స్టాప్‌ అదానీ

ABN , First Publish Date - 2022-06-17T08:51:35+05:30 IST

శ్రీలంకేయులు మళ్లీ భగ్గుమన్నారు..! మొన్నటిదాకా ‘గోగో గొటబయా(గొటబయ రాజీనామా చేయాలి)’ అంటూ నినదించిన శ్రీలంక పౌరులు తాజాగా గురువారం ‘స్టాప్‌ అదానీ’ పేరుతో ఆందోళనలు చేశారు.

స్టాప్‌ అదానీ

శ్రీలంకలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం


మన్నార్‌లో అదానీకి పవన విద్యుత్తు ప్రాజెక్టు

ప్రధాని మోదీ ఒత్తిడితోనే రాజపక్స ఇచ్చారు

వెల్లడించిన శ్రీలంక సీఈబీ చైర్మన్‌

ఆ తర్వాత పదవి నుంచి తొలగింపు

కొలంబోలో భారీ నిరసన ప్రదర్శనలు

ఇది నిరుత్సాహపరిచే ఆరోపణ: అదానీ గ్రూప్‌

మోదీ విదేశీయాత్రలన్నీ అదానీ, అంబానీల కోసమే!

సోషల్‌మీడియాలో చిట్టా విప్పిన నెటిజన్లు

ప్రధాని మోదీ నోరు మెదపరెందుకు: కేటీఆర్‌


కొలంబో/న్యూఢిల్లీ, జూన్‌ 16: లంకేయులు మళ్లీ భగ్గుమన్నారు..! మొన్నటిదాకా ‘గోగో గొటబయా(గొటబయ రాజీనామా చేయాలి)’ అంటూ నినదించిన శ్రీలంక పౌరులు తాజాగా గురువారం ‘స్టాప్‌ అదానీ’ పేరుతో ఆందోళనలు చేశారు. శ్రీలంక ఆర్థిక రాజధాని కొలొంబోలో వేల సంఖ్యలో జనాలు రోడ్డుపైకి వచ్చి.. అదానీ ప్రాజెక్టు డీల్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల సిలోన్‌ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌(సీఈబీ) చైర్మన్‌ ఎం.ఎం.సి.ఫెర్డినాండో పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన ఓ వివరణకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో పౌరులు బుధ, గురువారాల్లో నిరసనలకు దిగారు. ఇటీవల పార్లమెంటరీ కమిటీ ముందు ఆయన మన్నార్‌ పవన విద్యుత్తు ప్రాజెక్టుపై వివరణ ఇచ్చారు. ‘‘ఎలాంటి టెండర్లు లేకుండా ఈ ప్రాజెక్టును అదానీ గ్రూప్‌నకు ఇవ్వాలని దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స చెప్పారు. ఆయనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఒత్తిడి ఉందట. ఇదే విషయాన్ని నాకు ఆర్థిక శాఖ మంత్రి చెప్పి.. 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఆ ప్రాజెక్టును అదానీకి ఇప్పించేలా చేశారు’’ అని స్పష్టం చేశారు. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనికి తోడు.. ఈ విషయాన్ని వెల్లడించిన ఫెర్డినాండో ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. తన ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. అయితే.. అవినీతిపై నిజాలు చెప్పిన అధికారిని ప్రభుత్వం తొలగించిందంటూ పౌరులు మండిపడ్డారు. ‘స్టాప్‌ అదానీ’ అంటూ విద్యార్థులు, కార్మికులు, మహిళలు.. ఇలా అన్నివర్గాలు రోడ్డెక్కాయి. ‘‘మేము పర్యావరణ హిత విద్యుత్తు వ్యవస్థకు వ్యతిరేకం కాదు. కానీ, శ్రీలంక సర్కారు అవినీతికి వ్యతిరేకం.


అదానీకి ప్రాజెక్టును అప్పగించడంలో ఎలాంటి పారదర్శకత లేదు. టెండర్లు, బిడ్డింగ్‌ ప్రక్రియ లేకుండానే అదానీకి కట్టబెట్టారు’’ అని ఓ పవన విద్యుత్తు కంపెనీలో ప్రొక్యూర్‌మెంట్‌ ఇంజనీరుగా పనిచేసే నూజీ హమీమ్‌ అన్నారు. ఆయన కూడా కొలంబోలో జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. 2.2 కోట్ల మంది పౌరులను చీకటిలో పెట్టి.. అక్రమ మార్గాల్లో, అనుమానాస్పద డీల్స్‌తో అదానీ గ్రూప్‌ ఈ ప్రాజెక్టును చేజిక్కించుకుందని ఆర్థిక శాస్త్ర విద్యార్థిని అంజనీ వాందురాగాలా ఆరోపించారు. అయితే.. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘మమ్మల్ని ఈ ఆరోపణ నిరుత్సాహపరిచింది. నిజానిజాలేంటో ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వానికి వివరించాం.


ఈ ఆరోపణలతో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు’’ అని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా, శ్రీలంక సీఈబీ అధికారి వీడియో వైరల్‌ అవ్వడంతో.. భారత్‌లోనూ నెటిజన్లు మోదీ సర్కారుపై భగ్గుమన్నారు. ‘మోదీమ్‌స్టరిజైన్‌’, ‘మోదీశ్రీలంకస్కామ్‌’, ‘స్టెప్‌డౌన్‌మోదీ’ హ్యాష్‌ట్యాగ్‌లతో ట్విటర్‌లో పెద్దఎత్తున ప్రచారం ప్రారంభించారు. దీనికి వేల మంది మద్దతునిస్తూ.. రీట్వీట్లు, కామెంట్లు చేస్తున్నారు. ఈ అంశాన్ని సుప్రీం సుమోటోగా స్వీకరించి, విచారణ జర పాలని కోరారు. మోదీ విదేశీ పర్యటలను.. ఆ తర్వాత అంబానీ లేదా అదానీ గ్రూప్‌లకు దక్కిన ఆయా దేశా ల ప్రాజెక్టులను బయటపెడుతూ విమర్శలు చేశారు. 


2016 సెప్టెంబరు 23న ప్రధాని ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లారు. అక్కడ రఫేల్‌ డీల్‌ కుదుర్చుకున్నారు. అం బానీ గ్రూప్‌నకు ఆ బాధ్యతలు అప్పగించాలని ని ర్ణయించారు. మోదీ ఒత్తిడితోనే.. ఆఫ్‌సెట్‌ కాంట్రాక్టర్‌గా అంబానీ గ్రూప్‌ను అనుమతించామని అప్ప టి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాన్సీస్‌ ఒలాంద్‌ చెప్పారు

2014 నవంబరులో మోదీ ఆస్ట్రేలియాలో పర్యటించారు. ఆ తర్వాత 200 కిలోమీటర్ల నారోగేజ్‌ రైల్వే ప్రాజెక్టు అదానీ గ్రూప్‌నకు దక్కింది. 

2015 నవంబరులో ప్రధాని మోదీ మలేసియాలో పర్యటించారు. అదానీ గ్రూప్‌ 2017లో అక్కడి పోర్ట్‌ ప్రాజెక్టును చేజిక్కించుకుంది.


ప్రధాని మౌనమేల?: కేటీఆర్‌

హైదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): శ్రీలంకలో అదానీకి పవన విద్యుత్తు ప్రాజెక్టును అప్పగించడం వెనక ఆ దేశ అధికారి చేసిన ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారంటూ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్‌లో మోదీ తీరును దుయ్యబట్టారు. ‘‘ఈడీ, సీబీఐ, ఐటీ వర్గాల ద్వారా ప్రతిపక్షాలను వేధిస్తున్నారు. మరోవైపు ప్రధాని మోదీపై శ్రీలంక సీనియర్‌ ఉన్నతాధికారి బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఈ విషయంపై మోదీ లేదా అదానీ ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు మౌనం వహిస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. ఈ అంశంపై మీడియా కూడా మౌనం వహిస్తోందని విమర్శించారు. ‘మోదీమ్‌స్టరిజైన్‌’ హ్యాష్‌ట్యాగ్‌కు మద్దతిస్తూ కామెంట్లు, రీట్వీట్లు చేశారు. 

Updated Date - 2022-06-17T08:51:35+05:30 IST