దోపిడీకి కళ్లెం

Sep 28 2021 @ 00:57AM

అందరికీ అందుబాటులో ఆధునిక వైద్య పరీక్షలు..!

ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ 

రిమ్స్‌లోని బాధితులకు ఉచితం

బయట నుంచి వచ్చే వారికి  భారీగా తగ్గింపు 

ఒంగోలు (కార్పొరేషన్‌), సెప్టెంబరు 27 : నేడు వైద్యం ఖరీదైపోయింది. ఆసుపత్రికెళితే చాలు ఓపీ నుంచి వైద్యం వరకూ వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అందులో వైద్య పరీక్షలకే అధికంగా అవుతోంది. అదే కరోనా బాధితులకైతే లక్ష దాకా పోయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఒంగోలు రిమ్స్‌లో అందుబాటులోకి వచ్చిన అధునాతన పరీక్షలు ఆ బాధల నుంచి కొంతమేర ఉపశమనం కలిగిస్తున్నాయి. గత నాలుగైదేళ్లుగా ఒంగోలులోని పేదల పెద్దాసుపత్రి అయిన రిమ్స్‌లో సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్‌ లేకపోవడంతో రోగులు ప్రైవేటు ల్యాబ్‌లకు పరుగులు పెట్టాల్సి వచ్చేది. అయితే ఇటీవల రాష్ట్రప్రభుత్వం సర్కారు ఆసుపత్రుల్లో ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా రిమ్స్‌లోనూ యంత్రాలను ఏర్పాటు చేసింది. పెద్దాసుపత్రికి వచ్చే బాధితులకు ఈ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. ఫిల్మ్‌ కోరిన వారి నుంచి అందుకు అయ్యే ఖర్చును వసూలు చేస్తున్నారు. ఇతర ప్రైవేటు వైద్యశాలల డాక్టర్ల సూచనతో తక్కువ ఫీజుతో సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్‌ చేస్తున్నారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఖరీదైన వైద్యపరీక్షలు సగం ధరలకే అందుబాటులోకి వచ్చాయి.  


కరోనా బాధితులకు ఊరట

ఏడాదిన్నరగా జిల్లాలో కొవిడ్‌ కలవరం సృష్టిస్తోంది. బాధితులకు శ్వాస సంబంధిత సమస్యలు అధికంగా ఉండటంతో సీటీస్కాన్‌ తప్పనిసరిగా తీయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇప్పటి వరకు వేలాదిమంది కొవిడ్‌ బాధితులు ప్రైవేటు ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్ల వద్ద పడిగాపులు కాసి, వేలకు వేలు చెల్లించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో రిమ్స్‌లో సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్‌ అందుబాటులోకి రావడం, సగం ధరలకే వాటిని చేస్తుండటం కొంత ఊరటనిస్తోంది. దీనిపై రిమ్స్‌ సూపరింటెండెంట్‌ శ్రీరాములు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రిమ్స్‌లో చికిత్సపొందుతున్న బాధితులకు ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ పూర్తిగా ఉచితమన్నారు.  ఫిల్మ్‌ కావాలనుకునే వారు మాత్రం రూ.200 చెల్లించాల్సి ఉంటుందన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
[email protected]jyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.