Advertisement

‘స్టాక్‌హోం’ లక్ష్యాలు, కొవిడ్ పాఠాలు

Mar 5 2021 @ 01:08AM

మట్టివాసన

మనధరిత్రిని హరితధాత్రిగా కాపాడుకోవడం ఎలా? పర్యావరణ వ్యవస్థలకు వాటిల్లుతున్న ప్రమాదాల గురించి చర్చించేందుకు ఒక తరం క్రితం (1972లో) ప్రపంచ నాయకులు స్టాక్‌హోంలో సమావేశమయ్యారు. వాయు, జలవనరుల కాలుష్యం, అడవుల నరికివేత వంటి స్థానిక పర్యావరణ సంబంధిత సమస్యల గురించే ఆనాడు వారి ఆందోళన. వాతావరణ మార్పు, ఓజోన్ పొర పగిలిపోవడం మొదలైన అంశాలు ప్రస్తావనకే రాని రోజులవి. కాలుష్యకోరల నుంచి సహజ వనరులను కాపాడడం గురించి మాత్రమే 1972లో చర్చించడం జరిగింది. 


మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ఆ ప్రప్రథమ అంతర్జాతీయ సదస్సునకు అనిల్ అగర్వాల్ (సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సంస్థాపక–-డైరెక్టర్) హాజరయ్యారు. స్టాక్‌హోంలో కాలుష్య కాసారాలుగా ఉన్న సరస్సుల గురించి ఆయన తరచు ప్రస్తావిస్తుండేవారు. ఇప్పుడు అవి స్వచ్ఛ సరోవరాలు. దీన్ని బట్టి గత యాభై సంవత్సరాలలో పర్యావరణ పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని మీరు వాదించవచ్చు. వాస్తవానికి ఏమీ మారలేదు. పర్యావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడడమనేది ఇప్పటికీ ఒక అత్యవసర కర్తవ్యంగా ఉంది. పలు దేశాలు తమ సహజ నైసర్గిక పరిస్థితులను స్వచ్ఛంగా ఉంచుకోవడంలో సఫలమయిఉండవచ్చు కానీ ప్రపంచ వాతావరణ మండలంలో కమ్ముకుపోతున్న హానికారక ఉద్గారాలకు కారణమవుతూనే ఉన్నాయి. ఫలితంగానే వాతావరణ మార్పు, మనం నియంత్రించలేకపోతోన్న సమస్యగా పరిణమించింది. 


2022 సంవత్సరంలో స్టాక్‌హోమ్ పర్యావరణ సదస్సు 50వ వార్షికోత్సవం జరగనున్నది. స్టాక్‌హోమ్ + 50కు చేరువలో ఉన్న మనం, అంతకు ముందుకంటే మరింతగా పేదరికం, అసమానతలలో కునారిల్లుతున్న ప్రపంచాన్ని చూస్తున్నాం. వాతావరణ మార్పు దుష్ఫలితాలు పేదల ముంగిటకు మాత్రమే కాదు, సంపన్నుల ముంగిటకు కూడా చేరాయి. మానవాళి ఉమ్మడి భవిష్యత్తును భద్రం చేసుకునేందుకు మనం ప్రయాణిస్తున్న మార్గం మారాలి, మన ఆలోచనాధోరణులు మారాలి. ఈ దృష్ట్యా వచ్చే ఏడాది స్టాక్‌హోం సదస్సు 50వ వార్షికోత్సవం భిన్నమైనది. సమస్య గురించి కేవలం ఘోషించడం కాకుండా దాన్ని అధిగమించేందుకు అనుసరించాల్సిన మార్గాన్ని చూపవలసిన సందర్భమది. సరిగ్గా ఈ కారణంగానే వినియోగం, ఉత్పత్తి గురించి కూడా మనం చర్చించవలసి ఉంది. ఈ అంశాన్ని ఇంకెంత మాత్రం పక్కన పెట్టలేము.


ఓజోన్ పొర రక్షణ, వాతావరణ మార్పు, జీవవైవిధ్యం, ఎడారుల విస్తరణ, ప్రమాదకర వ్యర్థాలు మొదలైన సమస్యలపై అంతర్జాతీయ ఒప్పందాలు అన్నీ మనం పరస్పరాధారిత ప్రపంచంలో నివశిస్తున్నామని, ప్రస్తావిత సమస్యలను సకల దేశాలు పరస్పర సహకారంతో మాత్రమే అధిగమించగలవన్న సత్యాన్ని స్పష్టం చేశాయి. ఇదే కాలంలో మనం స్వేచ్ఛావాణిజ్య, -ఆర్థికవ్యవస్థ ప్రపంచీకరణ ఒప్పందంపై కూడా సంతకం చేశాం. అయితే ఈ పర్యావరణ, ప్రపంచీకరణ చట్టాలు పరస్పరం ప్రతి చర్యలుగా ఎలా పని చేస్తాయో మనం అర్థం చేసుకోలేదు. ఫలితంగా శ్రమ శక్తిని, పర్యావరణ విలువను పరిగణనలోకి తీసుకోని ఆర్థికాభివృద్ధి నమూనా ప్రాతిపదికన మన వినియోగం, ఉత్పత్తి కార్యకలాపాలు సాగుతున్నాయి. శ్రమశక్తి, పర్యావరణ పరమైన అనుమతులు ఎక్కడ చౌకగా లభిస్తాయో అక్కడ ఉత్పత్తి కార్యకలాపాలు సాగిస్తున్నాం. సరుకులు మరింతగా చౌకగా అందుబాటులోకి వచ్చేందుకు వీలుగా ఉత్పత్తిని ఇతోధికంగా పెంచివేస్తున్నాం. ఇదే అభివృద్ధి నమూనాను అన్ని దేశాలూ అనుసరించడాన్ని అనివార్యం చేశాం. సరుకులను సాధ్యమైనంత చౌకగా ఉత్పత్తి చేసే ప్రపంచ ఫ్యాక్టరీలో భాగస్వాములు అయ్యేందుకు ప్రపంచ దేశాలన్నీ ఆరాటపడుతున్నాయి. ఇందుకు పర్యావరణపరంగా భారీ మూల్యం చెల్లిస్తున్నాం.  


కొవిడ్–19 ఉపద్రవంతో అంతా తారుమారయింది. ఈ విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న ప్రపంచం ఉత్పత్తి, వినియోగంలో భిన్నరీతుల్లో ముందుకు సాగడానికి ఉద్యుక్తమయింది. కొవిడ్–19 మనకు నేర్పిన పాఠాలను మనం విస్మరించకూడదు. అవి: (1) మనం శ్రమశక్తి విలువను అర్థం చేసుకున్నాం. ముఖ్యంగా వలస కార్మికుల ప్రాధాన్యాన్ని గుర్తించాం. పారిశ్రామికరంగానికి వారు ఎంత అవసరమో తెలుసుకున్నాం. కొవిడ్ విపత్తులో వలస కార్మికులు తమ స్వస్థలాలకు- మన దేశంలోనే కాదు, ప్రపంచమంతటా- ఎలా వెళ్ళిపోయారో మనం చూశాం. ఉత్పత్తి కార్యకలాపాలపై ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపిందో కూడా చూశాం. వలస కార్మికులను తిరిగి పనికి తీసుకువచ్చేందుకు పారిశ్రామికరంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మెరుగైన వేతనభత్యాలను ఇచ్చేందుకు, మెరుగైన పని పరిస్థితులను కల్పించేందుకు సుముఖంగా ఉన్నది. ఈ చర్యల మూలంగా ఉత్పత్తి వ్యయాలు తప్పక పెరుగుతాయి. (2) స్వచ్ఛమైన నీలి ఆకాశం, ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల విలువను గుర్తించాం. లాక్‌డౌన్ మూలంగా కాలుష్య తీవ్రత తగ్గింది. అది మనకు ఎంత ప్రయోజనకరమో గుర్తించాం. పర్యావరణ భద్రతకు చేసే మదుపులు సైతం ఉత్పత్తి వ్యయాలను పెంచుతాయి. (3) భూ-వ్యవసాయ-జల వనరుల వ్యవస్థల మెరుగుదలకు చేసే మదుపుల వల్ల సమకూరే ప్రయోజనాలను మనం గుర్తించాం. స్వగ్రామాలకు తరలిపోయిన వలసకార్మికులు తమ జీవనాధారాలను పునర్నిర్మించుకుంటున్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకోగల భవిష్యత్తును నిర్మించుకోవడం చాలా అవసరం, చాలా ముఖ్యం కూడా. సుస్థిర ఆహార ఉత్పత్తి వ్యవస్థలను అభివృద్ధిపరచుకోవాలి. (4) ఇప్పుడు చాలా మంది ఉద్యోగస్థులు తమ ఉద్యోగ విధులను ఇంటి నుంచే నిర్వర్తిస్తున్నారు. పని ప్రదేశానికి సుదూరంగా ఉన్న స్థలాల నుంచి పని చేయాలని కోరుకుంటున్నారు. పరస్పర సంబంధాలు, సహకారాన్ని పెంపొందించుకోవడం ద్వారా మన ప్రపంచాన్ని మరింత సమున్నతం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది మన వినియోగం తీరుతెన్నులను సైతం మార్చివేస్తుంది. (5) ఆర్థిక వనరుల కొరతతో ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి. వ్యయాలు మరింతగా చేయవలసి ఉన్నందున, వనరులను ఏమాత్రం వ్యర్థం చేయకూడదు. ఇవన్నీ మన వినియోగ అలవాట్లను, ఉత్పత్తి పద్ధతులను మార్చివేస్తాయి. వాతావరణ మార్పు విషమప్రభావాలతో మానవాళి అస్తిత్వమే సంక్షోభంలో పడింది. ఈ విపత్కర తరుణంలో వచ్చే ఏడాది స్టాక్‌హోం సదస్సు 50వ వార్షికోత్సవం జరగనున్నది. సమస్య తీవ్రత ఏమిటో మనకు బాగా తెలుసు. ఇంకా సమస్య గురించి మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. విలువైన సమయాన్ని వ్యర్థం చేయడమే. పటిష్ఠ కార్యాచరణకు ఉపక్రమించడమే ముఖ్యం.

సునీతా నారాయణ్

‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’

డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.