ఆగిన మగ్గం

ABN , First Publish Date - 2021-11-27T04:58:12+05:30 IST

జిల్లాలో నెలకొన్న ముసురు చేనేత కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తోంది. మంగు వాతావరణంతో మగ్గం ఆగిపోయింది. వారం నుంచి పనులు లేకపోడంతో పస్తులుండగాల్సి వస్తున్నదని నేతన్నలు వాపోతున్నారు. ఒరుపు వాతావరణం ఉంటేనే నేత పని సాగుతుంది. జిల్లాలో వారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. తడి వాతావరణంతో పోగులు ఒకదానితో ఒకటి కలిసిరావడం లేదు. దీంతో మగ్గం ఆపాల్సి వచ్చింది.

ఆగిన మగ్గం
ఆగిన మగ్గంపై ఉన్న సగం నేసిన చీర

మంగువాతావరణంతో

నిలిచిన పనులు 

వంద యూనిట్ల ఉచిత కరెంటు 

ప్రకటనలకే పరిమితం

పట్టించుకోని ప్రభుత్వం

ఆవేదన వ్యక్తం చేస్తున్న నేతన్నలు

చీరాల, నవంబరు 26 :  జిల్లాలో నెలకొన్న ముసురు చేనేత కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తోంది. మంగు వాతావరణంతో మగ్గం ఆగిపోయింది. వారం నుంచి పనులు లేకపోడంతో పస్తులుండగాల్సి వస్తున్నదని నేతన్నలు వాపోతున్నారు.  ఒరుపు వాతావరణం ఉంటేనే నేత పని సాగుతుంది. జిల్లాలో వారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. తడి వాతావరణంతో పోగులు ఒకదానితో ఒకటి కలిసిరావడం లేదు. దీంతో మగ్గం ఆపాల్సి వచ్చింది. ఉపవృత్తుల పనులూ నిలిచిపోయాయి. దీంతో చేనేత రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసే వేలాది మంది ఉపాధి కోల్పోయారు. ఏ రోజుకారోజు కూలి (మజూరీ)తో కుటుంబాన్ని పోషించుకునే వారికి కష్టాలు తప్పలేదు. వారు అరువుకోసం అగచాట్లు పడుతున్నారు. ఇదిలా ఉంటే కొందరి మగ్గాలపై ఉన్న నూలు, ఇతర ఆధారాలు తడిసిపోయాయి. దీంతో తమకు పరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని  కోరుతున్నారు.

ఉచితం.. ఒట్టిమాట

మగ్గాలపై పనిచేసే వారు ఇంటికి వినియోగించే విద్యుత్‌ను వంద యూనిట్లలోపు వాడితే  ఉచితంగా సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి జీవో ఇచ్చినా అమలు కావటం లేదు. వంద యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించిన వారు కూడా బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఇదేమని విద్యుత్‌శాఖ అధికారులను అడిగితే అందుకు సంబంధించి తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలే దని చెప్తున్నారు.  

జీవోను అమలు చేయాలి

సాధారణంగా ఒరుపు వాతావరణంలోనే మగ్గం పని సాగుతుంది. కొద్దిపాటి మబ్బులుపట్టి ఉన్నప్పుడు మగ్గంపై ఉన్న లైటు నుంచి వచ్చే వేడి ద్వారా పని జరిగేది. అయితే, వంద యూనిట్లలోపు ఉచితం అనటంతో సాధారణ బల్బుల బదులు ఎల్‌ఈడీవి వినియోగిస్తున్నారు. వీటినుంచి కాంతి వస్తుంది కాని ఎక్కువ వేడిరాదు. దీంతో అటు ఉచితం దక్కక, ఇటు బిల్లులు చెల్లించాల్సి వచ్చి అన్నివిధాలా తాము ఇబ్బందు పడుతున్నామని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పాలకులు, అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుని తమకు మెరుగైన జీవనం కల్పించాలని కోరుతున్నారు.

రెవెన్యూ అధికారుల నివేదికవస్తే తగిన చర్యలు చేపడతాం: 

- ఉదయ్‌భాస్కర్‌, ఏడీ హ్యాండ్లూమ్స్‌, చీరాల

ఇప్పటివరకు చేనేత రంగానికి సంబంధించి మగ్గాలకు ఎలాంటి నష్టం జరగలేదు. అయితే వేటపాలెం మండలం దేశాయిపేటలో ఇంటి పైకప్పు సరిలేక పోవటంతో ఒక మగ్గం తడిసింది. మంగు వాతారణంతో పని కుంటుపడిన మాట వాస్తవమే. వీటికి సంబంధించి ముందస్తుగా రెవెన్యూ అధికారులు నివేదిక తయారుచేస్తారు. వారు ఇచ్చే నివేదిక మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.


Updated Date - 2021-11-27T04:58:12+05:30 IST