ఉపాధి పనుల్లో నిబంధనలు నిల్‌

ABN , First Publish Date - 2021-05-09T06:03:54+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి పనులు లేని సమయంలో ఉపాధిహామీ పథకం పేదల కడుపు నింపుతోంది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో సైతం ఈ పథకం అండగా ఉంటోంది. అయితే ఉపాధి పనులు చేసే కూలీలు మాస్క్‌లు ధరించాలని, కనీస భౌతికదూరం పాటించాలని అవగాహన కల్పించడంలో క్షేత్రస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ఉపాధి పనుల్లో నిబంధనలు నిల్‌
తిరుమలగిరి గ్రామంలో ఒకే దగ్గర బౌతికదూరం లేకుండా పనులు చేస్తున్న ఉఫాది కూలీలు

మాస్క్‌లు, భౌతికదూరం కరువు


చివ్వెంల, మే 8: గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి పనులు లేని సమయంలో ఉపాధిహామీ పథకం పేదల కడుపు నింపుతోంది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో సైతం ఈ పథకం అండగా ఉంటోంది. అయితే ఉపాధి పనులు చేసే కూలీలు మాస్క్‌లు ధరించాలని, కనీస భౌతికదూరం పాటించాలని అవగాహన కల్పించడంలో క్షేత్రస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జాబ్‌కార్డు ఉన్న వారికి పనులు కల్పిస్తూనే కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాల్సిన పంచాయతీ కార్యదర్శులు కేవలం హాజరు తీసుకొని మధ్యాహ్నం కాగానే ఇళ్లకు వెళ్లిపోతున్నారని ఉపాధి కూలీలు చెబుతున్నారు. ఉపాధి పనుల కారణంగా కూలీలకు కరోనా వ్యాప్తిచెందే ప్రమాదం ఉంది. ఇక మండుటెండలో పనిచేస్తున్న కూలీలకు కనీసం సౌకర్యాలు కల్పించడం లేదు. తాగునీటిని సైతం వారే తెచ్చుకోవాల్సి వస్తోంది. నీడ కోసం కనీసం టెంట్లు కూడా ఏర్పాటు చేయడంలేదు. ఎవరైనా కూలీ గాయపడితే ప్రథమచికిత్స చేసే పరిస్థితి కూడా లేదు. ప్రస్తుతం కరోనా విధులు నిర్వహిస్తున్న ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు వారి పనుల్లో బిజీగా ఉండటంతో ఇటుగా రావడం లేదు.


ఉమ్మడి జిల్లాలో 8.05లక్షల జాబ్‌ కార్డులు

ఉపాధిహామీ పథకం కింద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 8,05,202 జాబ్‌కార్డులు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 23 మండలాలు, 475 పంచాయతీలు ఉండగా, 2,61,000 కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉన్నాయి. 6,06,300 మంది కూలీలు ఉపాధి పనులు చేసేందుకు అర్హులు. నల్లగొండ జిల్లాలో 3,88,974 జాబ్‌కార్డులు ఉండగా, 9,14,421 మంది కూలీలు ఉన్నారు. యాదాద్రి జిల్లాలో 1,55,228 జాబ్‌కార్డులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో జాబ్‌కార్డులు లక్షల్లో ఉండగా, కొవిడ్‌ వ్యాప్తి కారణంగా చాలా మంది పనులకు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు.


నిబంధనలు పాటించడం లేదు:బాష్పంగు సునీల్‌, బండమీది చందుపట్ల

ఉపాధిహామీ పని ప్రాంతాల్లో అధికారులు కొవిడ్‌ నిబందనలు పాటించడం లేదు. కొందరు కూలీలు మాస్క్‌ ధరించడం లేదు. శానిటైజర్లు లేవు. నీడ కోసం టెంట్‌, తాగునీరు,  ఫస్ట్‌ఎయిడ్‌ కిట్లు లేవు. ఏఎన్‌ఎంలు సైతం పనుల ప్రాంతానికి రావడం లేదు. 


మాస్క్‌లు, భౌతికదూరంపై అవగాహన: సుందరి కిరణకుమార్‌, సూర్యాపేట జిల్లా డీఆర్‌డీవో 

ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ఉపాధిహామీ పనులు పేదలకు భరోసాను ఇస్తున్నాయి. కరోనా వ్యాప్తి నేపత్యంలో ఎవరికి వారు అవగాహన పెంచుకోవాలి. ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించాలి. భౌతికదూరం పాటించేలా చూడాలని స్థానిక ఏపీవోలకు, కార్యదర్శులకు సూచించాం. కూలీలకు మరిన్ని వసతులు కల్పిస్తాం.

Updated Date - 2021-05-09T06:03:54+05:30 IST