ఉక్రెయిన్‌లో కాల్పులు ఆగాలి!

ABN , First Publish Date - 2022-05-04T08:36:27+05:30 IST

ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పులను విరమించాలని, యుద్ధం ఆగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

ఉక్రెయిన్‌లో కాల్పులు ఆగాలి!

చర్చలు, సంప్రదింపులతోనే సమస్యకు పరిష్కారం


పిలుపునిచ్చిన ప్రధాని మోదీ

యుద్ధ విరమణకు పుతిన్‌ను మీరే ఒప్పించాలి

భారత్‌తో జాయింట్‌ డిక్లరేషన్‌లో డెన్మార్క్‌

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి

లేకపోతే చాలా మిస్సవుతారు..

ఇండియా-డెన్మార్క్‌ బిజినెస్‌ ఫోరంలో ప్రధాని

భారతీయులు కర్మభూమి కోసం శ్రమిస్తారు

డెన్మార్క్‌లోని ప్రవాస భారతీయులతో మోదీ

నేడు ఫ్రాన్స్‌లో ప్రధాని పర్యటన

సబ్‌మెరైన్‌ ప్రాజెక్టు నుంచి వైదొలగిన ఫ్రాన్స్‌


కోపెన్‌హెగెన్‌, మే 3: ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పులను విరమించాలని, యుద్ధం ఆగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా సంక్షోభానికి పరిష్కారం కనుక్కోవాలని పిలుపునిచ్చారు. ఐరోపా పర్యటనలో భాగంగా మంగళవారం ప్రధాని మోదీ డెన్మార్క్‌ చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని మెటె ఫ్రెడరిక్సెన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి ఇద్దరూ చర్చించారు. భారత్‌ తన పలుకుబడిని ఉపయోగించి యుద్ధాన్ని విరమించడానికి రష్యాను ఒప్పించాలని డెన్మార్క్‌ ప్రధాని కోరారు. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై ఇరుదేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి. తక్షణమే శత్రుత్వాన్ని విడనాడాలని విజ్ఞప్తిచేశాయి. దీంతోపాటు అనేక ద్వైపాక్షిక అంశాలపై నేతలిద్దరూ చర్చించారు. పవన విద్యుత్‌, షిప్పింగ్‌, కన్సల్టెన్సీ తదితర రంగాల్లో 200పైగా డెన్మార్క్‌ కంపెనీలు ఇప్పటికే భారత్‌లో పనిచేస్తున్నాయని మోదీ తెలిపారు. భారత్‌లో వ్యాపార అనుకూల పరిస్థితులు ఉన్నాయని, డెన్మార్క్‌ కంపెనీలు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. అనంతరం ఇండియా-డెన్మార్క్‌ బిజినెస్‌ ఫోరంను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. భారత్‌లోని మౌలిక సదుపాయాల రంగం, గ్రీన్‌ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టాలని డెన్మార్క్‌కు చెందిన కంపెనీలు, పెన్షన్‌ ఫండ్‌లను ప్రధాని ఆహ్వానించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టని కంపెనీలు వ్యాపారపరంగా చాలా మిస్సవుతాయన్నారు. ఈ సందర్భంగా ఇండియా-డెన్మార్క్‌ జాయింట్‌ స్టేట్‌మెంట్‌ను విడుదల చేశాయి. అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం విషయంలో మద్దతు ఇస్తున్నట్టు డెన్మార్క్‌ ప్రధాని పునరుద్ఘాటించారు. దీనికి బదులుగా 2025-26 ఏడాదికి యూఎన్‌లో నాన్‌-పర్మనెంట్‌ సభ్యత్వం విషయంలో డెన్మార్క్‌కు భారత్‌ మద్దతు ప్రకటించింది. . ఇండో-యూరోపియన్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు త్వరలోనే కొలిక్కి వస్తాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు.


మోదీకి డెన్మార్క్‌లో ఘనస్వాగతం

అంతకుముందు డెన్మార్క్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. కోపెన్‌హెగెన్‌ విమానాశ్రయంలో మోదీకి డెన్మార్క్‌ ప్రధాని స్వాగతం పలికారు. అనేకమంది ప్రవాస భారతీయులు కూడా విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి డెన్మార్క్‌ ప్రధాని స్వయంగా తన అధికారిక నివాసానికి (మ్యారీన్‌బోర్గ్‌) మోదీని తీసుకెళ్లారు. ప్రధాని హోదాలో మోదీ డెన్మార్క్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.


డెన్మార్క్‌కు రావడానికి ముందు... ప్రధాని మోదీ జర్మనీ పర్యటనలో ప్రవాస భారతీయుల స్పందన, ఉత్సాహం చర్చనీయాంశంగా మారాయి. జర్మనీలోని భారతీయులతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు.. ‘2024, మోదీ వన్స్‌మోర్‌’ అంటూ నినదించారు. సమావేశానికి వేదికైన బెర్లిన్‌లోని ఓ థియేటర్‌ ఈ నినాదంతో మార్మోగింది. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. 2014 నాటికి దేశంలో 200-400 స్టార్ట్‌పలు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు వీటి సంఖ్య 68వేలకు చేరిందన్నారు..


మనోళ్లు కర్మభూమి కోసం శ్రమిస్తారు

డెన్మార్క్‌ పర్యటనలో ప్రవాస భారతీయులతో మోదీ సమావేశమయ్యారు. భారతీయులు ఎక్కడికెళ్లినా కర్మభూమి (పనిచేస్తున్న దేశం) కోసం నిజాయతీతో శ్రమిస్తారన్నారు. తమ దేశాల్లోని భారతీయుల విజయాల గురించి ఎంతోమంది దేశాధినేతలు తనతో చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో డెన్మార్క్‌ ప్రధాని ఫ్రెడరిక్సెన్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ‘‘రాజకీయ నాయకుడిని ఎలా ఆహ్వానించాలో మీకు చాలా బాగా తెలుసు. దీని గురించి మా ప్రజలకు చెప్పండి’’ అని భారతీయులను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు.


సబ్‌మెరైన్‌ ప్రాజెక్టు నుంచి ఫ్రాన్స్‌ ఔట్‌

ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బుధవారం ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌తో సమావేశం కానున్నారు. అయితే.. ఇండియన్‌ నేవీ కోసం భారత ప్రభుత్వం ప్రకటించిన సబ్‌మెరైన్లను నిర్మించే ప్రాజెక్టులో తాము పాల్గొనడం లేదని ఫ్రాన్స్‌ నేవీ విభాగం మంగళవారం ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో పేర్కొన్న షరతులు తమకు ఆమోదయోగ్యం కాదని ఫ్రాన్స్‌ నేవీ వెల్లడించింది. సంప్రదాయ పీ-75ఐ సబ్‌మెరైన్లను భారత్‌లోనే నిర్మించే ఉద్దేశంతో కేంద్రం ఈ ప్రాజెక్టును ప్రకటించింది. ప్రధాని మోదీ పర్యటనకు ఒక రోజు ముందు ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగుతున్నట్టు ఫ్రాన్స్‌ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read more