంలోకి తీసుకు వెళ్లిన వ్యక్తి ధీరూభాయ్‌ అంబానీ. ఆయన  నాయకత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1977 నవంబరులో రిలయన్స్‌ టెక్స్‌టైల్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ పేరుతో  ఐపీఓ ద్వారా 28 లక్షల షేర్లు జారీ చేసింది. ఈ ఐపీఓ ఆ రోజుల్లోనే ఏడు రెట్లు ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌ అయింది. రూ.10 ముఖ విలువతో అప్పట్లో జారీ చేసిన రిలయన్స్‌ షేర్లు ఇపుడు రూ.2,855 వద్ద ట్రేడవుతున్నాయి. మార్కెట్‌ విలువ పరంగా  ప్రస్తుతం దేశంలో ఇదే అతి పెద్ద కంపెనీ.


1986 సెన్సెక్స్‌కు రూపకల్పన 

మన స్టాక్‌ మార్కెట్‌కు ప్రామాణికంగా భావించే సెన్సెక్స్‌ 1986లో ప్రారంభమైంది. 1978-79 నాటి మార్కెట్‌ క్యాప్‌ ఆధారంగా 30 కంపెనీల షేర్లతో సెన్సెక్స్‌ను రూపొందించారు. 100 పాయింట్లతో ప్రారంభమైన ఈ సూచీ.. ప్రస్తుతం 59,000 ఎగువ స్థాయిలో ట్రేడవుతోంది. గత ఏడాదిలోనే 60,000 మైలురాయిని దాటినప్పటికీ, ఈ ఏడాది మార్కెట్లో ప్రతికూల పవనాలు వీయడంతో సూచీ మళ్లీ కిందికి జారుకుంది. మార్కెట్‌ క్యాప్‌ను బట్టి సెన్సెక్స్‌ జాబితాలోని కంపెనీలు మారిపోతుంటాయి. మార్కెట్‌ విలువ పరంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, హెచ్‌యూఎల్‌ ప్రస్తుతం అతి పెద్ద కంపెనీలు.


1992  హర్షద్‌ మెహతా స్కామ్‌

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలతో మన స్టాక్‌ మార్కెట్‌ పట్టపగ్గాలు లేకుండా దూసుకు పోయింది. బ్రోకర్ల మాయాజాలమూ ఇందుకు ప్రధాన కారణం. ఇందులో హర్షద్‌ మెహతాది ప్రధాన పాత్ర. బ్యాంకుల సొమ్ముతో హర్షద్‌ చేసిన ఈ కుంభకోణం 1992లో బయట పడింది. దాంతో సెన్సెక్స్‌ కుప్పకూలింది. నెల రోజుల వరకు బీఎ్‌సఈ మూతపడింది. దీన్ని బట్టి ఈ కుంభకోణం మార్కెట్‌ను ఎంతగా దెబ్బతీసిందో ఊహించుకోవచ్చు. మన దేశ ఆర్థిక రంగంలో బయటపడిన తొలి అతి పెద్ద ఆర్థిక కుంభకోణం కూడా ఇదే. 


1992 ఎన్‌ఎ్‌సఈ ఏర్పాటు 

హర్షద్‌ మెహతా కుంభకోణం బయట పడిన ఏడాదే ఎన్‌ఎ్‌సఈ ఏర్పడింది. ఆధునిక టెక్నాలజీ హంగులతో ఏర్పడిన ఎన్‌ఎ్‌సఈ దెబ్బకు బీఎ్‌సఈ ప్రాభవం మసకబారిందనే చెప్పాలి. ముంబైకే పరిమితమైన బీఎ్‌సఈ తర్వాత బీఎ్‌సఈ బోల్ట్‌ పేరుతో దేశంలోని ఇతర నగరాలకూ విస్తరించింది. అయినప్పటికీ  ట్రేడింగ్‌ వాల్యూమ్స్‌, వాల్యూ పరంగా     ఎన్‌ఎ్‌సఈతో పోటీపడలేక పోతోంది. 


1993  సెబీ ఏర్పాటు

హర్షద్‌ మెహతా కుంభకోణంతో స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులంటేనే మదుపరులు భయపడి పోయారు. దీంతో ఈ మార్కెట్‌ను క్రమంగా అభివృద్ధి చేయడంతో పాటు, అక్రమార్కులపై వేటు వేసేందుకు ప్రభుత్వం 1993లో సెబీని ఏర్పాటు చేసింది. దీంతో అక్రమాలకు చాలా వరకు చెక్‌పడింది.  దేశంలో క్యాపిటల్‌ మార్కెట్‌ క్రమంగా  గాడిలో పడింది. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్‌ ఈ స్థాయిలో ఉందంటే అందుకు ఎప్పటికప్పుడు సెబీ తీసుకున్న చర్యలే కారణమని చెప్పాలి. 


1992 ఎఫ్‌పీఐల ఎంట్రీ

ఆర్థిక సంస్కరణలతో మన స్టాక్‌ మార్కెట్‌ విదేశీ సంస్థాగత మదుపరుల(ఎ్‌ఫఐఐ)కూ ఆకర్షణీయంగా మారింది. దీంతో మన మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు 1992లో ఎఫ్‌ఐఐలనూ అనుమతించారు. ప్రస్తుతం మన మార్కెట్‌ను ఈ సంస్థలే శాసిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. సూచీల వృద్ధిలోనూ వీటిది కీలకపాత్ర.


2022  ఎల్‌ఐసీ ఐపీఓ 

భారత బీమా దిగ్గజం, దేశంలో అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్‌ ఎల్‌ఐసీ ఈ ఏడాదిలో ఐపీఓకు వచ్చింది. దాదాపు రూ.21,000 కోట్లు సమీకరించిన ఎల్‌ఐసీ ఐపీఓ మన మార్కెట్‌ చరిత్రలో అతి పెద్ద ఇష్యూ. ఎంతో ఊరించిన ఈ ఇష్యూ లిస్టింగ్‌ తర్వాత మాత్రం మదుపరులను తీవ్రంగా నిరాశ పరిచింది. 

Updated Date - 2022-08-14T09:13:02+05:30 IST