దుకాణాల వేలం వాయిదా

ABN , First Publish Date - 2021-07-27T04:16:36+05:30 IST

ఏడాదిన్నర కాలంగా పట్టణ వ్యాపారులు ఎదురుచూస్తున్న ఐడీఎస్‌ఎంటీ దుకాణాల వేలం అభ్యంతరాల నడుమ వాయిదా పడింది.

దుకాణాల వేలం వాయిదా
కమిషనర్‌తో వాగ్వాదానికి దిగిన కౌన్సిలర్లు

- నిబంధనలు అతిక్రమించారని మునిసిపల్‌ చైర్మన్‌ ఆగ్రహం

- అధికారులతో కౌన్సిలర్ల వాగ్వాదం - రద్దు చేయాలని డిమాండ్‌

- నెలాఖరులోగా కౌన్సిల్‌ సమావేశం నిర్వహించి నిర్ణయం : కమిషనర్‌

గద్వాల టౌన్‌, జూలై 26 : ఏడాదిన్నర కాలంగా పట్టణ వ్యాపారులు ఎదురుచూస్తున్న ఐడీఎస్‌ఎంటీ దుకాణాల వేలం అభ్యంతరాల నడుమ వాయిదా పడింది. ఒప్పందం గడువు ముగిసిన వాటితో పాటు, ఖాళీగా ఉన్న 35 దుకాణాలకు అధికారులు సోమవారం వేలంపాటకు సిద్ధమయ్యారు. అయితే టెండరు నోటీసులో పేర్కొన్న నిబంధనలు పాటించ లేదని, వేలం నిర్వహించొద్దని కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు. వేదిక వద్దకు చేరుకొని వేలం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కౌన్సిల్‌ ఆమోదం లేకుండానే డీడీలకు బదులు ఆర్జీదారుల నుంచి రూ.1, 2, 3 లక్షల వరకు ధరావత్తు సొమ్మును నగదు రూపంలో ఎలా స్వీకరిస్తారని ప్రశ్నించారు. వేలం వేస్తున్న దుకాణాల్లో కొన్నింటిపై న్యాయస్థానంలో అభ్యంతరాలున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. కలెక్టర్‌ అనుమతితో వేలం నిర్వహిస్తు న్నామని కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి వివరించేందుకు యత్నించగా, అదే విషయాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని కౌన్సిలర్లు పట్టుపట్టారు. ఈ దశలో అక్కడికి చేరుకున్న మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ కౌన్సిలర్ల అభ్యంతరాలను బలపరుస్తూ, డిపాజిట్లను నగదు రూపంలో తీసుకోవాలని ఎవరు చెప్పారంటూ కమిషనర్‌, మేనేజర్లను ప్రశ్నించారు. తనకు కూడా కనీస సమాచారం ఇవ్వకుండా నగదు ఎలా స్వీకరిస్తారని, ఇది ప్రజలను  మోసగించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


తీవ్ర గందరగోళం

దుకాణాల వేలం నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తుండగా, చైర్మన్‌ సహా కౌన్సిలర్లు అందరూ వేలం వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ వాగ్వాదానికి దిగడంతో దాదాపు గంటకు పైగా తీవ్ర గందరగోళం నెలకొన్నది. అధికారుల సమాచారం మేర కు అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ స్పందిస్తూ తనకు తెలియకుండా పోలీసులను రప్పిం చడం సరికాదన్నారు. వారు తమను లోనికి రానివ్వ కుండా అడ్డుకున్నారని పలువులు కౌన్సిలర్లు చైర్మన్‌కు తెలిపారు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో వేలం వాయిదా వేస్తు న్నామని చైర్మన్‌ ప్రకటించగా, వాయిదాపై నిర్ణయం తీసుకోలేదని కమిషనర్‌ అనడంతో దరఖాస్తుదారులు సందిగ్ధానికి గురయ్యారు. అనంతరం చైర్మన్‌ ఛాం బర్‌లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు, కమిషనర్‌, మేనేజర్‌ సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం వేలాన్ని వాయిదా వేస్తున్నట్లు కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ నెలాఖరులోగా కౌన్సిల్‌ సమావేశం నిర్వహించి, దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. వేలం ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని తెలిపారు.

Updated Date - 2021-07-27T04:16:36+05:30 IST