ltrScrptTheme3

దాన్ని కూడా ట్రోల్ చేస్తారా.. ఇక ఆపండి : సమీరా రెడ్డి

Oct 26 2020 @ 10:36AM

సమీరా రెడ్డి... ఆరేళ్ల క్రితం వరకు హాట్‌ బ్యూటీ. ఇప్పుడు ఇద్దరు పిల్లల ముద్దుల తల్లి. అయిదేళ్ల బాబు, ఏడాది పాపతో సంపూర్ణ మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. పిల్లల పెంపకం గురించి, మాతృత్వ మధురిమల గురించి ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూనే ఉంది. అంతే కాదు.. తన శరీరాకృతిని ట్రోల్‌ చేసే నెటిజన్లకు ఎప్పటికప్పుడు గట్టి సమాధానాలు ఇస్తూనే ఉంది. తల్లయ్యాక అప్పుడప్పుడు ఆమె పంచుకున్న భావాలన్నీ ఒక్కచోట చేర్చి అందిస్తున్నాం...


పిల్లల్లో ఒత్తిడి

స్కూళ్లు తెరవలేదు. రోజంతా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. వారికి కూడా ఈ పరిస్థితి కష్టంగానే ఉంటుంది. పిల్లలు కూడా లేనిపోని భయాలకు, ఒత్తిళ్లకు గురవుతున్నారు. అలాంటి లక్షణాలు కనిపించగానే తల్లిదండ్రులు అప్రమత్తమవ్వాలి. భద్రంగా ఉన్నామనే భావన పిల్లల్లో కలిగించాలి. ఉత్సాహాన్ని నింపాలి. మీరు ఎప్పుడూ దిగులుతో కనిపిస్తే.. పిల్లలు కూడా మూడీగా తయారవుతారు.


తల్లిగా మారాక కష్టం 

తల్లిగా మారాక కూడా అందంగా కనిపించడం కొందరికే సాధ్యమవుతుంది. మళ్లీ నేను సన్నగా, అందంగా కనిపించడానికి కాస్త సమయం పడుతుంది. అయినా నాకిప్పుడు అంత తొందరేమీ లేదు. ఇప్పుడు అందం గురించి కాదు, బిడ్డల గురించే ఆలోచించాలి.


ముందుగా సిద్ధమయ్యాకే...

పిల్లల్ని కనాలనుకుంటే వచ్చే శారీరక, మానసికమైన మార్పులకు ముందుగానే సిద్ధపడాలి. నేను నా మొదటి ప్రెగ్నెన్సీకి ఏమాత్రం సిద్ధంగా లేను. ఫలితంగా కోపం, ఫ్రస్ట్రేషన్‌, నాకు నేనే నచ్చకపోవడం లాంటి ఎన్నో భావనలు చుట్టుముట్టాయి. నా భర్త అక్షయ్‌ ఎంతో సహనంతో అండగా నిలిచాడు. రెండో ప్రసవానికి నేను అన్ని రకాలుగా ముందే సిద్ధమయ్యాను.

ట్రోలింగ్‌ ఆపండి

ఓ బిడ్డకు జన్మనివ్వడం అద్భుతమైన అనుభూతి. సృష్టికి సంబంధించిన విషయం. దాన్ని కూడా ట్రోల్‌ చేస్తారా? (గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె లావెక్కిన ఫోటోను పోస్టు చేసింది. అది చూసి కొంతమంది నెటిజన్లు లావుగా ఉన్నారంటూ ట్రోల్‌ చేశారు)


ఆడపిల్లే ముద్దు

మనదేశంలో ఇంకా ఆడపిల్లలను ఎందుకు భారంగా భావిస్తున్నారో ఇప్పటికీ అర్థం కాదు. ఆర్ధికంగా ఉన్నతశ్రేణిలో ఉన్న కుటుంబాలు కూడా మొదటి సంతానంగా అబ్బాయినే కోరుకుంటాయి. అలాంటి వారి ఆలోచనా తీరు మారాలి. మా అమ్మానాన్నలకి మేం ముగ్గురం ఆడపిల్లలమే అయినందుకు చాలా సంతోషిస్తున్నానంటూ బాలికా దినోత్సవం సందర్భంగా ఒక పోస్టు చేసింది.

ఎవరూ పట్టించుకోరు

మనదేశంలో చాలా మంది పట్టించుకోని విషయం ‘పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌’. ప్రసవం అయ్యాక కొంతమంది తల్లులు దీని బారిన పడుతున్నారు. అప్పుడు భర్త, బంధువుల ఆసరా చాలా అవసరం. మొదటి బిడ్డ పుట్టాక నేను ఈ డిప్రెషన్‌కు గురయ్యా. దాదాపు ఏడాదిన్నర పాటు నన్ను నేను ఇంట్లోనే బంధించుకున్నా. బయటికి రాలేదు.


మీకంటూ ఒక సమయం

తల్లిగా మారాక సమయం చిక్కనట్టు అనిపిస్తుంది. రోజులో 24 గంటలు సరిపోవు. మనకోసం సమయమే మిగలదు. అయినా సరే మీ కోసం మీరు కొంత సమయాన్ని కేటాయించు కోవాలి. అది ఎంత తక్కువైనా కూడా మీకంటూ వ్యక్తిగతంగా కొంత సమయాన్ని పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే అన్నీ కోల్పోతున్న భావన వెంటాడుతుంది.

పేరెంటింగ్‌ కష్టమైనదే..

ముందస్తు స్ర్కిప్ట్‌ లేకుండా తల్లిదండ్రుల పాత్రను పోషించాల్సి ఉంటుంది. పిల్లల మనస్తత్వాలను బట్టి మనల్ని మనం మార్చు కోవాల్సి వస్తుంది. నా ఉద్దేశంలో 2020 తరం పిల్లలను పెంచడం అంతసులువు కాదు. 

అన్నింటికీ సిద్ధపడాలి!

తల్లిగా మారుతున్నప్పుడే అన్నింటికీ సిద్ధపడాలి. మాతృత్వం వల్ల మారే శరీరాకృతి, ఎదురయ్యే విమర్శలతో పాటు, ఇంటి బాధ్యతలు, పిల్లల పెంపకం రెండింటినీ నిర్వర్తించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. నిద్రను త్యాగం చేయాలి.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.