బ్రేక్‌!

ABN , First Publish Date - 2021-12-07T05:07:28+05:30 IST

మండల పరిధిలోని మేడిపల్లి, నానక్‌నగర్‌ గ్రామాల

బ్రేక్‌!
మేడిపల్లి- నానక్‌నగర్‌ గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీ రహదారి

  • నిలిచిన ఫార్మాసిటీ రహదారి పనులు
  • పరిహారం కోసం కోర్టుకు వెళ్లిన రైతులు
  • కోర్టు స్టే కారణంగానే పనులు ఆగినవని వదంతులు
  • తాత్కాలికంగానే పనులు నిలిపివేశామంటున్న అధికారులు


యాచారం : మండల పరిధిలోని మేడిపల్లి, నానక్‌నగర్‌ గ్రామాల మధ్య ఫార్మాసిటీలో కొనసాగుతున్న రహదారి నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. కాగా, తాత్కాలికంగానే పనులు నిలిచాయని, చెప్పుకోదగ్గ కారణాలు లేవని అధికారులు చెబుతున్నారు. పరిహారం విషయంలో పలువురు రైతులు, తాము ఉపాధి కోల్పోతున్నామని, తమ పరిస్థితి ఏమిటని వ్యవసాయ కూలీలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే కారణంగా రహదారుల పనులు నిలిచిపోయాయని కూడా వినిపిస్తోంది. అధికారులు మాత్రం దీనిని ధ్రువీకరించడం లేదు. 

కాగా ప్రధాన రహదారుల నుంచి ఫార్మాసిటీ భూముల్లోకి రూ.50కోట్ల నిధులతో లింకురోడ్ల నిర్మాణం కొనసాగుతోంది. ఈ భూముల్లో  ఉన్న  గుట్టలను తొలగించి రెండున్నర కిలోమీటర్ల మేర రహదారి వేశారు.  సుమారు వంద మంది కార్మికులు రాత్రింబవళ్లు పనులు చేసి కొండలు, బండరాళ్లను తొలగించారు. కాగా పది రోజులుగా ఇక్కడ రహదారి పనులు ఆగిపోయాయి. రహదారి పనులు చేసే కూలీల కోసం వేసిన గుడారాలు కూడా తొలగించారు. అదేవిధంగా పల్లెచెల్కతండా వరకు రహదారి విస్తరణ పనులు కొంత మేర చేసి వదిలేశారు. 


ప్రమాదకరంగా రహదారి

ఫార్మాసిటీలో అంతర్గత రహదారుల కోసం 120ఫీట్ల మేర కొండను తొలగించి చదును చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పలుచోట్ల బండరాళ్లు కూలాయి. రహదారికి ఆనుకొని ప్రమాదకరంగా భారీ బండరాళ్లు ఏ క్షణంలో కూలుతాయో తెలియని పరిస్థితి. ఆ ప్రాంతం నుంచి బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నట్లు రైతులు తెలిపారు. 


కనుమరుగవుతున్న కుంటలు

ఫార్మాసిటీ భూముల్లో ఉన్న కుంటలు, చెక్‌డ్యాంలు కనుమరుగవుతున్నాయి. రహదారికి ఆనుకొని ఉన్న కుంటను బండరాళ్లతో నింపుతున్నారు. కుంటలు నామరూపాలు లేకుండా పోతున్నాయి. దీంతో భవిష్యత్తులో మూగజీవాల దప్పిక తీర్చడం గగనమేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఫార్మాసిటీ కోసం 19,333 ఎకరాల భూములు సేకరించాల్సి ఉండగా.. ఇప్పటివరకు ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు కలిపి 4వేల ఎకరాలు సేకరించారు. పట్టాభూములు ఆరువేల ఎకరాలకుగాను నాలుగువేల ఎకరాలు సేకరించారు. మరో రెండు వేల ఎకరాల భూములపై కోర్టు కేసులు నడుస్తున్నాయి.


భూములులేని కూలీలకు ఉపాధి చూపాలి 

ఫార్మాసిటీ కోసం భూములు కోల్పోతున్న గ్రామాల్లో కూలీలకు ప్రత్యామ్నాయం చూపకుండా పనులు చేపట్టరాదని కోర్టును ఆశ్రయించారు. అంతేగాక భూసేకరణ చట్టబద్దంగా లేదనేది కూడా ఓ వాదనగా ఉంది. ఈ విషయంలో కోర్టు స్టే మంజూరు చేసింది. 

- కవుల సరస్వతి, సామాజిక కార్యకర్త


తాత్కాలికంగా పనులు ఆగాయి

సాంకేతిక కారణాలతో ఫార్మాసిటీ భూముల్లో తాత్కాలికంగా రహదారి పనులు ఆగాయి. త్వరలో మళ్లీ పనులు చేపడతాం. పనులు ఆగడంపై కొంత మంది తప్పుడు ప్రచారం చేయడం మంచిదికాదు. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. యుద్ధ ప్రాతిపదికన భూములను అభివృద్ది చేస్తాం.       

- వెంకటాచారి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో



Updated Date - 2021-12-07T05:07:28+05:30 IST