బోధనకు స్వస్తి.. యాప్‌లతో కుస్తీ

ABN , First Publish Date - 2021-11-02T06:42:07+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నమోదు కష్టాలొచ్చిపడ్డాయి. నిత్యం యాప్‌లతో కుస్తీపడుతూ మగ్గిపోతున్నారు.

బోధనకు స్వస్తి.. యాప్‌లతో కుస్తీ

సగంమందికి రోజంతా దాంతోనే సరి

ప్రభుత్వ విఽధానంపై భగ్గుమంటున్న టీచర్లు 

ఇద్దరు, ముగ్గురున్న చోట ఒకరికి ఆ పనే 

అటకెక్కుతున్న చదువులు 

తొలగించాల్సిందే అంటున్న సంఘాలు

నిరసనకు సిద్ధమవుతున్న వైనం

విద్యాశాఖలో యాప్‌ల గోల ఎక్కువైంది. వాటి నమోదులో ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటలకు పాఠశాలకు వచ్చినప్పటి నుంచి మధ్యాహ్నం 1గంట వరకూ యాప్‌లతోనే కుస్తీపడుతున్నారు. ఈ పనులకే సమయమంతా సరిపోతుండగా ఇక బడిలో పాఠం చెప్పేది ఎప్పుడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృత్తికి సంబంధం లేని బోధనేతర పనులతో సిలబస్‌ ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం హాజరు అప్‌లోడ్‌   దగ్గర నుంచి టాయిలెట్ల పర్యవేక్షణ, మధ్యాహ్న భోజనం, జగనన్న విద్యాకానుక, ఇతర వివరాలు యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఒకరున్న చోట సమయమంతా వీటికే సరిపోతోంది. ఇద్దరు, ముగ్గురు ఉన్న చోట ఒకరికి ఆ పని అప్పజెప్పాల్సిన పరిస్థితి.   సిగ్నల్‌ ఉంటే సరి లేకుంటే మరిన్ని కష్టాలు. ఇక బోధనకు  సమయం ఎక్కడిదని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనకు సిద్ధమమ య్యాయి. 

ఒంగోలు విద్య, నవంబరు 1: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నమోదు కష్టాలొచ్చిపడ్డాయి. నిత్యం యాప్‌లతో కుస్తీపడుతూ మగ్గిపోతున్నారు. పాఠశాల నిర్వహణలో యాప్‌ల ప్రవేశంపై వారంతా భగ్గుమంటున్నారు. ప్రాథమిక పాఠశాలలైతే ఒకరు, ప్రాథమికోన్నత పాఠశాలలో అయితే ఇద్దరు లేక ముగ్గురు టీచర్లకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌ల్లో సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయడంతోనే సమయం సరిపోతుంది. విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఈ యాప్‌లతో ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరవుతూ మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. బోధనకు సమయం దొరక్క విద్యార్థులు చదువులు అటకెక్కుతున్నాయి. టీచర్లను బోధనకే పరిమితం చేయాలని విద్యావేత్తలు, మేధావులు కోరుతుండగా అది తప్ప అన్ని పనులకూ ప్రభుత్వం వారి సేవలను వినియోగించుకుంటోంది. విద్యాశాఖలో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు పాఠశాలలను సందర్శించినపుడు యాప్‌లలో సమచారాన్ని అప్‌లోడ్‌ చేశారా.. లేదా? అని అడుగుతున్నారు తప్ప, పిల్లల చదువులు గురించి పట్టించుకోవడం లేదు. 


అన్ని యాప్‌లలో నమోదు

విద్యార్థుల హాజరు పేరుతో ఒక యాప్‌ నడుస్తోంది. అలాగే జగనన్న విద్యాకానుక పేరుతో, పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, యూనిఫాంలు, నోటుపుస్తకాల పంపిణీకి ఒకటి, అమ్మఒడికి సంబంధించి అర్హులను గుర్తించేందుకు ఒకటి, డ్రైరేషన్‌ పేరుతో విద్యార్థులకు పంపిణీ చేస్తున్న బియ్యం, కందిపుప్పు, కోడిగుడ్లు, చిక్కీలు పంపిణీ వివరాలను నమోదు చేసేందుకు ఒక యాప్‌ ఉంది. విద్యార్థులకు బూట్లు సరఫరా చేసేందుకు వారి పాదాల కొలతలు తీసుకునేందుకు మరొకటి.. ఇలా అనేక రకాల యాప్‌లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తాజాగా ఐఎంఎంఎస్‌ పేరుతో మధ్యాహ్న భోజన పథకం వినియోగించే వారు వంట ప్రదేశం, పాత్రలు, స్టోర్‌రూం వండిన గుడ్లు నమోదు చేయాలి. అలాగే టీఎస్‌ఎం పేరుతో పాఠశాలల్లో పరిశుభ్రతలో భాగంగా విద్యార్థులు వినియోగించే టాయిలెట్లు, ఇతరాలపై కోసం యాప్‌ను ప్రవేశపెట్టారు. వీటన్నింటినీ రోజూ నమోదు చేయాల్సిందే.


పనిచేయని సర్వర్లు

సిగ్నల్‌ సంగతి అటుంచితే సర్వర్లు సరిగా పనిచేయకపోవడంతో ఉపాధ్యాయుల అవస్థలు వర్ణనాతీతమయ్యాయి. ఐఎంఎంఎస్‌ యాప్‌లో బాల, బాలికల మరుగుదొడ్లు యాప్‌లలో వేర్వేరుగా కమోడ్స్‌, యూరినల్స్‌కి, వాష్‌బేసిన్‌, ఫ్లోర్‌ మొత్తం 24 ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలి. అదేవిధంగా మధ్యాహ్నం భోజనానికి సంబంధించి వండిన ఆహార పదార్థాలు వేర్వేరుగా వరుస క్రమంలో మొత్తం 20 ఫొటోలను ఆన్‌లైన్‌లో సబ్మిట్‌ చేయాలి. ఉపాధ్యాయులు సొంతఫోన్లలో వేయించుకున్న డేటాతోనే ఇవ్వన్నీ పూర్తిచేయాలి. రోజుకు ఒక అప్‌డేట్‌, అన్‌ ఇన్‌స్టాల్‌, డౌన్‌లోడ్‌, ఇదేపని రిపీటెడ్‌గా చేయాలి. పాఠశాలల్లో కొత్త అడ్మిషన్లు ఆన్‌లైన్‌ నమోదు పెద్ద ప్రహసనంగా మారింది. విద్యార్థులు, తల్లిదండ్రుల పేర్లు, బ్లెడ్‌ గ్రూపులు, పుట్టుమచ్చలు, మెయిల్‌ ఐడీలు, ఇలా చాంతాడంత సమాచారం అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సాఫీగా త్వరగా అవుతాయనుకుంటే అదీ ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్స్‌ ఉండవు. దీంతో అప్‌లోడ్‌లో టీచర్ల అవస్థలు అంతాఇంతా కావు.

 

మీ టాయ్‌లెట్లు బాగాలేవు..

ఒంగోలు సమీపంలోని ఒక పాఠశాలలో మరుగుదొడ్లు సరిగా లేవని విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి ఫోన్‌ రావడంతో అక్కడి ప్రధానోపాధ్యాయుడు అవాక్కయ్యారు. సేవల స్థాయి పెంచకుండా అవి బాగాలేవు, ఇవి అప్‌లోడ్‌ చేయలేదంటూ తాఖీదులు జారీ చేస్తుండటంపై ఉపాధ్యాయలోకంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికతతో పని మరింత సరళం కావాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వ తీరుతో ఉపాధ్యాయుల పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారిందని వారు వాపోతున్నారు. టాయిలెట్ల ఫొటోలు ఎలా తీయాలి అని ప్రశ్నిస్తే అక్కసుతో ఆధికారులు తమను ఎక్కడ టార్గెట్‌ చేస్తారో అని సగటు టీచర్లు భయపడుతూ పనిచేసుకుపోతున్నారు. ఇలాగే పరిస్థితులు కొనసాగితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు ఏవిధంగా మెరుగవుతాయని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. 


నేడు డీఈవో కార్యాలయం ముట్టడి 

విద్యాశాఖలో ఉపాధ్యాయులపై యాప్‌ల భారాన్ని తొలగించాలని కోరుతూ యూటీఎఫ్‌ జిల్లాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం డీఈవో కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు సమాఖ్య రాష్ట్ర నాయకులు కె.శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.రవి, ఒ.వి.వీరారెడ్డి తెలిపారు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవం, మనోభావాలను దెబ్బతీయడంతోపాటు బోధనకు అంతరాయం కలిగిస్తున్న యాప్‌లను తొలగించి, పూర్తిసమయాన్ని బోధనకే కేటాయించేలా చూడాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 


Updated Date - 2021-11-02T06:42:07+05:30 IST