బోగస్‌ ఓట్లకు అడ్డుకట్ట!

ABN , First Publish Date - 2022-06-26T09:33:32+05:30 IST

ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన దిశగా మరో అడుగు ముందుకు పడింది.

బోగస్‌ ఓట్లకు అడ్డుకట్ట!

ఓటరు జాబితా-ఆధార్‌ అనుసంధానంతో ఎన్నికల మోసాలకు చెక్‌

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఎప్పటినుంచో ఎన్నికల సంఘం కోరుతున్నట్లుగా ఓటర్ల జాబితాను, ఆధార్‌ నంబర్‌ను అనుసంధానించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయడంతో ప్రస్తుత ఎన్నికల వ్యవస్థకు అతిపెద్ద జాడ్యంగా మారిన బోగస్‌ ఓట్లకు చెక్‌ పెట్టే అవకాశం కలగనుంది. ప్రస్తుతం ఏ నియోజకవర్గంలో చూసినా 10-20 శాతం ఓట్లు స్థానికంగా ఉండని వారివే ఉంటున్నాయి. వలసలు సర్వసాధారణంగా మారిన ఆధునిక సమాజంలో ఇది సహజం. వలసల్లో భాగంగా మరోచోట స్థిరపడిన వారంతా అక్కడే ఓటర్లుగా నమోదు చేసుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ నాయకులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఓటర్ల జాబితాను సవరించినపుడల్లా ఇలాంటి స్థానికంగా లేని ఓటర్లను జాబితాల నుంచి తొలగిస్తారు. కానీ, రాజకీయ పార్టీల బలం ఇలాంటి ఓట్లే. దాంతో ఓటర్ల జాబితా సవరణ తూతూ మంత్రంగా సాగుతోంది. ఆ పేర్లు దశాబ్దాలు గడిచినా అలాగే ఉండిపోతున్నాయి.


ఎన్నికలు జరిగినపుడల్లా రాజకీయ పార్టీలు బయటి నుంచి వ్యక్తులను తీసుకొచ్చి, వారికి బోగస్‌ ఓటర్‌ ఐడీ కార్డులను ఏర్పాటు చేసి, భారీ సంఖ్యలో దొంగ ఓట్లు వేయించుకుంటున్నాయి. ముఖ్యంగా ఉప ఎన్నికల సమయంలో ఎన్నికలు జరగని నియోజకవర్గాల నుంచి బోగస్‌ ఓటర్లను బస్సుల్లో తరలించి మరీ ఓట్లు వేయించుకుంటున్నారు. వైరిపక్షం బూత్‌ ఏజెంట్లు అప్రమత్తంగా లేకపోయినా, అధికారులు ఉదాసీనంగా ఉన్నా అధికార పక్షానికి ఎన్నికలు ఏకపక్షంగా మారిపోతున్నాయి. ఇటీవల తిరుపతి లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇదే జరిగింది. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా బస్సుల్లో బోగస్‌ ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించారు. ఓటర్ల జాబితాకు ఆధార్‌ను అనుసంధానం చేస్తే ఇలాంటి పరిస్థితికి చాలా వరకు తెరపడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఊళ్లు వదిలి ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు రెండు చోట్ల కాకుండా ఏదో ఒకచోట ఓటును ఉంచుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఇప్పటికే చట్ట ప్రకారం కొత్తచోట ఓటరుగా నమోదు చేసుకుంటే మొదట ఓటున్న చోట రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకోని వారిని గుర్తించి ఏరివేసే మార్గం ఇప్పటిదాకా లేకపోవడం వల్లే చాలా నియోజకవర్గాల్లో భారీ ఎత్తున బోగస్‌ ఓట్లకు అవకాశం ఏర్పడుతోంది. ఓటరు జాబితాను ఆధార్‌తో అనుసంధానించి, ఇతర ప్రాంతాల్లో ఓటు హక్కున్న వారి ఓట్లను ఏరేస్తే జాబితాలు పక్కాగా తయారవుతాయి. అప్పుడు బోగస్‌ ఓట్లు వేసే ముఠాలకు అవకాశాలు తగ్గిపోతాయి. బోగస్‌ ఓట్ల ఏరివేత లక్ష్యంగా ఓటర్ల జాబితాను, ఆధార్‌ను అనుసంధానిస్తున్నప్పటికీ ఈ క్రమంలో ప్రభుత్వం వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాటించాల్సి ఉంటుంది.


రాజకీయ వర్గాల్లో వణుకు

తెలుగు రాష్ట్రాల్లో పల్లెల నుంచి నగరాలకు వలస వచ్చిన వారు.. పంచాయతీతోపాటు నగరంలోనూ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకుంటున్నారు. వేర్వేరు సమయాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వారే కాకుండా ఇతర రాష్ట్రాల వారు సైతం ఉపాధి నిమిత్తం ఇక్కడకు వచ్చి ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకుంటున్నారు. తమ సొంతూరులో ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించుకోవడం లేదు. ఫలితంగా ఓటు హక్కు దుర్వినియోగం అవుతోంది. దీనికి పరిష్కారంగా కేంద్రం ఆధార్‌ అస్త్రం ప్రయోగించడం రాజకీయ వర్గాల్లో వణుకు పుట్టిస్తోంది. చాలామంది రాజకీయ నాయకులు కూడా ఎక్కడో ఉన్న బంధువులను వందల సంఖ్యలో ఎన్నికల సమయంలో తప్పుడు చిరునామాలతో ఓటరు జాబితాలో పేర్లను నమోదు చేయిస్తూ బోగస్‌ ఓటర్లతో లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల ఓటింగ్‌లో అవకతవకలను అరికట్టవచ్చని ఎన్నికల సంఘం చాలా కాలంగా చెబుతోంది. ఇది అమలైతే వలస ఓటర్లు తమ ఓటరు కార్డు ఉన్న చోటే ఓటు వేయగలుగుతారు.  


వలస కార్మికులకు లాభం

వలస కార్మికులు తాము పని చేస్తున్నచోట ఓటరుగా నమోదు చేయించుకోవడం ఇక తేలిక కాబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేసే బిహారీ కార్మికుడు ఇక్కడ ఓటు నమోదు చేయించుకోవడం కష్టసాధ్యంగా ఉంది. ఓటర్‌ ఐడీ ఆధార్‌ లింకేజీ రావడంతో ఒక దరఖాస్తుతో తేలిగ్గా బిహార్‌లో ఉన్న ఓటును రద్దు చేయించుకొని హైదరాబాద్‌లో ఓటరుగా నమోదు కావొచ్చు.

  

ఓటర్ల జాబితా మెరుగుపడుతోంది..

1951 నాటి ఎన్నికలతో పోలిస్తే ప్రతి ఎన్నికకూ ఓటర్ల జాబితా మెరుగుపడుతోంది. 1993లో టీఎన్‌ శేషన్‌ ఎన్నికల కమిషనర్‌గా ఉన్నపుడు ఓటరు ఫొటో గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టడంతో ఓటర్ల జాబితా నాణ్యత పెరిగింది. కానీ, ఓటర్ల జాబితాలో పేర్లు పొడిపొడి అక్షరాలతో, తప్పుడు వయసుతో పోలింగ్‌ అధికారులకు పరీక్షలు పెడుతూనే ఉన్నాయి. తాజాగా ఓటర్‌ జాబితాను ఆధార్‌తో అనుసంధానం చేయడంతో పేర్లు, వయసు విషయంలో మరింత కచ్చితత్వం పెరగబోతోంది.


రిగ్గింగ్‌ తగ్గిపోయింది

ఈవీఎంలు ప్రవేశపెట్టడానికి ముందు చాలా నియోజకవర్గాల్లో రిగ్గింగ్‌ తీవ్ర స్థాయిలో జరిగేది. బూత్‌ను స్వాధీనం చేసుకొని అరగంట వ్యవధిలో మొత్తం ఓట్లు వేసుకొనే వాళ్లు. కండబలం ఉన్నవారిదే అధికారం అన్నట్లు ఉండేది. ఈవీఎంలు వచ్చాక బూత్‌ క్యాప్చరింగ్‌ ద్వారా రిగ్గింగ్‌ చేసుకొనే అవకాశం తగ్గిపోయింది. ఇప్పుడు రిగ్గింగ్‌ చేయాలంటే బూత్‌లో ఉన్న వెయ్యి ఓట్లు వేయడానికి కనీసం 4 గంటలపాటు కూర్చోవాల్సి ఉంటుంది. ఈలోగా అదనపు పోలీసు బలగాలు వస్తే అంతే సంగతులు. ఈవీఎంలు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రిగ్గింగ్‌/బూత్‌ క్యాప్చరింగ్‌ కష్టతరంగా మారింది. తర్వాత ఈవీఎంలలో మతలబు చేసి ఫలితాలు మారుస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈవీఎంలకు తోడుగా వీవీప్యాట్‌ యంత్రాలు పెట్టడంతో పోలయిన ఓట్లు, అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ట్యాలీ కావడంతో ఆ అనుమానాలు కూడా చాలా వరకు నివృత్తి అయ్యాయి. ఇప్పుడు ఆధార్‌ అనుసంధానంతో బోగస్‌ ఓట్లకు కూడా తెరపడితే ఎన్నికల ప్రక్రియకు మరింత విశ్వసనీయత చేకూరుతుంది. 


రాజకీయాలకు అతీతంగా..

మారుతున్న కాలాన్ని బట్టి సాంకేతికతను వినియోగించాలి. ఆధార్‌ అనుసంధానం చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. జనాభా నమోదులో కూడా ఆధార్‌ నంబర్‌ లింక్‌ చేయాలని లోక్‌సత్తా చాలా కాలంగా డిమాండ్‌ చేస్తోంది. ఆధార్‌ అనుసంధానంతో దొంగ ఓట్లకు చెక్‌ పడుతుంది. దేశంలో చాలావరకు దొంగ ఆధార్‌ కార్డులున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం దానిపై కూడా దృష్టి పెట్టాలి.

  • - జయప్రకాష్‌ నారాయణ్‌, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు

గోప్యతకు భంగం కలగకూడదు

ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానించాలన్న కేంద్ర నిర్ణయం హర్షించదగ్గదే. ఈ విధానం వల్ల బోగస్‌ ఓట్లు రద్దు చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే వ్యక్తిగత వివరాల గోప్యతకు భంగం కలగకుండా చూడాలి. ఆధార్‌ నంబర్‌ను ఉపయోగించి పలు సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న రోజులివి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పౌరులకు నష్టం కలగకుండా చూడాలి. 

- పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి

Updated Date - 2022-06-26T09:33:32+05:30 IST